ఆత్మశక్తి

ABN , First Publish Date - 2020-06-26T08:23:04+05:30 IST

శ్రీ మిహిర్ సేన్‌కు ‘గజీతగాడు’గా ఇదివరకే ప్రపంచ ఖ్యాతి ఉన్నది. 1958లో ఆయనొకసారి ఇంగ్లీషు ఛానెల్‌ను ఈదారు. ఇప్పుడు సింహళం, ఇండియాల మధ్య పాక్ జలసంధిని ఈది తన అద్భుత సాహసాన్ని ప్రదర్శించారు...

ఆత్మశక్తి

పూర్వం దారీతెన్ను తెలియని మహా సముద్రాలపై తెరచాపల ఓడలతో ప్రయాణం చేసి కొత్త ఖండాలను కనిపెట్టినవారు, ఉత్తర  దక్షిణ ధ్రువాలను కనుగొన్నవారు, ఇటీవల ఎవరెస్టు శిఖరాన్ని జయించినవారు, రోదసి యాత్రలు చేస్తున్నవారు- ఎంచుకున్న సాహసాలు మానవుని విజిగీషకు, ధైర్యానికి, సహనానికి, ఎట్టి విపత్తులకైనా చలించని ఆత్మశక్తికి తార్కాణాలుగా చరిత్రలో నిలిచిపోతాయి.  శ్రీమిహిర్ సేన్ చర్య ఇటువంటిదే.


శ్రీ మిహిర్ సేన్‌కు ‘గజీతగాడు’గా ఇదివరకే ప్రపంచ ఖ్యాతి ఉన్నది. 1958లో ఆయనొకసారి ఇంగ్లీషు ఛానెల్‌ను ఈదారు. ఇప్పుడు సింహళం, ఇండియాల మధ్య పాక్ జలసంధిని ఈది తన అద్భుత సాహసాన్ని ప్రదర్శించారు. డోవర్, కేలేల మధ్య ఇంగ్లీషు ఛానెల్ వెడల్పు 21 మైళ్ళు. పాక్ జలసంధి ఇంతకంటే కొద్దిగానే పెద్దది. సింహళంలోని తలైమన్నార్, ఇండియా కొసన మండపంల మధ్య దూరం 22 మైళ్ళు. 


అయినా, శ్రీ సేన్ చేసిన ఈ కొత్త సాహసం విశేషాసక్తిని రేకెత్తించింది. పాక్ జలసంధి ప్రాంతంలో భయంకరమైన సొరచేపలు, సర్పాలు తిరుగాడుతూ ఉంటాయి. ఈ రోజులలో అక్కడ వానలు కురుస్తూ ఉంటాయి; అలలు ఉవ్వెత్తున లేచిపడుతూ ఉంటాయి. శ్రీసేన్ తన ఈతను ఒకసారి వాయిదా వేసి, తిరిగి నిర్ణయించిన రోజు పూర్ణిమ. ఆనాడు అలలు ఇంకా ఎత్తున రావచ్చు. అయినా ఆయన ఈ సవాళ్ళన్నిటిని జయప్రదంగా ఎదుర్కొని తన ప్రతిజ్ఞ నేరవేర్చుకున్నాడు. రామాయణ కాలంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించి (ఈది కాదు) లంకను చేరుకున్నాడని ఒక కథ ఉన్నది. ఇది నిజమైనా, కాకపోయినా అలౌకిక చర్య. అందుచేత కనీసం ఆధునిక కాలంలో, ఈతకు సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ఈదిన మొదటి భారతీయుడుగా శ్రీమిహిర్ సేన్ పేరు పొందారు. 


ఈ పేరు కోసమే ఆయన ఈ సాహసానికి పూనుకున్నారా? చెప్పలేము. కొందరికి సాహసాలు చేయడం, సవాళ్ళు ఎదుర్కొనడం, అపాయాలలో చిక్కుకొని తప్పించుకొనడం స్వభావసిద్ధంగా వచ్చే లక్షణాలు. పూర్వం దారీతెన్ను తెలియని మహాసముద్రాలపై తెరచాపల ఓడలతో ప్రయాణంచేసి కొత్త ఖండాలను కనిపెట్టినవారు, ఉత్తర దక్షిణ ధ్రువాలను కనుగొన్నవారు, ఇటీవల ఎవరెస్టు శిఖరాన్ని జయించినవారు, రోదసి యాత్రలు చేస్తున్నవారు–-వీరంతా ఇటువంటి సాహికులే. వారు ఎంచుకున్న సాహసాలను బట్టి వాటిలో కొన్ని కేవలం సాహసాలుగా మిగిలిపోగా, మరికొన్ని మానవ జాతి పురోగతికి తోడ్పడేవిగా ఉంటాయి. ఏమైనా అవన్నీ మానవుని విజిగీషకు, ధైర్యానికి, సహనానికి, ఎట్టి విపత్తులకైనా చలించని ఆత్మశక్తికి తార్కాణాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. శ్రీమిహిర్ సేన్ చర్య ఇటువంటిదే. 

(1966 ఏప్రిల్ 4 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘‘ ‘గజీతగాడు’ శ్రీమిహిర్ సేన్’’ నుంచి)

Updated Date - 2020-06-26T08:23:04+05:30 IST