బియ్యం కుంభ కోణంలో అంతర్‌జిల్లా వ్యాపారులు?

ABN , First Publish Date - 2022-10-08T03:57:31+05:30 IST

ఆసిఫాబాద్‌లో ఇటీవల వెలుగు చూసిన భారీ బియ్యం కుంభకోణంలో బియ్యం పక్కాదారి పట్టడం వెనుక అంతర్‌ జిల్లా వ్యాపారుల ప్రమేయం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

బియ్యం కుంభ కోణంలో అంతర్‌జిల్లా వ్యాపారులు?

-రెండేళ్లుగా గుట్టుగా సాగుతున్న తంతు 

-మొత్తం వ్యవహారంపై ఓ వ్యాపారిపాత్ర 

-ఇతర జిల్లాలోనూ ఇదే తరహాలో సాగుతున్నట్టు అంచనా

-ఇతర జిల్లాల నుంచి రావాల్సిన బియ్యంలోనే తరుగుదల

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌) 

ఆసిఫాబాద్‌లో ఇటీవల వెలుగు చూసిన భారీ బియ్యం కుంభకోణంలో బియ్యం పక్కాదారి పట్టడం వెనుక అంతర్‌ జిల్లా వ్యాపారుల ప్రమేయం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు సంబంధించి 8400క్వింటాళ్ల బియ్యం లెక్కల్లో తేడాలు రావడంతో తనిఖీల సందర్భంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొదట్లో ఈ గోల్‌మాల్‌ వ్యవహారం ఆరు, ఏడు నెలల నుంచి సాగుతున్నట్టు అంచనా వేసిన అధికారులకు తీగ లాగితే డొంకంత కదిలినట్టుగా విచారిస్తున్న కొద్ది ఈ దందా ఊడలు ఇతర జిల్లాలోను విస్తరించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో ఇదే తరహాలో బియ్యం పక్కాదారి పట్టిన వ్యవహారం చోటు చేసుకుందని భావిస్తున్నారు. అత్యంత గుట్టుగా సాగుతున్న ఈ తతంగంలో కరీంనగర్‌కు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి పీఏ అతని అనుచరులు హస్తం ఉందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లాకు సంబంఽధించి సిర్పూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కీలకంగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఇటీవల ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత బియ్యం పక్కదారిపట్టిన వైనంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఇద్దరు అధికారులను సస్పెండు చేసి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే విచారిస్తున్న కొద్ది కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తున్నట్టు చెబుతున్నారు. అసలు బియ్యం పరిమాణం ఎంత మొత్తంలో పక్కాదారి పట్టింది..? మిల్లుల ఉంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు అసలు బియ్యం నిల్వలు చేరుకున్నాయా లేదా..? ఇందులో ఇంకా అధికారులపాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో లోతుగా విచారిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.  

ఓ వ్యాపారి పాత్ర..

ఆసిఫాబాద్‌ జిల్లాకు సంబంధించి ప్రభుత్వం రైస్‌ మిల్లర్ల ద్వారా బియ్యాన్ని సేకరించి ప్రజలకు పంపిణీ చేయటం కోసం పౌరసరఫరాల శాఖ ద్వారా డీలర్లకు అక్కడి నుంచి లబ్ధిదారులకు బియ్యాన్ని అందజేస్తోంది. అయితే జిల్లాలో వెలుగు చూసిన అవకతవకలకు సంబంధించి జిల్లాకు చెందిన రైస్‌మిల్లు నుంచి పెద్ద మొత్తంలో బియ్యం పక్కదారి పట్టిందని ప్రాథమికంగా నిర్ధారించారు. సదరు మిల్లుకు చెందిన వ్యాపారి వడ్లకు మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని ప్రభుత్వానికి సరెండర్‌ చేయాల్సి ఉన్న కాగితాలపై బియ్యాన్ని ముట్టచెప్పినట్టుగా సృష్టించి భారీ కుంభకోణానికి సూత్రదారిగా నిలిచినట్టు అనుమానిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం గత రెండేళ్లుగా గుట్టుగా సాగుతున్నట్టు రెవెన్యూకు చెందిన వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ అవకతవకల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ముగ్గురు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జీలు మారినట్టు చెబుతున్నారు.  పెద్ద మొత్తంలో గోడౌన్‌కు చేరే బియ్యంలో ప్రతినెల ఒకటి రెండు లారీల చొప్పున తగ్గుతూ రావటంతో గడిచిన రెండేళ్లలో ఈ పరిమాణం 42లారీలకు చేరిందని భావిస్తున్నారు. ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వస్తున్న బియ్యంలో 60శాతం జిల్లాలోని 21రైస్‌మిల్లుల నుంచి వస్తుండగా మిగితా 40శాతం కరీంనగర్‌, పెద్దపల్లి, రామగుండం ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నట్టు చెబుతున్నారు. జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అసలు ఊడలు పొరుగు జిల్లాల నుంచి వస్తున్న బియ్యం పరిమాణంలోనే ఉన్నాయన్నది స్థానికుల ఆరోపణ.

సమగ్ర విచారణతోనే..

ఆసిఫాబాద్‌ జిల్లాలో బియ్యం పక్కాదారి పట్టిన ఉదంతంపై రోజుకో కొత్త వాదన విన్పిస్తున్న నేపథ్యంలో ఇందులో అసలు ఏం జరిగింది..? దోషులు ఎవరు..? అనే విషయాలు తేలాలంటే గత రెండేళ్లుగా సరఫరా అయినా బియ్యం నిల్వలు, రవాణా రుజువులు, చెల్లింపుల వంటి వ్యవహారాన్ని తేలిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్టుగానే ఏ విషయం తేలకుండానే ఇందులో రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఈ వ్యవహారం అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో విచారణ అధికారిగా నియమితుడు అయిన జిల్లా రెవెన్యూ అధికారి సురేష్‌ నివేదికపైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఇప్పటికే సస్పెండు చేసిన దరిమిలా ఈ వ్యవహారంలో వారి పాత్ర ఏమిటనేది కూడా త్వరలోనే తేలనుంది.

Updated Date - 2022-10-08T03:57:31+05:30 IST