ఎన్టీఆర్ స్ఫూర్తితో బీసీలకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2022-08-02T06:07:12+05:30 IST

బడుగు, బలహీన, అణగారిన గిరిజన, దళిత వర్గాలకు చెందిన వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో అపారమైన అవకాశాలు, సామాజిక భద్రత కల్పించి...

ఎన్టీఆర్ స్ఫూర్తితో  బీసీలకు న్యాయం చేయాలి

బడుగు, బలహీన, అణగారిన గిరిజన, దళిత వర్గాలకు చెందిన వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో అపారమైన అవకాశాలు, సామాజిక భద్రత కల్పించి వారి అభ్యున్నతికి దేశంలోనే కృషి చేసిన ఏకైక రాజకీయ నాయకుడు ఎన్‌టి రామారావు. కనీవినీ ఎరుగని రీతిలో రాజకీయాల్లో, పరిపాలనలో సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. ఆయన స్పూర్తితో టీడీపీలో చేరి, సమాజానికి సేవ చేసేందుకు ముందుకు వచ్చిన వెనుకబడిన వర్గాల యువత రెండు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎవ్వరూ ఊహించని రీతిలో బీసీల రిజర్వేషన్లను 25శాతం నుంచి 44 శాతానికి పెంచిన ఘనత కేవలం ఎన్టీఆర్‌కే దక్కుతుంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఎన్టీఆర్ లాగా బీసీలకు అవకాశాలు ఎవరూ కల్పించలేదంటే అతిశయోక్తి కాదు. నేడు అలాంటి దమ్ము, ధైర్యం, ముందుచూపు ఉన్న నిజాయితీపరుడైన నాయకుడు లేకపోవడంతో బీసీలు, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నది నగ్నసత్యం.


కేంద్ర ప్రభుత్వంలో సుమారు 75 రకాల మంత్రిత్వశాఖలు ఉన్నప్పటికీ, డెబ్బై కోట్లకు పైగా ఉన్నా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కనీసం ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం అణగారిన వర్గాలను అవమానపర్చడమే. 32 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉన్న దేశ బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.1200 కోట్లకు మించి కేటాయించకపోవడం చాలా బాధాకరం. దేశంలో సగ భాగానికి పైగా ఉన్న జనాభాను అభివృద్ధి చేయకుండా స్వర్ణభారత్‌ ఎట్లా సాధ్యం?


బీసీ గణన లేకపోవడం వల్ల దేశంలో ప్రస్తుతం అమలవుతున్న బీసీ రిజర్వేషన్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇతర సామాజికవర్గాల వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు మాత్రం 27 శాతం అత్తెసరు రిజర్వేషన్లు అమలు చేయడం. ఇందులో కూడా ఏ కులానికి లేని క్రిమీలేయర్‌ను బీసీలపై మాత్రమే విధించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. కేంద్రీయ విద్యాలయాలలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో క్రిమీలేయర్‌ మూలంగా బీసీలకు నేడు 13 శాతం మించి రిజర్వేషన్లు అమలు కావడం లేదని పార్లమెంటులో సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. దేశంలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కిందకు రాని వెనుకబడిన కులాల జనాభా భారీ సంఖ్యలో ఉంది. కానీ వారికి సంబంధించిన కచ్చితమైన వివరాలేవీ అందుబాటులో లేవు. ఫలితంగా అనేక మంది అనర్హులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో బీసీ రిజర్వేషన్‌ కింద ప్రయోజనాలు పొందుతున్నారు. దీనివల్ల బీసీల్లో అర్హులైన నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారు.


మన దేశంలో అన్ని వర్గాల వివరాలనూ జనాభా లెక్కల ద్వారా సేకరిస్తున్నారు. చివరకి గుర్రాలు, పులులు– లాంటి జంతువుల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ, బీసీ కులాల వారీగా లెక్కలు లేకపోవడం అన్యాయం. జనాభా లెక్కలు తేలితే విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు పెంచాలని, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ ముందుకు వస్తుందని ఆందోళనా? కులపరమైన సమాచారాన్ని సేకరించినట్లయితే దేశంలో ఆయా కులాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని చెబుతూ ఇన్నేండ్లూ కుల జనగణన చేయలేదా? కులాల వారీ లెక్కలు తీయడం వల్ల కులతత్వం పెరుగుతుందనడం ఊహాజనితమే. ఎందుకంటే మతాల వారీగా, ఇతర ఎస్సీ, ఎస్టీ కులాల వారీగా లెక్కలు తీయడం లేదా? ఏమైనా కులతత్వం పెరిగిందా? జనగణన పట్టికలో అదనంగా ఒక కాలం పెరుగుతుందే తప్ప, ఇతరత్రా నయాపైసా ఖర్చు కాదన్నది జగమెరిగిన సత్యం. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రొవిజన్స్, ఆర్టికల్స్ ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే ప్రభుత్వాలు తూతూ మంత్రంగా మాటల్లో చెప్పి, చేతల్లో చూపించకపోవడం దేనికి సంకేతమో బీసీ నేతలు అందరూ కలిసి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ. వాటికీ సరియైన రాజ్యాంగబద్ధమైన అధికారాలు లేకపోవడంతో నామ్‌కే వాస్తేగా మారిపోతున్నాయి. సుమారు తొమ్మిది దశాబ్దాల క్రితం 1931లో తీసిన జనాభా లెక్కలపై ఇప్పటికీ ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం బీసీ కులాలను మోసం చేయడమే. కేంద్రం నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్ 1961లో, అలాగే 1978లో నియమించిన మండల్ కమిషన్ కూడా బీసీ జనాభా లెక్కలు తీయాలని సిఫార్సు చేసినప్పటికీ వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ‘కులగణన చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, అది ఆచరణలో సాధ్యం కాద’ని కేంద్రం వితండవాదం చేస్తున్నది. 2011లో జరిపిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో 46 లక్షల కులాలు/ఉపకులాల పేర్లు ప్రజలు చెప్పారని గతంలో సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొన్నది.


ప్రస్తుతం కేంద్రం దగ్గర ఉన్న ఓబీసీ జాబితాలో 2,642 కులాలున్నాయి. రాష్ర్టాల జాబితాలో 2,892 బీసీ కులాలున్నాయి. 2011లో జరిగిన జనగణనలో ఎస్సీలు 1,234 కులాలు, ఎస్టీలు 698 కులాలు ఉన్నట్లు తేల్చారు. వాస్తవంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకులాలు అన్ని కులాలను కలిపినా ఆరు వేలకు మించవు. మరి అలాంటప్పుడు పొంతనలేని విధంగా 46 లక్షల కులాలు/ ఉపకులాలున్నాయనే వితండవాదన చేయటం ఏమాత్రం మంచిది కాదు.


కేవలం బీసీల ఓట్లపై ఉన్న శ్రద్ధ. వాళ్ళ బతుకులపైన లేకపోవడం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. గతంలో బీసీల సంక్షేమం కోసం అన్నివిధాలా అభివృద్ధే ధ్యేయంగా రిజర్వేషన్లు కల్పించిన ఎన్‌టి రామారావును స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని అన్ని పార్టీలూ బీసీ కులాలకు న్యాయం చేయాలి, అలాగే బీసీ కులాల నాయకులు కూడా ఎవరికీవారే యమునా తీరే అన్నట్లుగా కాకుండా, ఐక్యంగా ఉద్యమించాలి.

డాక్టర్ బి. కేశవులు

Updated Date - 2022-08-02T06:07:12+05:30 IST