Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ప్రగతి దిశగా..

twitter-iconwatsapp-iconfb-icon
ప్రగతి దిశగా.. జెండా వందనం చేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- సమగ్రాభివృద్ధే లక్ష్యం.. సంక్షేమమే ధ్యేయం 

- సమష్టి కృషితోనే ఇది సాధ్యం

- గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

(కలెక్టరేట్‌, జనవరి 26)

‘ప్రజా సంక్షేమమే ధ్యేయం. సమగ్రాభివృద్ధే లక్ష్యం. సమష్టి కృషితో ప్రగతి దిశగా పయనిద్దాం. జిల్లాను మరింత అభివృద్ధి చేద్దాం’ అని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పిలుపునిచ్చారు. బుధవారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లావాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత రాజ్యాంగానికి కట్టుబడి, సుసంపన్నమైన వారసత్వ సంపదను కాపాడుకోవాలి. భావితరాలకు మంచి మార్గదర్శకం చూపాలి. సమష్టి కృషితో మరింత అభివృద్ధి దిశగా పయనించాలి’ అని పిలుపునిచ్చారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రగతి, జిల్లా అభివృద్ధిని వివరిస్తూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘జిల్లాలో కరోనా మూడో దశ ప్రారంభమైంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. వైద్య ఆరోగ్యశాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు. జిల్లాలో 37 ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు చికిత్సలు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోంది. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నాం. జిల్లాలో సాగు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. విద్యార్థుల కోసం అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తోంది. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ.. అందరికీ ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతోంది’ అని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. 


అలరించిన నృత్య ప్రదర్శనలు

గణతంత్ర వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. నృత్య ప్రదర్శనల్లో పోలాకి కేజీబీవీ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ‘కరోనాను తరిమి కొడదాం’ అంటూ కేజీబీవీ విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. కరోనా బాధితులు, మృతుల కుటుంబ సభ్యులు పడుతున్న బాధలను కళ్లకు కట్టినట్టు చూపారు. శ్రీకాకుళం పోస్టుమెట్రిక్‌ వసతిగృహ విద్యార్థులు ద్వితీయ స్థానం, సాయి విద్యామందిర్‌(పీఎన్‌ కాలనీ) విద్యార్థులు తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ జ్ఞాపికలు అందజేశారు. 


ఆకట్టుకున్న శకటాలు, స్టాల్స్‌  

ప్రభుత్వ శాఖల ప్రగతిని చాటి చెప్పే శకట ప్రదర్శనలు, స్టాల్స్‌ ఎంతో ఆకట్టుకున్నాయి. శకటాల ప్రదర్శనలో విద్యాశాఖ ప్రథమ స్థానంలో నిలవగా, గృహనిర్మాణ శాఖ ద్వితీయ స్థానం, ఉపాధి హామీ  పథకం (డ్వామా) తృతీయ స్థానాలను సాధించాయి. వీటితో పాటు పౌరసరఫరాలు, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, గ్రామీణ నీటి సరఫరా, జలవనరులు, వ్యవసాయ, రవాణా, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య, 104, 108, అగ్నిమాపక సేవలు.. వివిధ శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ, ఉద్యాన వనశాఖ, అగ్నిమాపక సంస్థ, జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ, విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్‌ పశు సంవర్థక శాఖ, వ్యవసాయ, మత్స్య .. తదితర శాఖలకు సంబంధించి ప్రగతిని చూపే స్టాల్స్‌ ఆకర్షణీయంగా నిలిచాయి. 


ఉత్తమ సేవలకు ప్రశంసలు

ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ అవార్డులకు సంబంధించి జిల్లా అధికారులను ఐదుగురిని, 205 మంది ఉద్యోగులను ఎంపిక చేశారు. వీరితో పాటు ఉత్తమ సేవలు అందించిన ఏడుగురు స్వచ్ఛంద సేవా సంస్థ ల ప్రతినిధులను గుర్తించారు. మొత్తం 217 మందికి కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌  ప్రశంసాపత్రాలు అందజేశారు. కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామానికి చెందిన స్వాతంత్ర సమర యోధురాలు మంత్రి అప్పల నరసమ్మకు కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లాఠ్కర్‌ సత్కరించి జ్ఞాపికను అందించారు.


హిమప్రియ ధైర్య సాహసాలకు గుర్తింపు

దేశ సరిహద్దుల్లో 2018లో జరిగిన  ఉగ్రదాడులను దైర్యసాహసాలతో ఎదుర్కొని పలువురి ప్రాణాలు కాపాడిన జి.హిమప్రియకు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉన్నత గుర్తింపు లభించింది. ఆమె ధైర్య సాహసాలను మెచ్చి.. ఉత్తమ సేవకురాలిగా జిల్లా ఉన్నతాధికారులు గుర్తించారు. కలెక్టర్‌ చేతులమీదుగా ఆమెకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌, జేసీలు ఎం.విజయసునీత, కె.శ్రీనివాసులు, ఆర్‌.శ్రీరాములు నాయుడు, జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, రాష్ట్ర మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ హేమమాలిని రెడ్డి, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌, డీఆర్డీఏ పీడీ శాంతిశ్రీ, డ్వామా పీడీ కూర్మారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.