ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

ABN , First Publish Date - 2022-05-07T05:49:39+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి.

ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం


  • మొదటిరోజు రంగారెడ్డి 58,699, వికారాబాద్‌ 8978, మేడ్చల్‌ 53,177 మంది విద్యార్థులు హాజరు
  • నిమిషం నిబంధనతో వికారాబాద్‌ జిల్లాలో నలుగురు విద్యార్థులు పరీక్షలకు దూరం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం చేవెళ్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హాల్‌ టికెట్లను చెక్‌ చేస్తున్న సిబ్బంది9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఒక్క నిమిషం ఆలస్యం జరిగినా పరీక్షకు అనుమతి లేదని అధికారులు ముందుగా ప్రకటించడంతో విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్‌ సెంటర్లుకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. నిఘా నేత్రాల మధ్య పరీక్షలు కొనసాగాయి. కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ కేంద్రాలను మూసి వేయించారు.  

రంగారెడ్డి అర్బన్‌/ వికారాబాద్‌ / తాండూరు / తాండూరు రూరల్‌/ కొడంగల్‌ రూరల్‌ / మేడ్చల్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మే 6 : పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖ సమన్వయంతో జిల్లాలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు పడక్బందీ చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 156 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 60,668 మంది విద్యార్థులు (తెలుగు-1, సాన్స్‌క్రిట్‌-1, ఉర్దూ-1, ఫ్రెంచ్‌-1) పరీక్షలు రాయాల్సి ఉండగా 58,699 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,969 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షలకు హాజరు కాలేకపోయారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. పరీక్షలకు గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఒక్క నిమిషం ఆలస్యం జరిగినా పరీక్షకు అనుమతి లేదని అధికారులు ముందుగా ప్రకటించడంతో విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్‌ సెంటర్లుకు చేరుకున్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ వస్తువులను లోపలికి అనుమతించలేదు. 20మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ కేంద్రాలను మూసి వేయించారు. పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్థులు వచ్చే సమయంలో చెకింగ్‌ చేసి లోపలకి పంపించారు. కేంద్రానికి నిర్ణీత సమయానికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. 29 పోలీ్‌సస్టేషన్లలో భద్రపర్చిన ప్రశ్న పత్రాలను పోలీసు బందోబస్తుతో పరీక్షా కేంద్రాలకు తరలించారు. మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ప్రతీ కేంద్రం వద్ద ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. నిఘా నేత్రాల మధ్య పరీక్షలు కొనసాగాయి. ప్లయింగ్‌స్కాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఎప్పటికప్పుడు తనిఖీ చేశారు. హైపవర్‌ కమిటీ మానిటరింగ్‌ చేసింది. విద్యుత్‌కు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 

వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌ జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల వరకే విద్యార్తులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వికారాబాద్‌లో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను జిల్లా వ్యాప్తంగా మొత్తం 9491 మంది విద్యార్థులకు గాను 8134 మంది జనరల్‌, 1357 మంది విద్యార్థులు ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి వారు ఉండగా, వీరిలో మొత్తం 8978 మంది హాజరయ్యారు. మొత్తం 513 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి శంకర్‌ నాయక్‌ తెలిపారు. మొదటి రోజు ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని అధికారులు చెప్పారు.

మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షల్లో 127 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 54,618 మంది విద్యార్థులకు గాను 53,177 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 1,441 మంది విద్యార్థులు పరీక్షలకు పలు కారణాలతో హాజరు కాలేకపోయారు. 

మౌలిక సదుపాయాలను కల్పించాలి : కలెక్టర్‌ హరీష్‌

ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అవసరమైన మౌలిక సదుపాయాల్ని కల్పించాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్‌ అన్నారు. శుక్రవారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్‌ జిల్లా నాచారంలోని ఇంటర్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. విద్యార్థులకు గాలి వెలుతురు వచ్చేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు స్క్వాడ్‌ టీములు తనిఖీ చేయాలన్నారు. ఆయన వెంట ఇంటర్‌ పరీక్షల నిర్వాహణ అధికారి కిషన్‌, ఇతర శాఖ అధికారులు ఉన్నారు.

ఆలస్యంతో పరీక్షలకు దూరమైన నలుగురు విద్యార్థులు

నిమిషం ఆలస్యం నిబంధనతో వికారాబాద్‌ జిల్లాలో నలుగురు విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షకు దూరమయ్యారు. కొడంగల్‌ మండల పరిధిలోని పర్సాపూర్‌ గ్రామానికి చెందిన గొల్లలాలప్ప కొడంగల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హెచ్‌ఈసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కొడంగల్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి లాలప్ప నిమిషం ఆలస్యం కావడంతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో తిరిగి గ్రామానికి వెళ్లిపోయాడు. అదే విధంగా తాండూరు జూనియర్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు సింధూ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రం కేటాయించగా, వారు పరీక్షా కేంద్రానికి 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దీంతో యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. అదేవిధంగా చైతన్య జూనియర్‌ కళాశాలకు కూడా ఒక విద్యార్థిని ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించలేదు. 

Read more