Abn logo
Feb 18 2020 @ 08:56AM

బాంబు ప్రూఫ్ ఇంట్లో జైషే చీఫ్ మసూద్ అజార్

  • భారత నిఘావర్గాల చేతిలో కీలక సమాచారం

న్యూఢిల్లీ : పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత, మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్ ఆచూకీతోపాటు అతనికి సంబంధించిన కీలక సమాచారం భారత నిఘావర్గాలకు చిక్కింది. పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద సంస్థ హెడ్‌క్వార్టర్స్ అయిన బహవల్పూర్ నగరంలోని రైల్వే లింక్ రోడ్డు సమీపంలోని మర్కజ్ ఏ ఉస్మాన్ ఓ అలీ బాంబు ఫ్రూఫ్ ఇంట్లో దాక్కున్నాడని భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడి ఘటన అనంతరం మసూద్ అజార్ అజ్ఞాతంలోకి వెళ్లాడని ఇంటలిజెన్స్ వెల్లడించింది. 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడి చేసినపుడు దొరికిన మొబైల్ నంబర్లలో ఒకటి నేరుగా బహవల్పూర్ ఉగ్రవాద కేంద్రంతో అనుసంధానించారని ఇంటలిజెన్స్ దర్యాప్తులో తేలింది. గ్లోబల్ టెర్రరిస్టు అయిన మసూద్ అజార్ బహవల్పూరులోని కౌసర్ కాలనీ,ఖైబర్ ఫక్తూన్ ఖవా బన్నూలోని బిలాల్ హబ్షీ మదరసా, అదే ప్రావిన్సులోని లక్కీమార్వాట్ ప్రాంతంలోని ఎ లుక్మాన్ మదరసా మసీదు ప్రాంతాలు చిరునామాలుగా ఉండేవి.


2008 ముంబై పేలుళ్ల కేసులో కీలకసూత్రధారి అయిన మసూద్ అజార్ పై పాకిస్థాన్ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి. మసూద్ అజార్ వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడని, జైషే మహ్మద్ బాధ్యతలను అతని సోదరుడు అబ్దుల్ రౌఫ్  అస్ఘర్ అల్వీ స్వీకరించాడని గతంలో పాకిస్థాన్ విదేశాంగశాఖ  మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించారు. పుల్వామా, పఠాన్ కోట్ దాడులకు వ్యూహకర్త అబ్దుల్ రౌఫ్ అని భారత అధికారులు చెప్పారు.


2015 వ సంవత్సరం డిసెంబరు 25వతేదీన ప్రధాని నరేంద్రమోదీ లాహోర్ సందర్శన సందర్భంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చిగురిస్తున్న మైత్రిని విఛ్ఛిన్నం చేయడానికి పఠాన్ కోట్, పుల్వామా దాడులు చేయించాడని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. మసూద్ అజార్ బావమరిది మహ్మద్ యూసుఫ్ అజార్ బాలాకోట్ లో ఉగ్రవాద శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడని మన దేశ కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. 


Advertisement
Advertisement
Advertisement