అంతర్ జిల్లా రాకపోకలు 15 రోజులు బంద్

ABN , First Publish Date - 2021-05-18T16:35:06+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను అసోం ప్రభుత్వం పొడిగించే..

అంతర్ జిల్లా రాకపోకలు 15 రోజులు బంద్

గౌహతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను అసోం ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంది. మే 21 నుంచి అంతర్ జిల్లా వాహనాల రాకపోకలపై సైతం 15 రోజుల నిషేధానికి సిద్ధమవుతోంది. అంతర్ జిల్లా వాహనాల రాకపోకలను నిరోధించకుండా కోవిడ్ నిరోధక చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదని, కేసులు తగ్గుముఖం పట్టడం లేదని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ (ఏఎస్‌డీఎంఏ) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, అంతర్ జిల్లా రాకపోకలపై నిషేధం నుంచి అత్యవసర సర్వీసులు, వ్యాక్సినేషన్, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వాధికారులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. మెడికల్ ఎమర్జెన్సీకి కానీ, అంత్యక్రియలకు కానీ జిల్లా అధికారుల ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.


గ్రామీణ ప్రాంతాలు, ఆ పరిసర ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అసోం ప్రభుత్వం గత శనివారం నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు తీవ్రం చేసింది. ప్రజలు, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. దుకాణాలను మధ్యాహ్నం 11 గంటల వరకే పరిమితం చేసింది. అసోంలో సోమవారం గరిష్ట స్థాయిలో 6,394 కేసులు నమోదు కాగా, 92 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 3,35,023కు చేరింది. కొత్త కేసుల్లో అత్యధికంగా 1,100 కేసులు రాష్ట్ర రాజధాని గౌహతిలో, 502 కేసులు కమ్రుప్, 456 కేసులు డిబ్రూగఢ్, నాగావ్‌లో 430 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-05-18T16:35:06+05:30 IST