యువతులే టార్గెట్‌

ABN , First Publish Date - 2022-07-16T16:09:12+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌ అడ్డాగా వందమందికి పైగా అమ్మాయిల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఐదేళ్లుగా ఇదే తరహా మోసాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడి జైలుకు

యువతులే టార్గెట్‌

ఇన్‌స్టాగ్రామ్‌ అడ్డాగా మోసాలు

వందమందికి పైగా బాధితులు

నిందితుడి అరెస్ట్‌

తెలుగు రాష్ట్రాల్లో కేసులు 

పలుమార్లు జైలుకెళ్లొచ్చినా మారని బుద్ధి


హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: ఇన్‌స్టాగ్రామ్‌ అడ్డాగా వందమందికి పైగా అమ్మాయిల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఐదేళ్లుగా ఇదే తరహా మోసాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వస్తున్నాడు. తాజాగా అమెరికాలో స్థిరపడిన ఓ యువతి ఫిర్యాదుతో మరోసారి హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు పీటీ వారంట్‌పై అరెస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ బీటెక్‌ పూర్తి చేశాడు. జల్సాలకు అలవాటుపడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. సోషల్‌మీడియా ద్వారా కేవలం అమ్మాయిలను మాత్రమే టార్గెట్‌ చేసి పథకం ప్రకారం వారిని ట్రాప్‌ చేస్తూ మోసాలకు పాల్పడ్డాడు. హైప్రొఫైల్‌ వ్యక్తిలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఐడీ క్రియేట్‌ చేసి, పారిశ్రామికవేత్తలా బిల్డప్‌ ఇచ్చి పెట్టుబడులకు భారీ లాభాలు అంటూ కలరింగ్‌ ఇస్తూ అమ్మాయిల నుంచి డబ్బులు కాజేసి బెదిరిస్తుండేవాడు. 2017 నుంచి ఇప్పటివరకు నగరంలో మూడు కమిషనరేట్లు సహా రెండు రాష్ట్రాలలోని పలు పీఎ్‌సలలో 16 కేసులు నమోదయ్యాయి. అతడి బారినపడి మోసపోయిన యువతుల సంఖ్య వందమందికిపైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అమెరికాలో స్థిరపడిన నగరానికి చెందిన ఓ యువతి అతడి బారిన పడి రూ. 25 లక్షలు పోగొట్టుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు నిందితుడు వంశీకృష్ణను గతనెల 30న అరెస్ట్‌ చేశారు. కోర్టు అనుమతితో ఈనెల 11న కస్టడీకి తీసుకున్నారు. మూడు రోజుల విచారణ అనంతరం 13న తిరిగి జైలుకు తరలించారు.  


నాలుగు ఐడీలతో..

అందమైన అమ్మాయిల ప్రొఫైల్‌ చిత్రాలతో మూడు ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలు క్రియేట్‌ చేశాడు. ఇంకొకటి ఓ రాష్ట్రానికి చెందిన యువ ఎమ్మెల్యే పేరుతో క్రియేట్‌ చేశాడు. వీటి ద్వారా షేర్‌మార్కెట్‌ ఇతరత్రా పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లుగా ఖరీదైన కార్లు ఇతరత్రా ఫొటోలు షేర్‌ చేసేవాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే యువతులను ఎంచుకొని వారికి మెసేజ్‌లు పంపించి, పరిచయం పెంచుకొని వ్యాపారాలలో పెట్టుబడులపై భారీ లాభాలు వస్తున్నాయని నమ్మించేవాడు. అతడి మాటలు నమ్మిన ఎంతోమంది యువతులు రూ. లక్ష నుంచి 40 లక్షలు పెట్టుబడి పెట్టారు. అమెరికాలో స్థిరపడిన హైదరాబాద్‌ యువతిని షేర్‌మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో నమ్మించాడు. అత్యవసరంగా రూ. 25 లక్షలు కావాలని, వారం రోజుల్లో వడ్డీతో చెల్లిస్తానన్నాడు. దీంతో యువతి నగరంలో ఉన్న తన తండ్రికి నిందితుడి అకౌంట్‌ నెంబర్‌ పంపించి డబ్బు డిపాజిట్‌ చేయించింది. నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడం, బెదిరిస్తుండడంతో మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2022-07-16T16:09:12+05:30 IST