నగరంలో సమీకృత మార్కెట్లు

ABN , First Publish Date - 2022-01-18T05:19:03+05:30 IST

స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతి నిధులతో కరీంనగర్‌ నగరపాలక సంస్థ సమీకృత మార్కెట్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

నగరంలో సమీకృత మార్కెట్లు
సమీకృత మార్కెట్‌ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేస్తున్న మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ సేవా ఇస్లావత్‌

- ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు

- రూ. 5.8 కోట్లతో వ్యవసాయ మార్కెట్‌యార్డులో పనులు ప్రారంభం 

- రూ. 14 కోట్లతో కలెక్టర్‌ బంగ్లా ఎదుట నిర్మాణానికి టెండర్లు పూర్తి 

- జీ+2తో కశ్మీరుగడ్డ రైతుబజారు వద్ద నిర్మాణం


కరీంనగర్‌ టౌన్‌, జనవరి 17: స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతి నిధులతో కరీంనగర్‌ నగరపాలక సంస్థ సమీకృత మార్కెట్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో విస్తరిస్తున్న కాలనీల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పట్టణ ప్రగతి నిధులతో పరిశుభ్రమైన కూరగాయలు, చికెన్‌, మటన్‌, చేపలు, పండ్లు అన్ని ఒకే చోట దొరికే విధంగా సమీకృత మార్కెట్ల నిర్మాణాలకు సమగ్ర ప్రతిపాదనలను రూపొందించింది. నగరంలో ఆరు సమీకృత మార్కెట్లను ముందుగా నిర్మించి అవసరమైతే మరికొన్నిటిని కూడా నిర్మించాలనే ఆలోచనతో ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌కు చేరువలోని కలెక్టర్‌ బంగ్లా ఎదుట గల ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయ ఆవరణంలో ఒకటి, కశ్మీరుగడ్డ రైతుబజారు స్థలంలో మరొకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఒకటి, సిరిసిల్ల రోడ్డు రాంనగర్‌ పశుసంవర్థక శాఖకు చెందిన స్థలంలో మరొకటి,  జగిత్యాల రోడ్డులోని ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాపు స్థలంలో ఇంకొకటి మొత్తం ఆరు సమీకృత మార్కెట్లను నిర్మించనున్నది. ఇందులో భాగంగా కార్ఖానగడ్డ వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో .5.8 కోట్లతో జీ+1 భవనంగా నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్‌ సముదాయానికి ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ యాదగిరి సునీల్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్‌ సూచనలతో మిగిలిన సమీకృత మార్కెట్ల నిర్మాణాలను వేగంగా చేపట్టేందుకు మేయర్‌ సునీల్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. 

 

రాంనగర్‌, ఆర్టీసీ వర్క్‌షాపు సమీపంలో స్థల పరిశీలన 


కరీంనగర్‌-సిరిసిల్ల రహదారిలోని పశుసంవర్థకశాఖ స్థలం, కరీంనగర్‌- జగిత్యాల రహదారిలోని ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాపు, ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయ స్థలాలను కమిషనర్‌ సేవా ఇస్లావత్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. ఆయాశాఖలకు సంబంధించిన స్థలాలను మున్సిపాలిటీలకు అప్పగించేందుకు వీలైనంత త్వరగా పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ బంగ్లా ఎదుట 14 కోట్లతో జీ+2 మార్కెట్‌ సముదాయాన్ని నిర్మించేందుకు టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. మరోవైపు కశ్మీరుగడ్డ రైతుబజార్‌ స్థలంలో నిర్మించే మార్కెట్‌ సముదాయానికి ప్రతిపాదనలను సిద్ధం చేసి టెండర్లు నిర్వహించాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించడంతో వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు. స్మార్ట్‌సిటీ ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనులు చివరి దశకు చేరుకోవడంతో ఫేజ్‌-3 పనులతోపాటు సమీకృత మార్కెట్ల నిర్మాణాలనుకూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు. 


నగర నలుమూలల సమీకృత మార్కెట్లు..: మేయర్‌ వై సునీల్‌రావు 


 నగరవాసులు పరిశుభ్రమైన కూరగాయలు, మాంసం, చేపలు, పండ్లు ఒకే చోట్ల లభ్యమయ్యే విధంగా నగర నలుమూలల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా సోమవారం కమిషనర్‌ సేవా ఇస్లావత్‌తో కలిసి సిరిసిల్ల, జగిత్యాల రోడ్లలో స్థల పరిశీలన చేశాం. త్వరలోనే టెండర్‌ ప్రక్రియ నిర్వహించి పనులు ప్రారంభిస్తాం. ఈ యేడాది చివరి వరకు మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాం.


Updated Date - 2022-01-18T05:19:03+05:30 IST