Abn logo
Aug 9 2020 @ 00:23AM

అజరామర ఆగస్టు స్ఫూర్తి

భారత స్వాతంత్ర్యోద్యమ లక్ష్యం బ్రిటిష్ వలసపాలనను అంతమొందించడం మాత్రమే కాదు, మహ్మద్ గజనీ దండయాత్రతో ప్రారంభమైన వెయ్యి సంవత్సరాల అంధకార యుగానికి చరమ గీతం పాడడం కూడా. 1942 ఆగస్టులో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం అంతిమంగా 1947 ఆగస్టులో స్వతంత్ర భారత జాతి ఆవిర్భావానికి దారితీసింది. సామాజిక సామరస్యత, జాతీయతా భావం లోపించిన శతాబ్దాల అంధకార యుగం నుంచి ఎట్టకేలకు దేశం విముక్తి పొందింది. 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమయింది. సుదీర్ఘ పోరాటాల సార్థక సాఫల్యాలైన ఈ సంఘటనలు మన వర్తమానానికి, భవిష్యత్తుకు విశ్వసనీయ సందేశాలనిస్తున్నాయి.


ఆధునిక భారతదేశ చరిత్రలో ఆగస్టు నెలకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉన్నది. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యోద్యమం ఫలసిద్ధి పొందింది. ఆ మహత్తర రోజుకు ఐదు సంవత్సరాల పూర్వం ‘విజయమో వీర స్వర్గమో ’ అనే ఉత్తేజకర పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయింది. 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ ఇలా అన్నారు: ‘మన మంత్రం డు ఆర్ డై. మేము భారతదేశాన్ని విడిపించుకుంటాము లేదా ఆ ప్రయత్నంలో చనిపోతాము; మా బానిసత్వ శాశ్వతత్వాన్ని చూడటానికి మేము జీవించం’. మహాత్ముని స్ఫూర్తిదాయక మాటలతో ఆసేతు హిమాచలం బ్రిటిష్ వలసపాలకులపై తిరుగుబాటు చేసింది. 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమయింది. సుదీర్ఘ పోరాటాల సార్థక సాఫల్యాలైన ఈ సంఘటనలు మన వర్తమానానికి, భవిష్యత్తుకు విశ్వసనీయ సందేశాల నిస్తున్నాయి. 


భారత స్వాతంత్ర్యోద్యమ లక్ష్యం బ్రిటిష్ వలసపాలనను అంతమొందించడం మాత్రమే కాదు. క్రీస్తు శకం రెండో సహస్రాబ్ది మొదటి సంవత్సరం (1001) లో మహ్మద్ గజనీ దండయాత్రతో ప్రారంభమైన 1000 సంవత్సరాల అంధకార యుగానికి చరమ గీతం పాడడం కూడా. ఆ యుగంలో దేశంలోకి వరుసగా వెల్లువెత్తిన దురాక్రమణదారులు, విదేశీ వర్తకులు, వలసవాదులు మన జాతి స్వతస్సిద్ధ బలహీనతలను పూర్తిగా ఉపయోగించుకున్నారు. మన సమున్నత సామాజిక-సాంస్కృతిక-ఆర్థిక వ్యవస్థలను చావుదెబ్బ కొట్టారు. నిస్సహాయులైన ప్రజలను అన్ని విధాల దోపిడీ చేశారు. 


దురాక్రమణదారులు ఎదురు బెదురు లేకుండా వచ్చి ఈ దేశాన్ని కొల్లగొట్టారు. ప్రజానీకంలో పరస్పర అన్యోన్యతా భావం లోపించడం, ఆనాటి అనేకానేకమంది రాచరిక పాలకుల మధ్య లక్ష్య పరమైన, కార్యాచరణపరమైన ఐక్యత లేకపోవడంతో పరసీమల పరాక్రమంతులకు మన దేశం సులభంగా లోబడిపోయింది. ఐక్యత లోపించిన కారణంగా అవమానాల పాలయింది. అమానుషాలకు గురయింది. భౌతికంగా ఛిన్నాభిన్నమయింది. మానసికంగా కకావికలయింది. ఒకప్పుడు సంపద్వంతమైన భారత్ పేదరికం, వెనుకబాటుతనంలోకి జారిపోయింది. ఈ సుదీర్ఘ చీకటి రోజుల్లో భారత్ తన ఆత్మను, అంతఃశక్తిని కోల్పోయింది. బ్రిటిష్ వలసపాలకుల దోపిడీ స్పష్టమైన తరువాత దేశ ప్రజలలో జాగృతి ఉదయించింది. తమ మహోజ్వల గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆవేదన చెందారు. ఆరాట పడ్డారు. స్వాతంత్ర్యోద్యమం మళ్ళీ వారిని, తమ భవిష్యత్తును నిర్మించుకోవడంలో ఏకీకృతం చేసింది. భావోద్వేగ జాతి భావం ఆవహించడంతో సమైక్యంగా ఉద్యమించారు. ఆ ఉద్యమం సహేతుకంగానే భారత జాతీయోద్యమంగా సుప్రసిద్ధమయింది. అంతిమంగా 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత జాతి ఆవిర్భవించింది. అనేక కష్ట నష్టాలకు ఎదురొడ్డి సాధించుకున్న ఈ స్వాతంత్ర్యం ఏమిటి? సామాజిక సామరస్యత, జాతీయతా భావం లోపించిన శతాబ్దాల అంధకార యుగం నుంచి మన దేశం విముక్తి పొందడమే కాదూ? అవును, ఇదే మన స్వాతంత్ర్య విశిష్టత గురించిన సముచిత అవగాహన. 


క్విట్ ఇండియా ఉద్యమం మన స్వాతంత్ర్యోద్యమంలో ఒక నిర్ణయాత్మక సంఘటన. 1942 ఆగస్టు 8న భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన క్విట్ ఇండియా తీర్మానం ఇలా నొక్కి చెప్పింది: ‘ఈ యుద్ధం సామ్రాజ్యవాదుల వలస రాజ్యాలను పరిరక్షించుకోవడం కోసమే అయితే, భారతదేశం దాన్ని పట్టించుకోదు. ఈ సమరం ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక ప్రపంచం కోసం అయితే భారతదేశానికి దానిపై అత్యంత ఆసక్తి చూపుతుంది. గ్రేట్ బ్రిటన్ పోరాడేది ప్రజాస్వామ్యం కోసమే అయితే, అది తన సామ్రాజ్యవాదాన్ని వదిలేసి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వాలి. భారతీయులకు స్వీయనిర్ణయాధికారం ఉంది. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య భారతదేశం పరస్పర రక్షణకు, ఆక్రమణలకు వ్యతిరేకంగా, ఆర్థిక సహకారం కోసం ఇతర స్వేచ్ఛా దేశాలతో కలిసిపని చేస్తుంది..’ . ఈ తీర్మానాన్ని ఆమోదించిన సందర్భంగా మహాత్మా గాంధీ ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం కోసం విజయమో వీరస్వర్గమో (డు ఆర్ డై) అన్న రీతిలో పోరాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపు భారతీయులను ఎనలేని విధంగా చైతన్యపరిచింది. బ్రిటిష్ పాలకుల తీరుతెన్నులతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలతో ఉన్న భారతీయులను ఆ మహత్తర పిలుపు తుది పోరాటానికి పురిగొల్పింది. ప్రజల ఉద్యమాన్ని అణచివేసేందుకు వైస్రాయ్ లిన్ లిత్ గో ప్రభుత్వం అమానుష హింసాత్మక పద్ధతులకు పాల్పడింది. అయినప్పటికీ ప్రజలు రెండు సంవత్సరాల పాటు అవిరామంగా, అకుంఠిత దీక్షతో పోరాటడి బ్రిటిష్ వలసపాలకులను గడగడలాడించారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన చివరి శాసనోల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా. స్వతంత్ర భారతదేశ ఆవిర్భావంలో ఒక నిర్ణయాత్మక ఘట్టమది. 


ప్రాదేశిక సమైక్యత లేనప్పటికీ శతాబ్దాలుగా విభిన్న రాజ్యాలు, ప్రాంతాలలో నివసిస్తున్న భారత ప్రజలు ఉమ్మడి సాంస్కృతిక సంప్రదాయాలు, సామాజిక ఆచారాలు, ధార్మిక విలువలకు కట్టుబడి ఉన్నారు. ఈ సాంస్కృతిక సజాతీయతకు దేవాలయాలు కీలక సాధనాలుగా సార్థకమయ్యాయి. విదేశీ దురాక్రమణ దారులు ఈ సాంస్కృతిక నిర్మాణాన్ని ధ్వంసం చేసేందుకు అన్ని విధాల ప్రయత్నించారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ప్రధాన ఆలయాలన్నిటిపై వారు దాడులు చేశారు. ఆ కోవెలలోని ఆస్తులను కొల్లగొట్టారు. ఆ ఆరాధనా మందిరాలను ధ్వంసం చేశారు. ఆ పవిత్ర నెలవులను అపవిత్రం చేశారు. క్రీ.శ. 1001-25 సంవత్సరాల మధ్య ఆప్ఘాన్ పాలకుడు మహ్మద్ గజనీ అనేక మార్లు సోమనాథ్ ఆలయం పై దాడిచేశాడు. ఆ ఆలయాన్ని పునర్నిర్మించి, పునరుద్ధరించేందుకు 925 సంవత్సరాలు పట్టింది. స్వాతంత్ర్యం లభించిన తొలి నాళ్ళలో సోమనాథ్‌కు మళ్ళీ పూర్తి వైభవాన్ని సంతరింప చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఐదు శతాబ్దాలు పట్టింది. అనైక్యతతో ఎవరికివారేగా వ్యవహరించినందుకు ఇది మనం చెల్లించిన మూల్యం. 


గత సహ్రసాబ్దిలో జాతికి ఎదురైన అవమానాలు మన భావి ప్రస్థానానికి మార్గదర్శక నిర్దేశాలు కావాలి. సమైక్యత సమున్నతంగా నిలబెడుతుందని, అనైక్యత అవస్థల పాలు చేస్తుందనేది మనం నేర్చుకోవల్సిన మొదటి పాఠం. పరిపూర్ణ భావ సమైక్యతా భారత్ మాత్రమే మనకు బాహ్య, అంతర్గత ముప్పులు, సవాళ్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. సర్వసమానత్వం, సమాన అవకాశాలకు భరోసానిచ్చే ప్రజాస్వామిక, న్యాయసంగత పాలనా సూత్రాలు ప్రాతిపదికన భారత్ దేశాన్ని నిర్మించుకోవాల్సిన అవసరమున్నది. తమ శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వైయక్తిక, సమష్టి ప్రయోజనాలకు ఉపయోగపరిచేలా ప్రతి భారతీయ పౌరుడు/ పౌరురాలికి సాధికారత కల్పించాలి. భారతీయత మినహా మరే విధమైన అస్తిత్వమూ ఎలాంటి ప్రాధాన్యం పొందకుండా జాగ్రత్త వహించాలి. జాతి హితానికి నిబద్ధతే మన ఆచరణకు స్ఫూర్తికావాలి. అగ్రగామి ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందితేనే ప్రస్తుత ప్రపంచ వ్యవస్థలో మనం గౌరవాదరాలు పొందగలమనేది ఒక నిష్ఠుర సత్యం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు, చొరవలతో మన ఆర్థిక శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఇది సుసాధ్యం కావాలంటే వైజ్ఞానిక, సాంకేతిక, పారిశ్రామిక, మానవ వనరుల అభివృద్ధి రంగాలలో మనం సమున్నత ప్రగతిని సాధించవలసిన అవసరం ఉన్నది. పేదరికం, నిరక్షరాస్యతలను గత కాలపు విషయాలుగా చేయాలి. చట్ట సభలు, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం పటిష్ఠంగా, ప్రభావశీలంగా పని చేసి జాతి పురోగమన మార్గంలోని అవరోధాలను పూర్తిగా తొలగించాలి. మరి కొద్ది రోజుల్లో 73 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న దృష్ట్యా ‘నిర్వహించు లేదా నశించు’ అనేది మన ధర్మ సూత్రం కావాలి. ఇది సకల వ్యక్తులకు, సంస్థలకు వర్తిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలను తెలుసుకొని వాటి ప్రాతిపదికన సమైక్య, సంపద్వంత భారతదేశాన్ని సృష్టించండి.

ముప్పవరపు వెంకయ్యనాయుడు

భారత ఉపరాష్ట్రపతి

Advertisement
Advertisement
Advertisement