గృహ, వాహన రుణాలపై వడ్డీ ఎంత తగ్గుతుందంటే !

ABN , First Publish Date - 2020-05-23T07:39:14+05:30 IST

ఆర్‌బీఐ రెపో రేటు 4.4 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. ఈ ప్రభావం జూలై త్రైమాసికం నుంచి బ్యాంకుల గృహ, వాహన రుణాలపైనా పడనుంది. ప్రస్తు తం బ్యాంకులు గృహ రుణాలపై 7.15 శాతం నుంచి 7.8 శాతం వడ్డీ వసూలు...

గృహ, వాహన రుణాలపై వడ్డీ ఎంత తగ్గుతుందంటే !

  • తగ్గిన రేట్లు జూలై త్రైమాసికం నుంచి అమలు


ఆర్‌బీఐ రెపో రేటు 4.4 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. ఈ ప్రభావం జూలై త్రైమాసికం నుంచి బ్యాంకుల గృహ, వాహన రుణాలపైనా పడనుంది. ప్రస్తు తం బ్యాంకులు గృహ రుణాలపై 7.15 శాతం నుంచి 7.8 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. తాజా చర్యలతో ఈ రుణాలపై వడ్డీ రేటు మరో 0.4 శాతం తగ్గనుంది. 


భారం ఎంత తగ్గుతుంది ?

ఒక వ్యక్తి 20 ఏళ్లలో చెల్లించేలా 7.65 శాతం వడ్డీతో రూ.50 లక్షల గృహరుణం తీసుకున్నాడనుకుందాం. ఈ వడ్డీ రేటు ప్రకారం ప్రస్తుతం అతడి ఈఎంఐ రూ.40,739. ఆర్‌బీఐ నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకు ఈ గృహ రుణంపై వడ్డీ రేటు 0.40 శాతం తగ్గిస్తే, వడ్డీ రేటు 7.65 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గుతుంది. దాంతో ఆ వ్యక్తి చెల్లించాల్సిన ఈఎంఐ కూడా రూ.1,220 తగ్గి రూ.39,519 అవుతుంది.


రూ.45 లక్షల రుణంపై 

అదే వ్యక్తి పాతికేళ్లలో చెల్లించేలా 7.65 శాతం వడ్డీ రేటుతో రూ.45 లక్షల గృహ రుణం తీసుకున్నాడనుకుందాం. బ్యాంకు వడ్డీ రేటును 7.25 శాతానికి తగ్గిస్తే, అతడి ఈఎంఐ భారం రూ.32,526 నుంచి రూ.31,301కి తగ్గుతుంది. ఇదే సమయంలో కొద్దిగా ఆర్థిక స్థోమత ఉండి, గతంలో చెల్లించిన ఈఎంఐ చెల్లింపులే కొనసాగిస్తే, ఆ వ్యక్తి రుణ చెల్లింపు గడువు 25 నెలలు తగ్గి రూ.8.33 లక్షలు ఆదా అవుతాయి. 


వాహన రుణాలు

వాహన రుణాలదీ ఇది పరిస్థితి. ఒక వ్యక్తి ఏడేళ్లలో చెల్లించేలా 7.95 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల రుణం తీసుకున్నాడనుకుందాం. ఈ వడ్డీ రేటు ప్రకారం ప్రస్తుతం అతడు నెలనెలా రూ.7,781 చొప్పున ఈఎంఐ చెల్లించాలి. ఆర్‌బీఐ రెపో రేటుకు అనుగుణంగా వడ్డీ రేటు 0.40 శా తం తగ్గి 7.55 శాతానికి చేరితే.. ఈఎంఐ భారం నెలకు  రూ.7,781 నుంచి రూ.7,681కు తగ్గుతుంది. అంటే ఏడేళ్ల లో రూ.8,400 ఆదా అవుతాయి. అదే రూ.10 లక్షల వాహ న రుణం తీసుకుని ఉంటే రూ.16,632 ఆదా అవుతాయి.


ఎఫ్‌డీలపై తగ్గనున్న వడ్డీ రేటు!

ఆర్‌బీఐ చర్యల ప్రభావం బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా పడనుంది. నిధుల సమీకరణ ఖర్చులు తగ్గించుకునేందుకు, బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తప్పించుకోక తప్పని పరిస్థితి. దీంతో స్థిర ఆదాయం కోసం చెల్లింపులకు ఢోకా ఉండదని బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లనే నమ్ముకునే సీనియర్‌ సిటిజన్ల ఆదాయాలకు మరింత గండి పడే ప్రమాదం ఉంది. 

Updated Date - 2020-05-23T07:39:14+05:30 IST