ప్రభుత్వ కాలేజీలు..వెలవెల

ABN , First Publish Date - 2022-07-03T04:43:29+05:30 IST

ప్రభుత్వ ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్‌ ఇచ్చి దాదాపు పదిరోజులు పూర్తవుతోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో ఇప్పటికే ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు 90శాతం పూర్తిచేసి తరగతులు కూడా ప్రారంభించారు.

ప్రభుత్వ కాలేజీలు..వెలవెల
ప్రభుత్వ వృత్తివిద్యా కళాశాల

టెన్త్‌ తర్వాత అందరి చూపు ప్రైవేటు కళాశాల వైపే..

మండలానికో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఉన్నా చేరేవారేరీ?

అడ్మిషన్ల ప్రక్రియలో అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల నిర్లిప్తత


గుంటూరు(విద్య), జూలై2   : ప్రభుత్వ ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్‌ ఇచ్చి దాదాపు పదిరోజులు పూర్తవుతోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో ఇప్పటికే ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు 90శాతం పూర్తిచేసి తరగతులు కూడా ప్రారంభించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో మాత్రం ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభం కూడా కాలేదు. ఇంకా అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్‌ అడ్మిషన్ల విషయంలో నిర్లిప్తంగానే ఉంటూన్నారు. అనేక కళాశాలల్లో 100లోపు కూడా విద్యార్థులు చేరని పరిస్థితి నెలకొంది. 

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌, వృత్తి విద్యా కళాశాలలు దాదాపు 70పైగా  ఉన్నాయి. ఇక ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు దాదాపు 120వరకు ఉన్నాయి. ఏటా ఇంటర్‌ మొదటి సంవత్సరంలో దాదాపు 45వేలమంది వరకు చేరుతుంటారు. ఇందులో సింహభాగం  అంటే దాదాపు 75శాతం ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లోనే ఉంటున్నాయి. మిగిలిన 25శాతం మాత్రమే ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాల్లో ఉంటున్నాయి. గత ఏడాది ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, వృత్తివిద్యా కళాశాలల నుంచి కనీసం 3వేల మంది కూడా హాజరుకాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అవగతం చేసుకోవచ్చు. ఇక మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీ, గురుకులాల్లో అడ్మిషన్లు ప్రక్రియ కోసం రాతపరీక్ష లేదా మెరిట్‌ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇక్కడ అడ్మిషన్లకు ఢోకా లేదు.


నిష్ణాతులైన అధ్యాపకులున్నా నిర్లక్ష్యం..

ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులున్నారు. అధ్యాపకులు కొరత ఉన్న ప్రాంతాల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమించి బోధన అందిస్తున్నారు. అయితే అక్కడ ఫలితాలు మాత్రం ఆధ్వాన్నంగా ఉంటున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గత ఏడాది సగటు ఉత్తీర్ణత 40శాతం మించలేదు. ఒక్క ఎంపీసీ, బైపీసీ, వృత్తివిద్యాకోర్సులు తప్ప ఆర్ట్స్‌ గ్రూపుల్లో (ఎంఈసీ, హెచ్‌ఈసీ, సీఈసీ) విద్యార్థులు అసలు చేరడం లేదు. ఈ గ్రూపుల్లో ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో కొంతమేరకు అడ్మిషన్లు ఉన్నాయి. ప్రభుత్వ, జడ్పీ స్కూల్స్‌లో పది పూర్తిచేసిన విద్యార్థుల వివరాలు పరీక్షలకు ముందే ప్రైవేటు కళాశాలలు సేకరిస్తున్నాయి. ఇందులో మెరిట్‌ ఉన్న విద్యార్థుల్ని దాదాపు తమ క్యాంపస్‌లలోనే చేర్చుకుంటున్నాయి. అయితే ఈ దిశగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు మాత్రం చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కనీసం ప్రభుత్వ, జడ్పీ స్కూల్స్‌లో పది పూర్తిచేసిన 50శాతం మంది విద్యార్థులు జూనియర్‌ కళాశాలల్లో చేరినా అన్ని కళాశాలల్లో అన్ని గ్రూపుల్లో సీట్లు భర్తీ అవుతాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 


ఈనెల 20వరకు మాత్రమే గడువు

ఇంటర్‌ అడ్మిషన్ల కోసం ఈనెల 20వ తేదీ వరకు ఇంటర్‌ బోర్డు గడువు విఽధించింది. ఇప్పటికైనా యాజమాన్యాలు మేలుకోకుంటే ఈ ఏడాది అడ్మిషన్లు మరింత తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

 

 

Updated Date - 2022-07-03T04:43:29+05:30 IST