అంతా పాస్‌

ABN , First Publish Date - 2021-07-24T06:53:16+05:30 IST

జిల్లాలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా వార్షిక పరీక్షలు రాయకుండానే పాసైపోయారు.

అంతా పాస్‌

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు వెల్లడి
58,241 జనరల్‌, 1,673 ఒకేషనల్‌ విద్యార్థుల ఉత్తీర్ణత 
టెన్త్‌, ఫస్ట్‌ ఇంటర్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు
ఫస్ట్‌ ఇంటర్‌లో సబ్జెక్టులు తప్పినవారు ఫీజు కడితే పాస్‌

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : జిల్లాలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా వార్షిక పరీక్షలు రాయకుండానే పాసైపోయారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం విడుదల చేశారు. మే ఐదో తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసినప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రయత్నాలను విరమించుకొని ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌ పరీక్షలను పూర్తిగా రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు ద్వితీయ సంవత్సర ఇంటర్‌ విద్యార్థులకు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా 30 శాతం వెయిటేజీ, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో సాధించిన మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి అందరూ ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. విద్యార్థులు సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కులు, మొత్తం సరాసరి మార్కులను పరిగణనలోకి తీసుకుని వారికి గ్రేడ్‌ పాయింట్లను కూడా కేటాయించారు. రెగ్యులర్‌ విద్యార్థులు 58,241 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 1,673 మంది.. మొత్తం 59,914 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టయింది. రెగ్యులర్‌ విద్యార్థుల్లో బాలురు 40,050 మంది, బాలికలు 27,854 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో బాలురు 728 మంది, బాలికలు 945 మంది పాసయ్యారు. ఇక మొదటి సంవత్సరం లో సబ్జెక్టులు తప్పిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించి ఉంటే వారం దరికీ 35 మార్కులు చొప్పున ఇచ్చి ఉత్తీర్ణత సాధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫలితాలను ఈ నెల 26వ తేదీ నుంచి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చునని మంత్రి సురేష్‌ ప్రకటించారు. 

Updated Date - 2021-07-24T06:53:16+05:30 IST