ఇన్‌చార్జిల పాలనలో కళాశాల విద్య ప్రాంతీయ కార్యాలయం

ABN , First Publish Date - 2022-07-23T05:43:23+05:30 IST

ఆది మూడు జిల్లాల్లో (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్ని పర్యవేక్షించాల్సిన కార్యాలయం...

ఇన్‌చార్జిల పాలనలో కళాశాల విద్య ప్రాంతీయ కార్యాలయం
కళాశాల విద్య ప్రాంతీయ కార్యాలయం

కళాశాలలపై పర్యవేక్షణ కరువు... గాడి తప్పుతున్న పాలన

గుంటూరు(విద్య), జూలై 22: ఆది మూడు జిల్లాల్లో (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) ప్రభుత్వ, ఎయిడెడ్‌  డిగ్రీ కళాశాలల్ని పర్యవేక్షించాల్సిన కార్యాలయం... ఇంతటి ప్రాధాన్యం ఉన్న కార్యాలయంలో  ఇన్‌చార్జీల పాలనతో  అస్తవ్యస్తంగా మారుతోంది. ఇక్కడ  ఆర్జేడీలుగా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్‌ను ఇన్‌చార్జీలుగా (ఎఫ్‌ఏసీ) నియమిస్తున్నారు. వారు ఒకవైపు కళాశాలలో బాధ్యతల్ని నిర్వహించలేక మరోవైపు ఆర్జేడీ కార్యాలయంలో పనుల్ని చక్కదిద్దలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫలితంగా ఒకవైపు కళాశాలకు, మరోవైపు కార్యాలయంలో అనేక పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. మరోవైపు పూర్తిస్థాయి అధికారి లేని కారణంగా పనుల జాప్యంతోపాటు, పనిభారం పెరిగిపోయి ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టేపరిస్థితి వస్తోంది. తాజాగా ఆర్జేడీ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాయప్ప అనే ఉద్యోగి పని విషయంలో తీవ్ర ఒత్తిడికి గురై బ్రెయిన్‌స్ట్రోక్‌తో ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. దీనికి ఇన్‌చార్జీ ఆర్జేడీ రమా జ్యోత్స్నకుమారి కారణం అంటూ ఉద్యోగి భార్య ఫిర్యాదు చేశారు. దీంతో  ఆర్జేడీపై విచారణ నిర్వహించారు. ఇదిలా ఉంటే  సక్రమంగా పనిచేయడం లేదంటూ ఇలాగే మరో ముగ్గురు ఉద్యోగుల్ని డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఇక్కడ మరింత  పనిభారం పెరిగిపోయిందని ఉద్యోగులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తీవ్రస్థాయిలో పనిభారం

ఆర్జేడీ కార్యాలయంలో ఇద్దరు సూపరింటెండెంట్స్‌తోపాటు మొత్తం 15 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. వారు మూడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌  డిగ్రీ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సర్వీస్‌ రూల్స్‌, ఇతర సమస్యలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఉద్యోగుల జీతాలు, అలవెన్స్‌లు ఇతర సర్వీస్‌  విషయాలతోపాటు కళాశాలల్లో పరిపాలన బాధ్యతల వ్యవహారాలు ఇక్కడ నుంచే జరగాలి. పూర్తిస్థాయిలో అధికారి లేకపోవడంతో పనులు తీవ్రజాప్యం అవుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొన్నిసార్లు అధ్యాపకుల సర్వీస్‌ సమస్యల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా అనేక సమస్యలు ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ పూర్తిస్థాయి అధికారిని నియమించాలని ఉద్యోగులు, అధ్యాపకులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2022-07-23T05:43:23+05:30 IST