Abn logo
Oct 31 2020 @ 00:37AM

పటేల్ స్ఫూర్తితో భావోద్వేగ సమైక్యత

Kaakateeya

సర్దార్ పటేల్ సాగించిన కృషి రాజకీయ సమైక్యతకు దారి తీస్తే, అత్యంత కీలకమైన భావోద్వేగ సమగ్రతను ప్రధాని మోదీ సాధిస్తున్నారు. ‘రాజకీయ సమైక్యత’ నుంచి ‘భావోద్వేగ సమైక్యత’కు మన దేశ ప్రయాణం ఇప్పుడు పూర్తయింది. అట్టడుగు వర్గాలను ఆర్థికంగా దృఢపరుస్తూ, కుల, మత భేదాలను చెరిపేస్తూ, వారికి గౌరవం, సామాజిక న్యాయం అందించేలా నిబద్ధతతో ప్రధాని కృషి చేస్తున్నారు. తన కార్యక్రమాల ద్వారా ఆయన సర్దార్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.


కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉన్న ఓఖూ గ్రామం కథను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇటీవలి ‘మన్ కీ బాత్’లో వినిపించారు. ఓఖూ గ్రామం పెన్సిళ్ల తయారీకి ప్రసిద్ధి. భారతదేశంలో తయారైన పెన్సిళ్లలో సుమారు 60శాతం ఓఖూ గ్రామంలోనే ఉత్పత్తి అవుతాయని అంచనా. ప్రభుత్వం నుంచి సరైన మద్దతు, ప్రోత్సాహం లభించడంతో ఓఖూ గ్రామ ప్రజలు తమ ఇళ్లలోనే పెన్సిల్ తయారీ యూనిట్లను స్థాపించి ఆదాయం పొందడంతో పాటు ఉద్యోగాలనూ సృష్టిస్తున్నారు.


కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైన సరిగ్గా ఏడాది తర్వాత, జమ్మూ కశ్మీర్లోని చాలా ప్రదేశాలు ఓఖూ మాదిరిగానే రూపుదిద్దుకుంటు న్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనేది ‘ఐక్య భారత్’ను నిర్మించడంలో సర్దార్ పటేల్ చేసిన అవిరళ కృషికి సంపూర్ణ నివాళి. ఈ మార్పు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కలలు గన్న ‘ఒకే దేశం ఒకే రాజ్యాంగం’ను సాకారం చేసింది. దీనివల్ల సుమారు 900 పైగా కేంద్రప్రభుత్వ చట్టాలు ఇక్కడ అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న334 రాష్ట్ర చట్టాలలో 205 రద్దయ్యాయి. ఇంకా మిగిలిన 129 రాష్ట్ర చట్టాలు పరిస్థితులకు అనుగుణంగా తగిన మార్పుచేర్పులతో అమలవుతున్నాయి. కశ్మీర్ సంపూర్ణ సమగ్రత ఇప్పుడు ఈ ప్రాంతంలో కనిపిస్తున్న అభివృద్ధికి నిదర్శనం.


కుంకుమ సాగు కోసం 3,500 హెక్టార్ల భూమి పునరుజ్జీవమే లక్ష్యంగా ‘జాతీయ కుంకుమ మిషన్’ వంటి ఏర్పాటు నిర్దిష్ట కార్యక్రమాలు, ఆపిల్‌తో పాటు ఇతర పళ్ల ఉత్పత్తిని పెంచేలా ఆ ప్రాంత రైతులను ప్రోత్సహించడం, యుద్ధప్రాతిపదికన విద్యుత్, రోడ్లు, నీటి సమస్యలను పరిష్కరించడం వంటి కేంద్రప్రభుత్వ కార్యక్రమాలు కశ్మీర్‌ పౌరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. ఉడాన్ పథకం కింద జమ్మూ కశ్మీర్లో 11, లడఖ్‌లో రెండు విమానాశ్రయాలను ఏర్పాటు చేయడంతో వాయురవాణా అనుసంధానత పెరుగుతోంది. రెండు ఎయిమ్స్ హాస్పిటల్స్, 9 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించడంతో వైద్యరంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం ఇప్పుడు జమ్మూ కశ్మీర్ నివాసితులందరికీ అందుబాటులోకి వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యలలో పౌరుల సహకారం పెంచేందుకు ఆర్థిక, రాజకీయ సమైక్యత దోహదపడుతోంది. జమ్మూలో అనేక జిల్లాలు, ఇప్పుడు, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను సమన్వయం చేసి అమలు చేయడంతో ఉగ్రవాద రహితంగా మారాయి.


మన రాష్ట్రం తెలంగాణ కూడా సర్దార్ వల్లభ్‌ భాయ్ పటేల్ పట్ల తరతరాలుగా కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శిస్తోంది. ముందు తరాలు కూడా ఆయనపై ఇదే గౌరవభావాన్ని కనబరు స్తాయి. 1947 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా మన జాతీయ జెండా ఆవిష్కరించి అందరూ స్వాతంత్య్రదినోత్సవాన్ని జరుపుకుంటుంటే, నాటి హైదరాబాద్ రాష్ట్రం మాత్రం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దౌర్జన్యాలతో మరో 13 నెలలు బానిసత్వంలో మగ్గాల్సి వచ్చింది. ఆ తరుణంలో ‘ఆపరేషన్ పోలో’ పేరిట సర్దార్ పటేల్ పోలీసు చర్యకు ఆదేశించడంతో హైదరాబాద్ దక్కన్ రాజ్యానికి 1948 సెప్టెంబర్‌ 17న విముక్తి లభించింది.


హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా స్థాపించాలన్న ఖాసిమ్ రిజ్వి వంటి నిజాం సలహాదారుల కుతంత్రాల నుంచి కాపాడటానికి అప్పట్లో ఆపరేషన్ పోలోను నిర్వహించక తప్పలేదు. స్వతంత్ర ఇస్లామిక్ దేశాన్ని సాధించడానికి నిజాం, పోర్చుగల్ నుంచి మార్మగోవా నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. ఎటువంటి సముద్రమార్గం లేని నిజాం రాజ్యానికి ఇది నౌకాశ్రయాన్ని అందించి స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావడానికి మరింత తోడ్పాటునందించేది. అంతేకాకుండా, 24,000 మందితో కూడిన నిజాం సైన్యానికి మద్దతుగా సుమారు 1,50,000 మంది మజ్లిస్ వలంటీర్లను రిజ్వి నిజాంకు అందించాడు. వాళ్లే తర్వాత రజాకార్లుగా మారి, రాచరిక రాష్ట్రంలో మారణహోమం సృష్టించారు. గ్రామాలను ధ్వంసం చేసి, మహిళలను వేధించి, పురుషులను చంపేసి, తమ దృష్టిలో పడ్డ ప్రతిదాన్ని ధ్వంసం చేశారు. సామాన్య ప్రజలు రజాకార్ల హింసకు అన్యాయంగా బలయ్యారు. రంగపురం,- లక్ష్మీపురం గ్రామాల్లో రజాకార్లు జరిపిన వినాశనాన్ని మన మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు దక్షిణ భారతదేశ జలియన్ వాలాబాగ్‌గా అభివర్ణించారు. రజాకార్లు ప్రజలను చెట్లకు కట్టి, కనికరం లేకుండా కాల్చి పారేసారు. మహిళలపై అత్యాచారం చేసి, వారి బంగారం, డబ్బు కొల్లగొట్టారు.


ఈ సంవత్సరం, సర్దార్ వల్లభ్‌ భాయ్ పటేల్‌ 145వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్) జరుపుకుంటున్నప్పుడు, మనం చేసిన ప్రయాణాన్ని, అధిగమించిన ఆటుపోట్లను మననం చేసుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ తన ఎజెండాను పూర్తి చేయడానికి స్థిరంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. సర్దార్ పటేల్ సాగించిన కృషి రాజకీయ సమైక్యతకు దారి తీస్తే, అత్యంత కీలకమైన భావోద్వేగ సమగ్రతను ప్రధాని మోదీ సాధిస్తున్నారు. ‘రాజకీయ సమైక్యత’ నుంచి ‘భావోద్వేగ సమైక్యత’కు మన దేశ ప్రయాణం ఇప్పుడు పూర్తయింది. ఆర్థిక స్వేచ్ఛతో రాజకీయ సమైక్యతకు అందరూ మద్దతు ఇస్తున్నారు. ఒక నిర్దిష్ట నియమ నిబంధనలతో, అందరినీ సమానంగా చూస్తూ, భయం లేదా బంధుప్రీతి లేకుండా ప్రధాని చర్యలు తీసుకుంటున్నారు. అట్టడుగు వర్గాలను ఆర్థికంగా దృఢపరుస్తూ, కుల, మత భేదాలను చెరిపేస్తూ, వారికి గౌరవం, సామాజిక న్యాయం అందించేలా నిబద్ధతతో కృషి చేస్తున్నారు. తన కార్యక్రమాల ద్వారా, ప్రధానమంత్రి మోదీ సర్దార్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వాస్తవానికి ఇది ఆధునిక భారతదేశ శిల్పికి నిజమైన నివాళి.

జి. కిషన్‌ రెడ్డి

(కేంద్ర హోంశాఖ సహాయమంత్రి)

(నేడు వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం)

Advertisement
Advertisement