తక్షణం, శాశ్వతం

ABN , First Publish Date - 2020-10-20T09:13:14+05:30 IST

‘‘అల్టిమేట్‌ పరిష్కారం వెతకాలి, వెతుకుతాం’’ – అన్నారు తెలంగాణ పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు...

తక్షణం, శాశ్వతం

‘‘అల్టిమేట్‌ పరిష్కారం వెతకాలి, వెతుకుతాం’’ – అన్నారు తెలంగాణ పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ప్రస్తుతం తమ దృష్టి తక్షణ సహాయ కార్యక్రమాల నిర్వహణపై, మరింత వర్ష సూచన కారణంగా నష్టనివారణపై, ముఖ్యంగా ప్రాణనష్ట నివారణపై కేంద్రీకరించామని ఆయన చెప్పారు. నిజమే. హైదరాబాద్‌ సాంత్వనకు తక్షణం జరగవలసింది జరగాలి. బాధితులను ఆదుకోవాలి. ధ్వంసమయిన పౌరవసతులను పునరుద్ధరించాలి. సాధారణ జనజీవనం ఏర్పడటానికి ఏమి చేయడం అవసరమో అదంతా చేయాలి. కానీ, ప్రభుత్వం అన్నది చాలా పెద్దది. విపత్తు నివారణ చర్యల్లో నిమగ్నమవుతున్నంత మాత్రాన, ప్రభుత్వానికి చెందిన బౌద్ధిక విభాగాలు తమ కర్తవ్యాన్ని నెరవేర్చకుండా ఉండనక్కరలేదు. భారీ వర్షాల వల్ల అతలాకుతలమైన ప్రజాజీవనం తక్షణ స్పందనను కోరుకుంటున్నట్టే, శాశ్వత పరిష్కారాన్ని కూడా, ఈ పర్యాయం మరింత అధికంగా, కోరుకుంటున్నది.


హైదరాబాద్‌లో నీరు చుట్టుముట్టి, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన అనేక నివాస ప్రాంతాలలో పరామర్శకు వచ్చిన ప్రజాప్రతినిధులను ప్రజలు ఎంత ఆగ్రహంతో, ఆవేదనతో నిలదీస్తున్నారో చూస్తున్నాము. ఆ నిలదీతలో ప్రజలు ఈ పరిస్థితికి తాము గుర్తించిన కారణాలను కూడా ఏకరువు పెడుతున్నారు. భూముల కబ్జాలోనూ, నీటివరదకు అడ్డుగా జరిగే నిర్మాణాలలోను ప్రజాప్రతినిధుల ప్రమేయాన్ని వాళ్లు ప్రస్తావిస్తున్నారు. త్వరలో నగరపాలక సంస్థకు జరిగే ఎన్నికలను ఎదుర్కొనవలసిన కార్పొరేటర్లు అనేకమంది, నిరుత్తురులుగా వెనుదిరుగుతున్నారు. 


నిజమే, విపరీతంగా వర్షం పడింది. నూటా నాలుగేళ్ల తరువాత ఇంతటి వర్షం పడింది. కాబట్టి ఇది వైపరీత్యమే. కానీ, ఆ కారణం వెనుక తలదాచుకోవడం కష్టం. ఇంత వర్షం రానప్పుడు కూడా నగరం ఏమీ మెరుగుగా లేదు. చిన్న వానకు కూడా రోడ్లు మడుగులు కావడం, ట్రాఫిక్‌ స్తంభించడం నగరవాసులకు తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి స్వయంగా వ్యాఖ్యానించినట్టు, చెరువు మట్టం లోపల కట్టిన నివాసప్రాంతాలలోకే నీరు వచ్చి చేరింది. అటువంటి నివాసాలు ఏర్పడడం మానవ తప్పిదమే. ఎటువంటి ప్రణాళికా లేకుండా, అలనాటి డ్రైనేజి వ్యవస్థ మీద మోయలేని భారం వేయడం విధాన తప్పిదమే. మానవతప్పిదం ఉన్నదని మంత్రి కూడా అంటున్నారు. ఈ తప్పు ఒకరిది కాదు ఒక ప్రభుత్వానిది కాదు, అని అంగీకరించవచ్చు. అన్ని ప్రభుత్వాలూ, అన్ని నగరపాలక సంస్థలూ, ధనలాలసులైన భూవ్యాపారులు, ఇతరుల పట్లా, తమ పట్లా కూడా బాధ్యత లేకుండా కొనుగోళ్లు, నిర్మాణాలూ చేసిన మధ్యతరగతి, ఎగువ తరగతి జీవులు– అందరూ బాధ్యులే. అట్లాగని, వేలును శూన్యంలోకి చూపలేము. సమష్టి బాధ్యత అని చెప్పి ఎవరూ బాధ్యత తీసుకోకుండా ఉండడాన్ని అనుమతించలేము. గత ప్రభుత్వాల మంచిచెడ్డలను, ఆర్థిక వ్యవహారాల లెక్కలను, సగంలో ఉన్న ప్రాజెక్టులను ఎట్లాగైతే అనంతర ప్రభుత్వం తీసుకుంటుందో, ఈ పరంపరాగత విషాదానికి పరిష్కారాన్ని కూడా ఇప్పుడున్న ప్రభుత్వమే తీసుకోవాలి. 


ఒక దుస్థితిలోకి పడిపోయినప్పుడు, తమను తాము వెక్కిరించుకోవడం, నిష్ఠూరంగా పాలకులనో, దేవుళ్లనో నిందించడం ప్రజలు చేస్తారు. మొన్నటికి మొన్న దుర్గం చెరువు తీగెల వంతెన చూసి, హైదరాబాద్‌ కిరీటంలోకి మరొక విహార మణి చేరిందని అంతా సంతోషించారు. వెంటనే, వరదలు వాస్తవ స్థితిని తెలియజెప్పాయి. సామాజిక మాధ్యమాలలో కొందరు అడుగుతున్నారు, ఎప్పటినుంచో ఉన్న సమస్య కదా, దీనికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు? ఫ్లయ్‌ఓవర్లను, పర్యాటక ఆకర్షణలను, ఇప్పుడు కొత్తగా సచివాలయ భవనాలను నిర్మిస్తున్నారు కదా, హైదరాబాద్‌ జలవ్యవస్థ చికిత్స ఎందుకు ప్రభుత్వాల ప్రాధాన్యాలలో లేదు? అన్ని ప్రభుత్వాలను కలిపి మాత్రమే కాదు, విడిగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా అడగవలసిన ప్రశ్న. ఎందుకంటే, గత ప్రభుత్వాలకు సమస్య తీవ్రత తెలియదు. సమస్య కారణాలతో వాటికి ఏకీభావం ఉన్నదో లేదో తెలియదు. కానీ, తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి, బాధ్యత కూడా అధికంగా ఉన్నది.


2016 సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురిశాయి. మళ్లీ అందరూ 1908 వరదలను యథావిధిగా తలచుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏమన్నారు? నాలాల మీద, వరదనీటి కాల్వల మీద కట్టిన అక్రమనిర్మాణాల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విశ్వేశ్వరయ్య రూపొందించిన తరువాత నగర డ్రైనేజి వ్యవస్థను తిరిగి విస్తరించింది లేదని అన్నారు. దౌర్భాగ్యమైన నగర ప్రణాళికారచనను తప్పు పట్టారు. 11వేల కోట్లు కావాలి, నాలుగైదేళ్ల సమయం కావాలి, మొత్తం 28 వేల ఆక్రమణలను తొలగిస్తాము– అన్నారు. నాలుగేళ్లు అయింది. నాలా ఆక్రమణల తొలగింపు ప్రయత్నం ఆరంభశూరత్వమే అయింది. ఆక్రమణలు ఇంకా పెరిగి ఉంటాయి. ఇతరుల తప్పులకు సంజాయిషీ ఇవ్వనక్కరలేదు కానీ, తామెందుకు ఏమీ చేయలేకపోయారో వివరణ ఇవ్వడం ఈ ప్రభుత్వం బాధ్యత.


జంటనగరాలలో నీటి వ్యవస్థలకు నీరుచేరే మార్గాలు, ఆ వ్యవస్థల నుంచి నీరు ప్రవహించిపోయే మార్గాలు, వరదనీరు త్వరితగతిన ప్రవహించిపోవడానికి ఉన్న కాల్వలు– వీటన్నిటిని సమీక్షించి, నగరజనాభాకు, నివాసప్రాంతాల విస్తృతికి తగినట్టుగా ఒక పూర్తి నూతన జల ప్రణాళికను రూపొందించడం ఇప్పటి అవసరం. ఆ ప్రణాళికను ప్రజల, నీటి, ప్రవాహ నిపుణుల, సామాజిక కార్యకర్తల భాగస్వామ్యంతో రూపొందించాలి. ఈ సారి వరదల ఘట్టం ముగిసిన వెంటనే సమస్యను అటకెక్కించాలనే ఆలోచన ఉంటే దాన్ని విరమించుకోవాలి, ఒక పరిష్కారానికి నాంది పలకాలి.

Updated Date - 2020-10-20T09:13:14+05:30 IST