అడ్మిషన్లు.. అవస్థలు

ABN , First Publish Date - 2021-08-14T04:20:28+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 23 జూనియర్‌ కళాశాలలు, ఎయిడెడ్‌ ఆధ్వర్యంలో 18, అన్‌ఎయిడెడ్‌ ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు 190 వరకు ఉన్నాయి.

అడ్మిషన్లు.. అవస్థలు

ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రక్రియకు ఆటంకాలు

తొలిరోజు గంట మాత్రమే వెబ్‌సైట్‌ ఓపెన్‌

విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు చూపుతున్న వైనం

ఒక్కో కళాశాలకు గరిష్ఠంగా 352 మంది విద్యార్థులకే అనుమతి


ఇంటర్‌ మీడియట్‌ ఆడ్మిషన్లకు ప్రభుత్వం ఈ ఏడాది ఆన్‌లైన్‌ విధా నం ప్రవేశపెట్టింది. ఈ విధానం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చుక్కలు చూపుతోంది. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు  నూతన నిబంధనలతో బెంబేలె త్తుతున్నాయి. ఒక్కో కళాశాలలో ఎన్ని సెక్షన్లు ఉన్నా గరిష్ఠంగా 352 మంది విద్యార్థులకు మాత్రమే సీట్లు కేటాయించేలా బోర్డు నిర్ణయిం చింది.  ఈ పరిస్థితుల్లో ఇప్పటికే వివిధ కళాశాలల్లో ప్రవేశాలు పొంది ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరవుతున్న  విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. 


గుంటూరు(విద్య), ఆగస్టు 13: జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 23 జూనియర్‌ కళాశాలలు, ఎయిడెడ్‌ ఆధ్వర్యంలో 18, అన్‌ఎయిడెడ్‌ ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు 190 వరకు ఉన్నాయి. ఆయా కళాశాలలో ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ కోసం శుక్రవారం నుంచి (ఈ నెల 26 వరకు) ఇంటర్‌ బోర్డు అనుమతులు ఇచ్చింది. అయితే అడ్మిషన్లను గతంలో మాదిరిగా కాకుండా ఆన్‌లైన్‌లోనే చేసుకునేలా నిబంధన విధించింది. ఇందుకు సంబంధించి తొలి రోజు వెబ్‌సైట్‌ ఒపెన్‌ కాక అనేక కళాశాలల్లో అడ్మిషన్‌ ప్రక్రియ సక్రమంగా జరగలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యాలు వాపోతున్నాయి. ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో భాగంగా తొలుత ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో  రిజిస్ట్రేషన్‌  చేయించుకోవాలి.  ఇందుకోసం విద్యార్థి రూ.100 ఫీజు చెల్లించాలి. తరువాత విద్యార్థి పదో తరగతి పరీక్షల సందర్భంగా ఇచ్చిన సెల్‌కు ఓటీపీ(ఒన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) వస్తుంది. అయితే అనేక మంది విద్యార్థులు ఓటీపీ కోసం నానా యాతన పడాల్సి వచ్చింది. విద్యార్థులు పదో తరగతి పరీక్షల సమయంలో ఎవరి సెల్‌ నంబర్‌ ఇచ్చారో గుర్తుకురాక పలువురు ఇబ్బందిపడ్డారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి ఫోన్‌ నెంబర్‌ ఇస్తే సరేసరి లేకుంటే విద్యార్థులకు ఓటీపీ రావడం గగనం అవుతుంది. మరోవైపు ఒక్కో కళాశాలలో ఎన్ని సెక్షన్లు ఉన్నా గరిష్ఠంగా 352 మంది విద్యార్థులను మాత్రమే కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో కళాశాలలో  సగటున 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌కు గతంలో 83 మంది విద్యార్థులను కేటాయించారు. ఎన్ని సెక్షన్లు అనే లిమిట్‌ పెట్టలేదు. ప్రస్తుతం నాలుగు సెక్షన్లకు సరిపడా విద్యార్థుల్ని మాత్రమే చేర్చుకునేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారని యాజమాన్యాలు చెబుతున్నాయి. అంటే ఒక్కో కళాశాలలో 330 నుంచి 352 మంది విద్యార్థుల్ని చేర్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రైవేటు కార్పొరేట్‌ కళాశాలలు అయితే బ్రాంచ్‌కి పదుల సంఖ్యలో సెక్షన్లు ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు.


అన్ని గ్రూపులు ఉండాల్సిందేనా?

ఇంటర్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో కళాశాలలు అన్ని గ్రూపుల్లో విద్యార్థుల్ని చేర్చుకోవాల్సిందేననే నిబంధనలు ఉన్నట్లు కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా కార్పొరేట్‌, మధ్యస్థ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీలకే ప్రాధాన్యం ఇస్తాయి. కామర్స్‌ బేస్‌డ్‌ కళాశాలలు సీఈసీ, ఎంఈసీలకే ప్రాధాన్యం ఇస్తాయి. మూడో కేటగిరిలోని ఎయిడెడ్‌ కళాశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అయితే బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ తదితర గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు అన్ని కళాశాలల్లో అన్ని గ్రూపులకు అడ్మిషన్లు చూపాల్సిందేననే నిబంధనలు ఉన్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి.


Updated Date - 2021-08-14T04:20:28+05:30 IST