సమతూకంతో సమగ్రాభివృద్ధి

ABN , First Publish Date - 2020-08-11T09:09:29+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఐటీ గ్రిడ్‌ పాలసీ’తో.. ఐటీ కంపెనీలు గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ విస్తరించనున్నాయి. ఇప్పటి వరకూ పశ్చిమానికే పరిమితమైన ఐటీ కారిడార్‌..

సమతూకంతో సమగ్రాభివృద్ధి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఐటీ గ్రిడ్‌ పాలసీ’తో.. ఐటీ కంపెనీలు గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ విస్తరించనున్నాయి. ఇప్పటి వరకూ పశ్చిమానికే పరిమితమైన ఐటీ కారిడార్‌.. ఇక నలుమూలలా వ్యాపించనుంది. ఒకే ప్రాంతంలో కంపెనీలుండటంతో ఐటీకారిడార్‌లో ట్రాఫిక్‌, వాయు కాలుష్యం, కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం హైదరాబాద్‌ నలువైపులా అభివృద్ధికి మొగ్గుచూపుతూ ‘ఐటీ గ్రిడ్‌ పాలసీ’ని తీసుకువచ్చింది. ఐటీగ్రిడ్‌ పాలసీలో భాగంగా కొత్తగా భూసేకరణ వంటి సమస్యలకు తావులేకుండా ప్రభుత్వం ఓ బృహత్తర ప్రతిపాదన చేసింది. ఇప్పటికే నగరం నలుమూలలా విస్తరించిన పారిశ్రామిక వాడలనే ఐటీ పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఉప్పల్‌, నాచారం, మల్లాపూర్‌, చర్లపల్లి, జీడిమెట్ల, గుండ్లపోచంపల్లి, కాటేదాన్‌, గగన్‌పహాడ్‌ వంటి పారిశ్రామిక వాడలు, పోచారం సెజ్‌, ఆదిభట్లలోని ఐటీ సెజ్‌, ఏరోస్పే్‌ససెజ్‌లు వంటి ప్రదేశాలు ఐటీ గ్రిడ్‌కు అనుకూలంగా ఉన్నాయి. పారిశ్రామిక వాడలను ఐటీ పార్కులుగా మార్చేందుకు ప్రభుత్వం బుధవారం నాటి కేబినెట్‌ భేటీలో స్పష్టతనిచ్చింది.


పారిశ్రామిక వాడల మార్పిడి ఇలా..

ఈ పాలసీ ద్వారా ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్స్‌ను ఐటీ పార్కులుగా మార్పిడి చేసుకోవచ్చు. డెవలపర్లకు 50:50 వాటా కల్పిస్తారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు వచ్చిన ముప్పేమీ ఉండదు. బిల్డప్‌ స్పేస్‌లో 50ు లేదా అంతకంటే ఎక్కువ వాటాను ఇతర పరిశ్రమలకు కేటాయిస్తారు. మిగతా భాగాన్ని ఐటీ కంపెనీలకు ఇస్తారు. ఇలా పారిశ్రామిక వాడలను ఐటీపార్కులుగా మార్చుకోవడానికి.. ఐడీఏలోని ప్రాథమిక రిజిస్ట్రేషన్‌ విలువలో 30ు చెల్లిస్తే సరిపోతుంది.

హైదరాబాద్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌రోడ్డు ఉండటం.. మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో.. ఐటీ కంపెనీలు కూడా ఉత్తరం, దక్షిణం, తూర్పులో యూనిట్ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. నాచారం, మల్లాపూర్‌ నుంచి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు మీదుగా గంటలో విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అదేవిధంగా.. పోచారం సెజ్‌, చర్లపల్లి ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ నుంచి విమానాశ్రయానికి గంట ప్రయాణం.


ఐటీ కంపెనీలకు భారీ రాయితీలు..

పశ్చిమంలో కాకుండా.. హైదరాబాద్‌ చుట్టూ ఇతర ప్రాంతాల్లో ఏర్పాటయ్యే కంపెనీలకు ‘ఐటీ గ్రిడ్‌ పాలసీ’ రాయితీలను ప్రకటించింది. ఈ కంపెనీలకు యూనిట్‌ విద్యుత్తులో రూ.2 మేర రాయితీ ఉంటుంది. దీన్ని గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఇస్తారు. ఇక లీజు అద్దె విషయంలోనూ 30ు రాయితీతో ఉపశమనం ఉంటుంది. లీజులో గరిష్ఠంగా రూ.10 లక్షల దాకా రాయితీ ఉంటుంది. 500 కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే కంపెనీలు, యూనిట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయి. ఐటీ గ్రిడ్‌ మార్గదర్శకాలు ఐదేళ్ల వరకు ఉంటాయి.


సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి చేయాలి

ఐటీ అభివృద్ధి చెందాలంటే సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ముఖ్యం. హౌసింగ్‌, స్కూళ్లు, వైద్య సేవలు, పార్కుల వంటివి సమీపంలో ఉంటేనే ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదిభట్ల, పోచారంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసినా మాదాపూర్‌, గచ్చిబౌలికి ఉన్న డిమాండ్‌ను అందుకోలేకపోయాయి. అందుకు కారణం అక్కడ సోషల్‌ ఇన్‌ఫ్రా సరిగా లేకపోవడమే. - రమేశ్‌ లోగ్‌నాథన్‌, హైసియా మాజీ అధ్యక్షుడు


ఇక నుంచి నలువైపులా అభివృద్ధి

ప్రభుత్వ నిర్ణయంతో ఇక ఐటీ అభివృద్ధి హైదరాబాద్‌ నాలుగు మూలలకూ విస్తరించనుంది. దీని వల్ల ఉద్యోగులకు దూరాభారం తగ్గుతుంది. సోషల్‌ ఇన్‌ఫ్రా, ఫిజికల్‌ ఇన్‌ఫ్రాను అభివృద్ధి చేస్తే.. అన్నివైపులా ఐటీ కారిడార్లు సాధ్యమే. ఐటీ పార్కుల వద్ద శాటిలైట్‌ టౌన్‌షిప్పులు రావాలి. అందుకు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ను అనుసరించి అక్కడ లేఅవుట్‌లకు అనుమతివ్వాలి.

- జి.వి.రావు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

Updated Date - 2020-08-11T09:09:29+05:30 IST