జూన్‌ 15న ఇంటర్‌ కాలేజీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-17T17:35:37+05:30 IST

ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ తరగతులు జూన్‌ 15వ తేదీన ప్రారంభం కానున్నాయి. జులై ఒకటో తేదీన మొదటి సంవత్సరం తరగతులను మొదలు పెట్టనున్నారు. 2023 మార్చి 15వ తేదీ నుంచి వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు....

జూన్‌ 15న ఇంటర్‌ కాలేజీలు ప్రారంభం

జులై 1 నుంచి ఫస్టియర్‌ తరగతులు

అక్టోబరు 2 నుంచి దసరా సెలవులు

మొత్తం 221 రోజుల పనిదినాలు

ప్రైవేటు కాలేజీలకూ ఇదే అడ్మిషన్ల షెడ్యూలు 

22-23 అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల 


హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ తరగతులు(Intermediate Second Year Classes) జూన్‌ 15వ తేదీన ప్రారంభం కానున్నాయి. జులై ఒకటో తేదీన మొదటి సంవత్సరం తరగతులను మొదలు పెట్టనున్నారు. 2023 మార్చి 15వ తేదీ నుంచి వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు.  2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌(Academic Calendar)ను ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. సోమవారం నిర్వహించిన బోర్డు 48వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్యాలెండర్‌ ప్రకారం ఏడాది మొత్తం 221 పనిదినాలు ఉండనున్నాయి.  అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ కాలేజీలు(Private colleges) ఎలాంటి ప్రకటనలను జారీ చేయకూడదని బోర్డు ఆదేశించింది. బోర్డు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే అడ్మిషన్లను చేపట్టాలని సూచించింది.


స్పాట్‌ సిబ్బంది పారితోషకం 25% పెంపు  

పరీక్ష విధులు, మూల్యాంకన ప్రక్రియలో  పాల్గొంటున్న అధికారులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది పారితోషకాన్ని 25 శాతం మేర పెంచింది. పేపర్‌ను బట్టి కొన్నింటికి రూ. 18.93ల నుంచి రూ. 23.66 వరకు, మరికొన్నింటికి రూ. 641 నుంచి రూ. 800లవరకు ఈ పారితోషకాన్ని పెంచింది.. ఈ పెంపుదల పట్ల  ఇంటర్‌ విద్య జేఏసీ చైర్మన్‌ మధుసూధన్‌ రెడ్డి ప్రభుత్వానికి దన్యవాదాలు తెలిపారు.


ఇంటర్‌ పరీక్షకు 95% విద్యార్థుల హాజరు  

సోమవారం నిర్వహించిన ఇంటర్‌ ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1 పరీక్ష సుమారు 95 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల కోసం మొత్తం 4,71,865 మంది హాజరు కావాల్సి ఉండగా, ఇందులో 4,48,083 మంది హాజరయ్యారు. మరో 23,782 మంది  గైర్హాజరయ్యారు.



Updated Date - 2022-05-17T17:35:37+05:30 IST