ఇన్‌స్టాగ్రామ్‌

ABN , First Publish Date - 2022-01-03T06:19:09+05:30 IST

బిగ్‌బజార్లో ఎదురుపడ్డప్పుడు అద్దం మురిసే ముఖాలతో పలకరించుకుంటున్నాం సభల్లో సమావేశాల్లో ఈవెంట్లవారీగా...

ఇన్‌స్టాగ్రామ్‌

బిగ్‌బజార్లో ఎదురుపడ్డప్పుడు 

అద్దం మురిసే ముఖాలతో 

     పలకరించుకుంటున్నాం-

సభల్లో సమావేశాల్లో 

ఈవెంట్లవారీగా 

     హర్షద్‌ మెహతా తోబుట్టువుల్లా

కలుసుకుంటూనే వున్నాం-


బర్త్‌ డేలకూ

వివాహ వేడుకలకూ గృహ ప్రవేశాలకూ

రిటర్న్‌ గిఫ్ట్‌లు గట్రా తీసుకొని వీఐపీల్లా

ఎంతదూరమైనా వెనకో ముందో 

     వెళ్లొస్తూనే వున్నాం-

సిసింద్రీలను చైల్డ్‌ కేర్‌ సెంటర్లలో

పూల బాల్యాన్ని కార్పొరేట్‌ హాస్టళ్లలో

వృద్ధుల దేశాన్ని

ఓల్డేజి హోముల్లో వస్తువుల్లా దమాయించి

డీమార్ట్‌ మిగులును

యుట్యూబ్‌ వంటకాల్లో షేర్‌ చేస్తూ

ఆండ్రాయిడ్‌ ఫోన్లతో 

     ఆనందమానందంగా బతికేస్తున్నాం-


ఇదివరకటి కంటే

రోజులిప్పుడు ఫక్తు స్మార్టే మరి

ఖర్చులకు పెట్టుడులకూ వెనుకాడేదేం లేదు-

ప్రాపర్టీ ప్రదర్శనలో ఎల్లక

మునుపటి వలె కుమిలిపోవుడూ లేదు-

కేటరింగ్‌ పుష్పగుచ్ఛాల ఆహ్వానం

టాపప్‌ జ్ఞాపికల వీడ్కోలు 

     అంతా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌

క్రెడిట్‌కార్డుల సస్యశ్యామలసామ్రాజ్యం-


ఏ ఇంటి  

గేటు తీసినా అంతస్తులపైకి విరగబాకిన 

కలోనియల్‌ మనీప్లాంట్‌-

ఏ జంట ఆల్బమ్‌ చూసినా

గోవా సౌందర్యాన్ని తలదన్నే రిసార్ట్‌స్‌

ఆసమ్‌ స్నాప్‌షాట్స్‌-

డాలర్‌ గుడ్లు పొదిగే అబ్రాడ్‌ కలల తెరకు

భూమిని విమానాల్లో మడతపెట్టే 

     ఓటీటీ సింఫనీ మీద

తీరికలేని ఎలైట్‌ ప్రేమలు-


ఒత్తిడికీ విత్తానికీ మధ్య 

జీవితం ఒక ఇమ్మెచ్యూర్‌ ఇన్సూరెన్స్‌ బాండ్‌-

ఇవ్వడానికీ

తీసుకోవడానికీ నడుమ 

     బంధాలూ అనుబంధాలే కాదు

దాంపత్యం సైతం

ఒక అన్‌పోస్టెడ్‌ మ్యూచివల్‌ ట్వీట్‌-

ఇప్పుడు

ఎవరూ ఎవరికీ పూచీకత్తు కాదు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదీ దేనికీ కోరిలేటెడ్‌ కాదు

ప్యాకేజీని బట్టే వర్క్‌ ఇన్‌ ఫేవర్‌-


ఇక్కడ

కేవలం కరెన్సీ మాత్రమే మాట్లాడుతుంది

జనాల కంతలకు

ఫాస్టాగ్‌ సూత్రమే కట్టుబాటై వుంది-


నాగరికత చౌరస్తాలో

మనిషిని ట్రేస్‌ చేసేట్టూ లేదు

యాంత్రిక యాతనల్లో

మనసుకు ఏ శ్రుతీ కుదిరేట్టూ లేదు.

బెల్లి యాదయ్య

Updated Date - 2022-01-03T06:19:09+05:30 IST