కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన టీఎంసీ

ABN , First Publish Date - 2022-01-21T23:34:13+05:30 IST

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఇండియా గేట్

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన టీఎంసీ

కోల్‌కతా : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) స్వాగతించింది. గణతంత్ర దినోత్సవాల కవాతు కోసం నేతాజీపై రూపొందించిన పశ్చిమ బెంగాల్ శకటం తిరస్కరణకు గురైన  నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని, వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించింది. నేతాజీ అదృశ్యం వెనుక మిస్టరీని ఛేదించేందుకు తగిన చర్యలు తీసుకుని ఉంటే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అయ్యేదని పేర్కొంది. 


టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుణాల్ ఘోష్ విలేకర్లతో మాట్లాడుతూ, నేతాజీపై రూపొందించిన పశ్చిమ బెంగాల్ శకటాన్ని తిరస్కరించడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోందని చెప్పారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. అందుకే నేతాజీ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. అయినప్పటికీ తాము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆయన అదృశ్యమవడం వెనుక అంతుబట్టని కథను వెలుగులోకి తేవడం కోసం కేంద్రం తగిన చర్యలు తీసుకుని ఉంటే, ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అయ్యేదని చెప్పారు. 


టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ, కేంద్రం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే గణతంత్ర దినోత్సవాలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన నేతాజీ శకటాన్ని అనుమతించడం హానికరం కాదని తాను భావిస్తున్నానన్నారు. సంకుచిత రాజకీయాల కారణంగానే దీనిని తిరస్కరించారని ఆరోపించారు. దీంతో బీజేపీకి దేశంలోని ప్రముఖుల పట్ల ఎంత గౌరవం ఉందో తేటతెల్లమైందన్నారు. అందుకే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, భారత దేశ కృతజ్ఞతాభావానికి గుర్తుగా నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ విగ్రహం తయారయ్యే వరకు అక్కడ ఆయన హోలోగ్రామ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా ఈ హోలోగ్రామ్‌ను తాను ఆవిష్కరిస్తానని తెలిపారు. 



Updated Date - 2022-01-21T23:34:13+05:30 IST