ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి

ABN , First Publish Date - 2022-05-21T05:40:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాం తోటల సాగుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పంటల సాగు కోసం ప్రభుత్వం సైతం ప్రత్యేక రాయితీ సౌకర్యం కల్పిస్తోంది.

ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి
నర్సరీలో పెంచుతున్న ఆయిల్‌పాం మొక్కలు

- జిల్లాలో ఆయిల్‌పాం సాగుపై ఉద్యానవన శాఖ కసరత్తు

- సాగుకు అనుకూలమైన నేలలు

- 65వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేందుకు అధికారుల చర్యలు

- తోటల పెంపకంపై రైతులకు అవగాహన

- 12,500 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు ముందుకు


కామారెడ్డి టౌన్‌, మే 20: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాం తోటల సాగుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పంటల సాగు కోసం ప్రభుత్వం సైతం ప్రత్యేక రాయితీ సౌకర్యం కల్పిస్తోంది. జిల్లాలోని ఆయిల్‌పాం సాగుకు ఇక్కడి నేలలు అనుకూలంగా ఉండడం, వాతావరణం కూడా అనుకూలిస్తుండడంతో ఉద్యానవనశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలో 65వేల ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలను సాగు చేసేందుకు ఉద్యానవనశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పంటల సాగుకు సైతం రైతులు ఆసక్తి చూపుతుండడంతో పంటల సాగుకు ఇది వరకే దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు 17 మండలాల్లో 181 మంది రైతులు ఆయిల్‌పాం సాగుకు ఉద్యానవన శాఖకు దరఖాస్తులు పెట్టుకున్నారు. జిల్లాలో ఆయిల్‌పాం పంటల సాగుకు నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేట్‌ కంపెనీకి కేటాయించింది.

ఆయిల్‌పాం సాగు లక్ష్యం 65వేల ఎకరాలు

రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా వచ్చే జిల్లాలో ఆయిల్‌పాం పంటలు సాగయ్యేలా రైతులను చైతన్య పరచాలని ఉద్యానవన శాఖకు బాధ్యతలను అప్పగించింది. జిల్లాలో 65వేల ఎకరాల్లో ఈ పంట సాగయ్యేలా ఉద్యానవనశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీని సైతం ఇస్తోంది. మొదటి ఏడాది రూ.26వేలు తర్వాత రెండేళ్లకు రూ.5వేల చొప్పున సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయిల్‌పాం మొక్కలను నాటిన నుంచి 4 సంవత్సరాలకు దిగుబడులు రానున్నాయి. మొదటి నాలుగు సంవత్సరాల్లో రెండు నుంచి మూడు టన్నులలో దిగుబడులు వస్తాయని 7 సంవత్సరాల తర్వాత 10 నుంచి 12 టన్నుల్లో దిగుబడులు వస్తాయని ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఆయిల్‌పాం పంటల దిగుబడులకు మంచి లాభాలు ఉన్నాయి. మార్కెట్‌లో టన్ను ఆయిల్‌పాం రూ.12వేల వరకు ధర ఉంది. దీంతో ఈ పంటలను సాగు చేస్తే రైతులు లాభాల బాటా పడుతారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పంటల సాగును ప్రోత్సహిస్తోంది.

12,500 ఎకరాల్లో పంట సాగు

జిల్లాలో ఆయిల్‌పాం పంటసాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించడం, ప్రైవేట్‌ కంపెనీకి తోటల నిర్వహణ బాధ్యత అప్పగించడం, ఈ పంట సాగుకు అనుకూలమైన నేలలు, వాతావరణం జిల్లాలో ఉండడంతో రైతులు ముందుకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఓ ఆయిల్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఉద్యానవనశాఖ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 17 మండలాల్లో నుంచి 181 మంది రైతులు 12,500 ఎకరాలలో ఆయిల్‌పాం పంటల సాగుకు దరఖాస్తులు పెట్టుకున్నారు. బాన్సువాడలో 10 ఎకరాలు, భిక్కనూర్‌లో 100, బీబీపేటలో 17, బిచ్కుందలో 158, బీర్కూర్‌లో 65, దోమకోండలో 80, గాంధారిలో 33, జుక్కల్‌లో 208, కామారెడ్డిలో 34, మద్నూర్‌లో 10, నస్రూల్లాబాద్‌లో 12, నిజాంసాగర్‌లో 7, పిట్లంలో 12, రామారెడ్డిలో 17, సదాశివనగర్‌లో 95, తాడ్వాయిలో 265 ఎకరాలలో ఆయిల్‌పాం తోటల సాగుకు రైతులు దరఖాస్తు పెట్టుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి రైతులు ఈ పంటసాగుకు ఆసక్తి చూపుతున్నట్లు ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీరందరికీ ప్రైవేట్‌ కంపెనీ భాగస్వామ్యంతో ఆయిల్‌పాం సీడ్లను అందించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.


Updated Date - 2022-05-21T05:40:42+05:30 IST