అమరావతి: ఏపీలో అస్థిరత పెద్ద స్థాయిలో నెలకొందని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. అస్థిరత పెరగటం వల్ల అన్ని అవకాశాలు పోయి.. పొరుగు రాష్ట్రాలకంటే వెనుకబడతామని హెచ్చరించారు. పాత చట్టం తీసేసి కొత్త చట్టంతో వస్తామన్నదానికి అర్థం పర్థం లేదని విమర్శించారు. సీఎం జగన్ నిర్ణయాలతో జనానికి తీరని లోటని తప్పుబట్టారు. వికేంద్రీకరణ పేరుతో మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని స్వాగతించి.. అధికారం రాగానే 3 రాజధానుల మంత్రం జపిస్తున్నారని అశోక్ గజపతిరాజు విమర్శించారు.
వికేంద్రీకరణ అంటే నవ్వులాట? అని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని జపించే జగన్ చేసిన అభివృద్ధేంటో చెప్పాలి? అని ప్రశ్నించారు. విశాఖలో భవనాలకు రంగులేస్తే రాజధాని అవుతుందా అని నిలదీశారు. వైసీపీ నిర్ణయాల్లో కొన్ని విషయాలు చూస్తే భయంగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక తల నొప్పి పోయిందంటే.. అంతకు మించిన తలనొప్పి వస్తోందని, రెండు నాలుకల ధోరణి ప్రభుత్వానికి మంచిది కాదని అశోక్ గజపతి హితవుపలికారు.