అడ్వాన్స్‌పై ఆసక్తి

ABN , First Publish Date - 2021-04-16T04:49:49+05:30 IST

ఆస్తి పన్ను అడ్వాన్స్‌గా చెల్లించిన వారికి మొత్తం పన్నులో ఐదు శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఈ నెలాఖరు వరకు ఇందుకు అవకాశం కల్పించింది.

అడ్వాన్స్‌పై ఆసక్తి
కౌంటర్‌ దగ్గర గుమికూడిన జనాలు

ఆస్తి పన్ను చెల్లింపునకు ఈ నెలాఖరు వరకు గడువు

ఐదు శాతం రాయితీ.. రూ.60 లక్షల వసూలు

కౌంటర్‌ దగ్గర కనీస వసతులు కరువు

అమలుగాని కొవిడ్‌ నిబంధనలు

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 15: ఆస్తి పన్ను అడ్వాన్స్‌గా చెల్లించిన వారికి మొత్తం పన్నులో ఐదు శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఈ నెలాఖరు వరకు ఇందుకు అవకాశం కల్పించింది. 2021-22 సంవత్సరానికి సంబంధించిన అడ్వాన్స్‌గా పన్ను చెల్లించే వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాలమూరు పురపాలిక కౌంటర్‌ వద్ద జనం బారులు తీరుతున్నారు. కౌంటర్‌ వద్ద గుంపులుగా జనం పోగవుతున్నారు. ఇప్పటి వరకు రూ.60 లక్షల వరకు చెల్లింపులు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా కరోనా విజృంభిస్తున్న వేళ కౌంటర్‌ దగ్గర మునిసి పల్‌ అధికారులు కనీస వసతులు, జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఒకటే కౌంటర్‌ ఏర్పాటు చేయడం, క్యూలైన్‌ లేకపోవడం, సర్వర్‌ సతాయించడంతో ఎక్కువ సేపు జనాలు నిలబడాల్సి వస్తోంది. కనీసం శానిటైజర్‌ ఏర్పాటు చేయడం గానీ, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని చాటుతోంది. ఇప్పటికే మునిసిపాలిటీలో పలువురు అధికారులు, సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు. అయినా జాగ్రత్తలు తీసుకోకపోవడం, టెంట్‌ వేయకపోవడం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కౌంటర్‌ దగ్గర కనీస వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అడ్వాన్స్‌ చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో తక్కువ మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. రూ.20 కోట్ల వరకు ఆస్తి పన్నులు చెల్లించాల్సిన పుర పాలికలో ఇప్పటి వరకు మూడు శాతం మాత్రమే అడ్వాన్స్‌ పన్నుల చెల్లింపులు జరిగాయి. భూత్పూర్‌ మునిసిపాలిటీలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ప్రజలకు పెద్దఎత్తున అవ గాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2021-04-16T04:49:49+05:30 IST