ఇంటర్‌ ఫీజులు.. ఇష్టారాజ్యం!

ABN , First Publish Date - 2022-08-20T09:45:20+05:30 IST

ఇంటర్మీడియట్‌ ఫీజుల విషయంలో హేతుబద్ధత లేకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ కాలేజీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్‌ ఫీజులు.. ఇష్టారాజ్యం!

హేతుబద్ధత లేకపోవడమే అసలు సమస్య

ఇప్పటికీ అమల్లో ఉన్నది 2014 నాటి ఫీజులే

ఫస్టియర్‌కు రూ.1760, సెకండియర్‌కు 1940

ఈ ఫీజులతో కాలేజీల నిర్వహణ సాధ్యమేనా?

కమిటీ ప్రతిపాదనలను పట్టించుకోని ప్రభుత్వం

ఇదే అదనుగా ప్రైవేట్‌ కాలేజీల్లో ఫీజుల వసూలు


హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫీజుల విషయంలో హేతుబద్ధత లేకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ కాలేజీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫీజుల ఖరారులో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం.. ఆయా కాలేజీలకు వరంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఖరారు చేసిన ఫీజులే ఇప్పటికీ మనుగడలో ఉండడం, ఎనిమిదేళ్లు దాటుతున్నా ఆ ఫీజులను హేతుబద్ధీకరించకపోవడం వల్లే నియంత్రణ సాధ్యం కావడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం సైతం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండడం విద్యార్థులకు శాపంగా మారింది. ఒకవైపు ఫీజులను ఖరారు చేయకుండా, మరోవైపు భారీ ఫీజుల వసూలును నియంత్రించకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో జా రీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఇంటర్‌ మొదటి ఏడాదికి రూ.1,760, రెండవ ఏడాదికి రూ.1,940 చొప్పున ట్యూషన్‌ ఫీజును వసూలు చేయాలి.


ఉమ్మడి ఏపీలో ప్రతి ఏడాది ఈ ఫీజులను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. 2014 వరకు ఇదే విధానాన్ని అవలంబించారు.  అయితే, ఫీజుల విషయంలో హేతుబద్ధతను ఖరారు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏడాది పాటు కసరత్తు చేసిన కమిటీ... కాలేజీలు ఉన్న ప్రాంతాలను బట్టి గ్రామీణం, పట్టణం, హైదరాబాద్‌ అనే మూడు విభాగాలుగా విభజించి ప్రతిపాదిత ఫీజులను సూచించింది. దీని ప్రకారం ఏడాదికి రూ.3వేల నుంచి రూ.8 వేల వరకు ఫీజులు ఉండాలని ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనపై ప్రభు త్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. అప్పటి నుంచి నేటి వరకు ఫీజుల పెంపుపై ఎలాంటి ఉత్తర్వులను జారీ చేయలేదు. ఫలితంగా 2014లో జారీ చేసిన ఫీజులే నేటికీ మనుగడలో ఉన్నాయి. వాస్తవానికి.. ఈ ఫీజులతో కాలేజీల నిర్వహణ సాధ్యమయ్యే పని కాదు. ఫీజుల ఖరారుపై ప్రభుత్వం చేతులెత్తేయడంతో ప్రైవేట్‌ కాలేజీలు చెప్పిందే ఫీజు.. అన్నట్టుగా పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని కార్పొరేట్‌ కాలేజీలు ఎంసెట్‌, ఐఐటీ కోచింగ్‌ల పేరిట రూ.లక్షల్లోనే ఫీజులను వసూ లు చేస్తూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫీజుల ఖరారు హేతుబద్దంగా ఉంటే... నియంత్రణ విధించడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణాల వల్లే ప్రైవేట్‌ కాలేజీల ఆగడాలకు అంతులేకుండా పోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


హేతుబద్ధంగా  నిర్ణయించాలి 

ఇంటర్మీడియట్‌ ఫీజులను హేతుబద్దంగా ఖరారు చేయాలి. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే కొన్ని ప్రైవేట్‌ కాలేజీలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి.. సరైన నిర్ణయం తీసుకోవాలి.

- గౌరీ సతీష్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల సంఘం అధ్యక్షుడు 

Updated Date - 2022-08-20T09:45:20+05:30 IST