భీమిలి బీచ్‌లో ఇంటర్‌ విద్యార్థి గల్లంతు

ABN , First Publish Date - 2022-05-20T05:45:22+05:30 IST

భీమిలి బీచ్‌లో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి ఆకుల పురుషోత్తం (17) గల్లంతయ్యాడు.

భీమిలి బీచ్‌లో ఇంటర్‌ విద్యార్థి గల్లంతు
గల్లంతైన విద్యార్థి పురుషోత్తం (ఫైల్‌ ఫొటో)

మత్స్యకారుల సాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన మరో విద్యార్థి

భీమునిపట్నం, మే 19: భీమిలి బీచ్‌లో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి ఆకుల పురుషోత్తం (17) గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. గురువారంతో ఇంటర్‌ పరీక్షలు పూర్తవ్వడంతో విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద మోపాడకు చెందిన పురుషోత్తం ఆరుగురు స్నేహితులతో కలిసి సరదాగా భీమిలి బీచ్‌కు వచ్చాడు. తొలుత లైట్‌హౌస్‌ ప్రాంతంలో వీరంతా సరదాగా గడిపాక సాగరసంగమ ప్రవేశద్వార తీరంలో సముద్ర స్నానాలకు దిగారు. అయితే ఈత రాకపోవడంతో పెద్ద కెరటం ధాటికి పురుషోత్తం కొట్టుకుపోసాగాడు. తనను కాపాడాలంటూ స్నేహితుడైన తూమురోతు సంతోశ్‌కుమార్‌ను కేకలు పెట్టి పిలిచాడు. పురుషోత్తాన్ని కాపాడేందుకు ఈత వచ్చిన సంతోష్‌ సముద్రంలోకి వెళ్లి చెయ్యి అందుకున్నాడు. అయితే కెరటాల ధాటికి ఇద్దరు కొట్టుకుపోతుండడాన్ని చేపల వేట ముగించుకుని వస్తున్న మత్స్యకారులు గమనించి వారిని కాపాడేందుకు పడవలో వున్న పెద్ద తాడును పట్టుకోమని విసిరారు. సంతోశ్‌ తాడు పట్టుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడగా, పురుషోత్తం గల్లంతయ్యాడు. అప్పటివరకు తమతో సరదాగా గడిపిన పురుషోత్తం గల్లంతవ్వడంతో స్నేహితులంతా బిత్తరపోయారు. కాగా పురుషోత్తం తండ్రి నారాయణరావు గ్రామంలో మంచినీటి పైపులు బాగుచేస్తూ, చిప్పాడ ఫార్మా కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే డెంకాడ ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు ఘటనా స్థలికి పురుషోత్తం తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, నారాయణరావులను, బంధువులను తీసుకుని వచ్చారు. తీరం వద్ద పురుషోత్తం కోసం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి సీఐ జీవీ రమణ తెలిపారు. గల్లంతైన పురుషోత్తం కోసం అన్నవరం, పెదనాగమయ్యపాలెం తీర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. 




Updated Date - 2022-05-20T05:45:22+05:30 IST