వందేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ.. ఏ ‘మందు’తో చెక్ పెట్టారో తెలిస్తే అవాక్కవుతారు

ABN , First Publish Date - 2021-05-27T23:21:29+05:30 IST

ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి బారిన పడి ఎంతటి కష్టాలు పడుతుందో, వందేళ్ల క్రితం కూడా ఇలాగే ప్రపంచాన్ని పట్టి పీడించిందో మహమ్మారి.

వందేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ.. ఏ ‘మందు’తో చెక్ పెట్టారో తెలిస్తే అవాక్కవుతారు
(ప్రతీకాత్మక చిత్రం)

ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి బారిన పడి ఎంతటి కష్టాలు పడుతుందో, వందేళ్ల క్రితం కూడా ఇలాగే ప్రపంచాన్ని పట్టి పీడించిందో మహమ్మారి. ప్రపంచ జనాభాలో 3 నుంచి 5శాతాన్ని పొట్టనబెట్టుకున్న ఆ మహమ్మారి స్పానిష్ ఫ్లూ. ఎక్కడ పుట్టిందో తెలియదు. ఎలా ప్రపంచం మొత్తం పాకిందో కూడా తెలియదు.. కానీ అందరి ప్రాణాలను మాత్రం బలితీసుకుందీ మహమ్మారి. అయితే దీన్ని నిలువరించడం కోసం అప్పటి డాక్టర్లు ప్రధానంగా ఎంచుకున్న మెడిసిన్ ఏంటో తెలిస్తే అవాక్కవుతారు. అదేంటంటే విస్కీ. అవునండీ ఉదయాన్నే నిద్రలేవగానే మందు బాబులు దేనికోసం గిలగిల్లాడుతారో ఆ విస్కీనే. ఇప్పటికీ ‘మహమ్మారుల మాత’గా పిలిచే స్పానిష్ ఫ్లూను.. విస్కీ ఎలా అడ్డుకుందో తెలసుకోవాలనుందా? అయితే మరెందుకాలస్యం చదివేయండి మరి.


ఇప్పుడు కరోనా కారణంగా ప్రపంచంలోని ఆస్పత్రుల్లో బెడ్లు ఎలా నిండిపోయాయో.. 1918 ప్రాంతంలో స్పానిష్ ఫ్లూ సమయంలో కూడా అవే దృశ్యాలు కనిపించాయి. దీనికి తోడు అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం కూడా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒక పక్క యుద్ధం, మరో పక్క స్పానిష్ ఫ్లూ.. ప్రపంచ చరిత్రలో ఆ సమయాన్ని భయానక పీడకలగా మార్చాయి. ఆ సమయంలో స్పానిష్ ఫ్లూ పేషెంట్లకు చిన్నా పెద్దా తేడా లేకుండా వైద్యులు ప్రిస్క్రయిబ్ చేసిన ఔషధం విస్కీ. ఇది రోగనిరోధక శక్తిని మేల్కొలపడానికే కాక, నిద్ర పుచ్చే మత్తు మందులా కూడా పనిచేసేది. అందుకే వైద్యులు దీన్ని కచ్చితంగా పేషెంట్లకు అందజేసేవారు. దీంతో అప్పట్లో విస్కీకి విపరీతమైన డిమాండ్ వచ్చింది. సాధారణంగా అమ్మే దానికన్నా మూడు రెట్లు అమ్మకాలు జరిగినట్లు ఆ కాలంనాటి కొందరు వ్యాపారులు చెప్పారు.


1918లో చికాగోలోని నేవల్ స్టేషన్ గ్రేట్ లేక్స్‌లో నర్సుగా సేవలందించిన అమెరికా నేవీ నర్స్ జోసీ మాబెల్ బ్రౌన్.. స్పానిష్ ఫ్లూ సమయంలో విస్కీ వాడకం గురించి వివరించారు. ‘‘పేషెంట్ల సంఖ్య భారీగా ఉండేది. దీంతో వారి టెంపరేచర్ తీసుకునే సమయం కూడా ఉండేది కాదు. ఇక ట్రీట్‌మెంట్ ఇచ్చే టైం కూడానా? వాళ్లందరికీ కొంచెం విస్కీతో చేసిన కషాయం ఇచ్చేవాళ్లం. అది చేయడానికి మాత్రమే మాకు టైం ఉండేది. దీనివల్ల కొందరికి ముక్కుల్లోంచి విపరీతంగా రక్తం కారేది. కొంతమందికి భ్రమలు కలిగేవి’’ అని ఆమె వివరించారు. ఆ తర్వాత ఆమెకు కూడా స్పానిష్ ఫ్లూ సోకిందిట. ఆ సమయంలో 104 నుంచి 105 డిగ్రీల జ్వరం రావడంతో ఆమె తలమీద, గుండెల మీద, మెడ చుట్టూ ఐస్ మూటలు కట్టారని జోసీ గుర్తుచేసుకున్నారు. ‘‘గ్రేట్ లేక్స్‌లో అప్పట్లో 1,73,000 మంది ప్రజలు ఉండేవారు. ఈ మహమ్మారి విపరీతంగా ఉన్నప్పుడు 6వేల ఆస్పత్రులు ఉన్నాయ్. ఎంతమంది చనిపోయారో ఎవరికీ తెలియదనే అనుకుంటున్నా. వాళ్లు మాత్రం ఎంత మందిని లెక్క పెట్టగలరు?’’ అని ఆమె చెప్పింది.


ఇప్పటికీ ప్రపంచానికి పీడకలలే మిగిల్చిన స్పానిష్ ఫ్లూ ఎక్కడ పుట్టిందో ఎవరికీ తెలియదు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో స్పెయిన్ దేశం ఎవరి పక్షమూ తీసుకోలేదు. యుద్ధంలో పాల్గొనలేదు. అందుకే ఇక్కడ మీడియాపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. దీంతో మహమ్మారి వల్ల ఎంత మంది చనిపోయారనే లెక్క ఎప్పటికప్పుడు మీడియాలో వచ్చేసేది. అప్పట్టో స్పెయిన్ రాజు కూడా తనకు వైరస్ సోకిందని వెల్లడించారు. ఆ సమయంలో ఈ దేశం ఇలా మరణాల వివరాలను విడుదల చేయడంతో దీన్ని ‘స్పానిష్ ఫ్లూ’ అనడం మొదలుపెట్టారు. సమయం గడిచే కొద్దీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రోగులను ఐసోలేట్ చేయడం ద్వారా స్పానిష్ ఫ్లూను నిలువరించగలిగారు. కానీ ఇది కూడా ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. చిన్న జన్యు మార్పుతో కొత్త వైరస్ స్ట్రెయిన్ పుట్టేది. ఈ వైరస్ నుంచి చాలా వైరస్‌లు పుట్టుకొచ్చాయి. 2009లో ప్రపంచాన్ని వణికించిన స్వైన్ ఫ్లూ కూడా దీని వారసురాలే. ఈ స్వైన్ ఫ్లూ నుంచి బర్డ్ ఫ్లూ పుట్టింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఏమో 2002లో గబ్బిలాల నుంచి పుట్టిన సార్స్ వైరస్‌ను పోలి ఉంది.


ఐర్లాండ్‌లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతమంది మరణించారో స్పానిష్ ఫ్లూకు కూడా అన్నే ప్రాణాలు పోయాయి. ఇక్కడి వైద్యులు ఫ్లూతో పోరాడటానికి విస్కీనే నమ్ముకున్నారు. పేషెంట్లతోపాటు నర్సులు, డాక్టర్లకు కూడా వైరస్ వ్యాప్తి చెందకుండా విస్కీనే ఉపయోగించారు. పేషెంట్లకు కూడా ఇదే దివ్యౌషధంలా ఉపయోగించారు. చాలా మంది కోలుకున్నారు కూడా. మరి ఇప్పుడు కరోనాకు కూడా ఇలానే చేయొచ్చుగా అని డౌట్ రావచ్చు ఎవరికైనా. కానీ అప్పట్లో ఆల్కహాల్ మీద పరిశోధనలు చాలా తక్కువగా జరిగాయి. వందేళ్లలో దీనిపై చాలా పరిశోధనలు జరిగాయి. ఏ పరిశోధనలోనూ ఆల్కహాల్ వల్ల వైద్యపరంగా ఉపయోగం ఉంటుందని తేలలేదు. కాబట్టి స్పానిష్ ఫ్లూ సమయంలోలాగా విస్కీని గుడ్డిగా నమ్మి కూర్చోకూడదు. అలాగే పెయిన్‌కిల్లర్లతో ఆల్కహాల్ కలిస్తే మళ్లీ అల్సర్లు, కడుపులో రక్తస్రావాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా లేక తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నా ఆల్కహాల్ విషయంలో డాక్టరు సలహా తీసుకోవడం ఉత్తమం.

Updated Date - 2021-05-27T23:21:29+05:30 IST