Abn logo
Jul 13 2020 @ 00:37AM

హైదరాబాద్‌ విలీనం నేపథ్యంలో ‘ఇంటిగ్రేషన్‌ లిటరేచర్‌’

భారత దేశంలో హైదరాబాద్‌ రాజ్య విలీన ప్రక్రియ దరిమిలా సాహిత్యం రాలేదా, వస్తే ఎందుకు దానిపై ఎవరూ దృష్టి పెట్టలేదన్న ప్రశ్న నన్ను తొలిచి వేసేది. గత 25 ఏళ్లుగా దృష్టి పెట్టి అడపా, దడపా కొన్ని కథలు, కొన్ని నవలలు, ఆత్మకథలు సేకరించి చదవగలిగాను. ఆ సాహిత్యాన్ని ఏ దృక్పథంతో నిర్వచించాలన్నది నాకు సమస్యగా నిలిచింది. చివరికి ‘ఇంటిగ్రేషన్‌ లిటరేచర్‌’గా నిర్వచిస్తే దాని పరిధి చాలా విస్తృమౌతుంది కనుక అదే ఖాయం చేశాను. ఈ రచనలను అధ్యయనం చేస్తే యూరోపులో రెండు ప్రపంచయుద్ధాల నేపథ్యంలో వచ్చిన ప్రగతిశీలమైన రచనలకు ఏ మాత్రం తీసిపోనివని చెప్పవచ్చు.


దేశ స్వాతంత్య్రం నేపథ్యంలో భారత ఉపఖండాన రెండు చారిత్రక పరిణామాలు సంభవించాయి. మొదటిది భారత్‌ పాకిస్థాన్‌ల విభజన (పార్టిషన్‌). రెండవది ఏడు వందల ఏళ్లుగా భిన్నమైన పేర్లతో కొనసాగిన ముస్లిం పాలిత హైదరాబాద్‌ రాజ్యం భారతదేశంలో విలీనం (ఇంటి గ్రేషన్‌) కావటం. ఈ రెండు పరిణామాల దరిమిలా దేశ చరిత్రలో కనీవినీ ఎరగని హింసాకాండ చెలరేగింది. లక్షలా దిమంది మరణించారు. కన్నవాళ్లను, రక్తసంబంధీకులను, తరతరాలుగా ఉన్న ఊరును వదిలేసి పరాయి ప్రాంతాలకు వలస వెళ్లడమంతటి విషాదం చెప్పలేనిది. 


ఇంటిగ్రేషన్‌ పేరుతో హైదరాబాద్‌ భారత్‌లో విలీనం, దరి మిలా దాని అంతర్థానం మిగిల్చిన విషాదం- దాని ప్రత్యక్ష, పరోక్ష ప్రతిఫలనాలతో నాలుగు సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. వీటిలో ‘మాభూమి’ చాలా ముఖ్యమైన సినిమా. దాని ప్రతిఫలనాలను చిత్రించిన సినిమాలు ‘ఆస్మాన్‌ మంజిల్‌’, ‘బజార్‌’. సాహిత్యంలో ఇంటిగ్రేషన్‌ ప్రతిఫలనాలపై చర్చే లేదు. ప్రముఖ జర్నలిస్టు ఏజీ నురానీ రాసిన ‘డిస్ట్రక్షన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ మాత్రం ఆ విషయాలను చర్చించింది. అటు జాతీయ స్థాయిలో కానీ, తెలంగాణ సమాజంలో కానీ వాటి మీద ఒక దృక్పథంతో అధ్యయనం జరిగిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో విలీనానికి ముందు, తర్వాత వెలువడిన రచనలు, సినిమాల పరిచయ వ్యాసమిది.


ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన షౌఖత్‌ ఆజ్మీ ఆత్మకథ ‘కైఫీ అండ్‌ మై సెల్ఫ్‌’ వెలువడింది. పార్టిషన్‌తో పాటు, ఇంటిగ్రేషన్‌ పరిణామాల ప్రభావాలు హైదరాబాద్‌ జీవితం మీద కూడా పడ్డాయన్నది ఈ పుస్తకం తేల్చింది. షౌకత్‌ ఆజ్మీ ఎవరో కాదు హిందీ తార షబనా ఆజ్మీ అమ్మగారు, ప్రఖ్యాత ఉర్దూ మహాకవి, తెలంగాణ మీద కవిత్వం రాసిన కవి కైఫీ ఆజ్మీ సహచరి. 1947లో అఖిల భారత ప్రజా నాట్యమండలి సమావేశాలు (ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌- ఇప్టా) హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా కైఫీ ఆజ్మీకి షౌకత్‌ ఆజ్మీతో ఏర్పడిన పరిచయం ప్రేమకు, వివాహానికి దారి తీసింది. ఆమె ఆత్మకథ చదివినప్పుడు హైదరాబాద్‌ ప్రగతిశీల సాహిత్యోద్యమం గురించి, ఆనాటి ఉద్యమాల గురించి తెలిసింది. దేశ విభజన వల్ల షౌఖత్‌, కైఫీ ఆజ్మీ కుటుంబాల విభజన కూడా జరిగిందని తెలిసి ఆశ్చర్యం వేసింది. అయినా కైఫీ ఆజ్మీ, షౌకత్‌ ఆజ్మీలు వారి రాజకీయాల వల్ల ఇక్కడే ఉండిపోయారు. ఆ రోజుల్లో కొన్ని హిందూ, ముస్లిం కుటుంబాలు పార్టిషన్‌ వల్ల చీలిపోతే మరికొన్ని కుటుంబాలు ఇంటిగ్రేషన్‌ వల్ల చీలిపోయాయి. సామాజికంగా చాల దెబ్బతిన్నాయి. ఇందులో ఈ వ్యాసకర్తకు పరిచయస్తులు కూడ ఉన్నారు. హైదరాబాద్‌ విలీనం వల్ల ఆధునిక విద్యావంతులు, ఉన్నత కుటుంబాలకు చెందిన లిబరల్‌, ప్రజాస్వామికవాదులైన ముస్లింలు అనేకమంది అభద్రతకుగురై అమెరికాకు, కెనడాకు, పాకిస్థాన్‌కు పొట్టచేత పట్టుకుని వలసపోయారు. అమెరికాకు, కెనడాకు, లండన్‌కు ప్రవాసం వెళ్లినవారిలో ఎన్నో కాయస్థ, రెడ్డి కుటుంబాలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన హిందూ, సిక్కు కుటుంబాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. దీనితో వారి రక్త సంబంధీకులు, పరస్పరం పరాయి దేశస్తులై పోయారు. ఇట్లా చీలిపోయినవారి కుటుంబాలు హైదరాబాద్‌ నగరంలో, వరంగల్‌లో, నల్లగొండలో అనేకం ఉన్నాయి. 


ఏడు వందలేళ్లుగా భిన్నరూపాలలో భారత దేశంలో ఫరిడ విల్లిన ఒక మిశ్రమ సంస్కృతి, నాగరికత హైదరాబాద్‌ రాజ్య విలీనం వల్ల విధ్వంసమైపోయింది. దేశ విభజన మీద వచ్చిన సినిమాలు, సాహిత్యం పాఠకులకు పరిచితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ రాజ్య విలీన ప్రక్రియ దరిమిలా సాహిత్యం రాలేదా, వస్తే ఎందుకు దానిపై ఎవరూ దృష్టి పెట్టలేదన్న ప్రశ్న నన్ను తొలిచివేసేది. గత 25ఏళ్లుగా దృష్టి పెట్టి అడపా, దడపా కొన్ని కథలు, కొన్ని నవలలు, ఆత్మకథలు సేకరించి చదవగలిగాను. ఆ సాహిత్యాన్ని ఏ దృక్పథంతో నిర్వచించాల న్నది నాకు సమస్యగా నిలిచింది. చివరికి ‘ఇంటిగ్రేషన్‌ లిటరేచర్‌’గా నిర్వచిస్తే దాని పరిధి చాలా విస్తృమౌతుంది కనుక అదే ఖాయం చేశాను. ఈ రచనలను అధ్యయనం చేస్తే యూరోపులో రెండు ప్రపంచయుద్ధాల నేపథ్యంలో వచ్చిన ప్రగతిశీల రచనలకు ఏ మాత్రం తీసిపోనివని చెప్పవచ్చు.


ఇంటిగ్రేషన్‌ దరిమిలా ఆనాటి హైదరాబాద్‌ నగరాన, మిగతా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో భీతావాహమైన, సంక్షుభితమైన పరిస్థితులను చిత్రిస్తూ చాలా నవలలు, కథలు వచ్చాయి. వీటిలో ఈ పరిణామాలకు ప్రత్యక్ష బాధితులైనవారి జీవితాలను చిత్రిస్తూ వచ్చిన నవలలు, ఇంటిగ్రేషన్‌ దరిమిలా జాగిర్దారీ వ్యవస్థ రద్దు కావడంతో పాలక వర్గాలలో వచ్చిన సంక్షోభాన్ని చిత్రించిన కథలు ఉన్నాయి. కవిరాజమూర్తి రాసిన ‘నేను గరిబోన్ని’, ‘చీకటి రాత్రి’; అశోక మిత్రన్‌ ‘జంట నగరాలు’ (ఆంగ్ల నవలకు తర్జుమా); భాస్కరభట్ల కృష్ణారావు ‘యుగసంధి’; జిలానీ భాను ‘ఐవానే గజల్‌’; బొల్లిముంత శివరామకృష్ణ ‘మృత్యుం జయులు’; ఆళ్వారు స్వామి ‘గంగు’; మాదిరెడ్డి సులోచన ‘జన్మభూమి’ నవలలు ముఖ్యమైనవి. ‘జన్మభూమి’ నవల ముస్లిం స్త్రీల కోణంలోంచి ఆనాటి పోలీసు చర్యను, రజాకార్ల దుశ్చర్యలను చిత్రిస్తుంది. కొత్వాల్‌ వెంకట్రామారెడ్డి మనుమ రాలు మోహినీ రాజన్‌ (ఆంగ్ల రచయితతో కలిసి) రాసిన ‘అవర్‌ బిలవ్డ్‌ డేస్‌’ రచన కూడా చాలా ముఖ్యమైంది. హైదరాబాద్‌  రాజ్యం అంతర్థానానికి దారి తీసిన పరిణామాల భూమికలో వచ్చిన కథలు 17 వరకు ఉన్నాయి. విషాదం, సామాజిక పతనం, దుఃఖం వీటికి నేపథ్యం. రాసిన వారిలో జిలానీ బాను, దాశరథి, హీరాలాల్‌ మో రియా, కాళోజీ నారాయణ రావులు కూడా ఉన్నారు. ఆత్మకథలు, నాటకాలు ఇతర రచనలు విస్తా రంగా వచ్చాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో వచ్చాయి. రాజకీయ చరిత్ర గ్రంథాలు, పత్రికల ప్రత్యేక సంచికలు అనేకం ఉన్నాయి. స్వల్పంగా మరాఠీ, కన్నడ, హిందీలో కూడా ఈ సా హిత్యం వచ్చింది. హైదరా బాద్‌ రాజ్యం విలీనానికి దారితీసిన పరిస్థితులపై అందులో కీలక భాగస్వాములైన ప్రముఖుల ఆత్మకథలు వెలువడ్డాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రత్యక్ష సాక్షులు కనుక వ్యక్తిగత పరిమితులలో వాస్తవాలనే చిత్రించారు. రావి నారాయణరెడ్డి ‘నా జీవితపథంలో’, స్వామి రామానంద తీర్థ ఆత్మకథ, హైదరాబాద్‌ రాజ్య అత్యున్నత సైనికాధికారి జనరల్‌ ఇద్రూస్‌ ఆత్మకథ ‘సెవన్‌ గ్లోవ్స్‌’ (ఇంగ్లీషు), కెఎం మున్షీ ‘ఎండ్‌ ఆఫ్‌ ఆన్‌ ఎరా’ (ఇంగ్లీషు), చివరి ప్రధాని మీర్‌ లాయక్‌ అలీ ఆత్మకథ ‘ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్‌’ (ఇంగ్లీషు) చాలా ముఖ్యమైనవి. 


పోలీసు చర్యగా జరిగిన విలీనంపై ప్రతిఘటన స్పూర్తితో కవిత్వం రూపంలో వచ్చిన నిరసన కూడ చాలా విశిష్టమైంది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య అంతర్జాతీయంగా తలెత్తిన డాడా, సర్రిలియలిస్టు పోకడల ప్రభావం కూడా తెలంగాణ కవితపై పడింది. ఎన్నడూ చవిచూడని పరిస్థితులను చిత్రిక పట్టడానికి వచ్చిన ఆధునిక కవితా ఉద్యమాలివి. ఫాసిజాన్ని నిరసిస్తూ వచ్చిన అంతర్జాతీయ ప్రగతిశీల సాహిత్యోద్యమం శాంతి పేరుతో బలహీనపడిన కాలాన హైదరాబాద్‌, తెలంగాణ కేంద్రంగా వచ్చిన కవిత్వమిది. పూర్తిగా స్థానికంగా రూపు దిద్దుకున్నది. 1946 నుంచి 1954ల మధ్యకాలాన ఉరకలేసిన ఈ కవిత్వానికీ, అటు విశాలాంధ్రకోసం అభ్యుదయం పేరుతో వచ్చిన కవిత్వానికి సంబంధమేలేదు. నిజాం పాలిత హైదరా బాద్‌ రాజ్యంలోని సామాజిక రాజకీయ పరిస్థితులు, జీవన రీతి- మద్రాసులో భాగమైన ఆంధ్ర సామాజిక పరిస్థితులు, భాష పూర్తిగా వేరు. రెండూ పూర్తిగా భిన్న ప్రపంచాలు. ఆ తేడా ఆనాటి తెలంగాణ, ఆంధ్ర సాహిత్యరంగాలలో కూడ ప్రతిఫలించింది. ఆంధ్ర అభ్యుదయ సాహిత్యం పేరుతో ప్రచారంలో పెట్టిన ముస్లిం వ్యతిరేకత, తెలంగాణ సమాజం పై ప్రతికూల దృష్టి, తెలుగు సెంటిమెంటు వంటివి తెలంగాణ తెలుగు కవులు ఏనాడు ప్రచారంలో పెట్టలేదు. తెలంగాణ కవితను చూస్తే సార్వజనీనత, పోరాటం, జనసామాన్య పక్షం సహా స్థానికత, ఉర్దూ ప్రభావం వల్ల కావచ్చు- విషాద ప్రణయం వంటివి కొట్టచ్చినట్టు కనిపిస్తాయి. ఆనాటి కవితా సంపుటాల పేర్లు కూడ వేరుగా ఉంటాయి. విలీనం వల్ల ఏర్పడిన యుద్ధ వాతావరణం, సంఘ ర్షణను గొప్పగా ప్రతిఫలించిన మహాకావ్యాలు కవిరాజమూర్తి ‘మహైక’, ‘మానవ సంగీతం’; సినారె ‘జలపాతం’, ‘విశ్వగీతి’. సుప్రసన్న, యశో దారెడ్డి, దాశరథి రామచంద్రయ్య వంటివారు కూడ రాశారు. ఆ పరిస్థితుల పరోక్ష ప్రతిఫలనాలను ఊటు కూరు రంగారావు ‘శరధార’, అష్టకాల నరసింహా శర్మ ‘శిథిల విపంచి’ కావ్యాలు కూడ చిత్రించాయి. 


హైదరాబాద్‌ రాజ్య విలీనం పరిణామాలను పరిశీలిస్తే అది రాత్రికి రాత్రి జరిగిందేమీ కాదు. దీనికి రాజకీయ, సామాజిక పూర్వరంగం కూడా ఉన్నది. ఈ పూర్వరంగంలో వచ్చిన తెలంగాణ తెలుగు సాహిత్యం శతాబ్దాల తరబడి వేళ్లూనుకున్న భూస్వామ్య రాచరిక వ్యవస్థలో పగుళ్లు పడు తున్న పరిణామాలను చిత్రించింది. వీటిలో తెలుగు, ఉర్దూ రచనలు ఉన్నాయి. తెలుగు రచనలలో సురవరం కథలు, ఉర్దూ రచనల్లో ఆజిజ్‌ ఆహ్మద్‌ ‘ది వేవ్‌ అండ్‌ షోర్‌’ ముఖ్య మైనవి. భారత దేశంలో హైదరాబాద్‌ ఇంటిగ్రేషన్‌ జరిగిన తర్వాత వచ్చిన కథలలో మానవ సంబంధాలలో చోటు చేసుకున్న విచ్ఛిత్తి, కొత్త పరిస్థితులలో సర్దుబాటుకు పోరాటం కనిపిస్తాయి. కొత్త పరిస్థితులలో కొత్త జీవితాల గమనం కోసం జరిపే అన్వేషణ ఈ కథలలో కనిపిస్తాయి. మొత్తంగా చూస్తే, ఈ సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేస్తే, మతం, జాతి పేరుతో సామ్రాజ్యవాదులు, వలసపాలకుల వ్యూహాలు, వారికి తాబేదారులుగా మారిన స్థానిక పాలక వర్గాల అధికార దాహం... ఇవన్నీ అవగతం కావడం ఖాయం. 

సామిడి జగన్‌రెడ్డి

85006 32551


Advertisement
Advertisement
Advertisement