మళ్లీ వడ్డీ రాయితీ

ABN , First Publish Date - 2021-03-04T08:17:14+05:30 IST

ఆస్తిపన్ను బకాయిలను 90 శాతం వడ్డీ రాయితీతో చెల్లించేందుకు ప్రభుత్వం మరోసారి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు (ఓటీఎస్‌) అవకాశం కల్పించింది.

మళ్లీ వడ్డీ రాయితీ

  • ఆస్తిపన్ను బకాయిల చెల్లింపులకు 
  • అవకాశం కల్పిస్తూ వన్‌టైం సెటిల్‌మెంట్‌కు జీవో
  • నెలాఖరు వరకు గడువు.. 90శాతం రాయితీ

హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఆస్తిపన్ను బకాయిలను 90 శాతం వడ్డీ రాయితీతో చెల్లించేందుకు ప్రభుత్వం మరోసారి  వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు (ఓటీఎస్‌) అవకాశం కల్పించింది. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ పథకం అమలు కోసం పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిలను వడ్డీలో 90 శాతం రాయితీతో ఈనెల 31 వరకు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. కొవిడ్‌-19 ప్రభావం, ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఓటీఎ్‌సను మొదటిసారిగా నిరుడు ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబరు 16 నుంచి అక్టోబరు 31 వరకు మొదటి దఫా పొడిగించగా... అనంతరం నవంబరు 30 వరకు మరోసారి పొడిగించారు. 


దీంతో జీహెచ్‌ఎంసీలో పేరుకుపోయిన రూ.275 కోట్ల బకాయిలు వసూలయ్యాయి. వాస్తవానికి రూ.2500 కోట్ల వరకు బకాయిలు ఉండగా... ప్రభుత్వ విభాగాల పెండింగ్‌ పన్నులు మినహాయిస్తే.. 2.5 లక్షల ప్రైవేట్‌ ఆస్తుల పన్ను బకాయిలు రూ.1400 కోట్ల వరకు రావాల్సి ఉంది. వీటిలో రూ.275 కోట్లు వసూలయ్యాయి. కొవిడ్‌ అనంతరం ఓటీఎ్‌సను ప్రకటించడం.. కరోనాతో ఇబ్బందులు, రికార్డు స్థాయి వర్షాలు వరదల నేపథ్యంలో ఆశించిన స్పందన రాలేదని భావించిన జీహెచ్‌ఎంసీ అధికారులు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి రెండు నెలల క్రితం లేఖ రాశారు. సానుకూలంగా స్పందించిన సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓటీఎ్‌సకు నాలుగోసారి అవకాశం కల్పించినట్టయ్యింది. 


పన్ను కంటే వడ్డీ అధికం

గడువు దాటిన అనంతరం వాస్తవ పన్నుకు ప్రతి నెలా రెండు శాతం వడ్డీ కలుస్తుంది. రెండు, మూడు సంవత్సరాలు వివిధ కారణాలతో పన్ను చెల్లించని యజమానులు.. వాస్తవ పన్ను కంటే వడ్డీ ఎక్కువవుతుండడంతో పన్ను చెల్లింపునకు ముందుకు రావడం లేదు. నోటిసులిచ్చినా యజమానులు స్పందించకపోవడంతో.. రాయితీ యోచన తెరపైకి వచ్చింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన మొండి బకాయిలకు సంబంధించి వాస్తవ పన్నుతో పాటు 10 శాతం వడ్డీ చెల్లిస్తే చాలని ప్రకటించారు. పెరిగిన ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం రాక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్‌ఎంసీ.. ఖజానా నింపుకునేందుకు ఇప్పుడు ఓటీఎ్‌సపై ఆశలు పెట్టుకుంది. మరో రూ.150-200 కోట్లు వసూలైనా.. నిధుల కొరతను అధిగమించవచ్చని ఓ అధికారి తెలిపారు. 

Updated Date - 2021-03-04T08:17:14+05:30 IST