Abn logo
Apr 9 2020 @ 00:23AM

వైద్య రంగంలో మేకిన్ ఇండియా స్ఫూర్తి

ప్రస్తుత కరోనా సంక్షోభం సత్వరమే తీసుకోవాల్సిన నిర్ణయాత్మక, వ్యవస్థాపక మార్పులను మరొకసారి గుర్తుచేస్తున్నది. పాలకులు సరైన కార్యాచరణను అవలంబించి సంస్కరణలకు పూనుకుంటే కొవిడ్‌ -19తో ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవచ్చు. ఈ సమయంలో సాంకేతికతను ఉపయోగించుకొని వైద్య పరికరాల తయారీ, ఉత్పాదకత మీద శ్రద్ధ వహించాలి. 


భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడని పరిస్థితులను నేడు చూస్తున్నాం. ఎమర్జెన్సీ సమయంలో కానీ, అటు పొరుగు దేశాలతో యుద్ధం జరిగే సమయాల్లో కానీ రైళ్లు, రోడ్డు, రవాణా వ్యవస్థను మూసివేయలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీనికి, వైరస్ విస్తరణను నివారించడం ఒక కారణం కాగా మరో కారణం– మన దేశం వైద్య వ్యవస్థ విషయంలో అంత బలోపేతంగా లేకపోవడం అని కూడా చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య నివేదిక ప్రకారం ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, అమెరికా ఆరోగ్య పరిరక్షణ విషయంలో వరుసగా ఒకటి, రెండు, ఏడు, ముప్పై ఏడు స్థానాల్లో నిలిచాయి. ఇటువంటి దేశాలే కరోనాను తట్టుకోలేక ఆరోగ్య వ్యవస్థ విషయంలో ఛిన్నాభిన్నమయ్యాయి. భారతదేశం ఈ జాబితాలో 112వ స్థానంలో ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా అందుబాటులో ఉన్న వైద్య వ్యవస్థపై పునరాలోచించుకోవాలి. ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించిన అధ్యయనం ప్రకారం స్పెయిన్, ఇటలీలో ప్రతి వెయ్యి మంది పౌరులకు 4.1 మంది డాక్టర్లు, అమెరికాలో 2.6 మంది డాక్టర్లు వుండగా మన దేశంలో ఆ సంఖ్య కేవలం 0.8గా ఉంది. క్యూబాలో ప్రతి వెయ్యి మంది పౌరులకు 8.2 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు.


కాబట్టి వారు పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నారు. అంతేకాదు ఇప్పుడు క్యూబా తమ డాక్టర్లను ఇతర దేశాలలో సేవలను అందించడానికి పంపుతోంది. ఈ పరిస్థితులలో మన దేశం కూడా వైద్య సదుపాయాలు, వైద్య విద్యపై దృష్టి సారించి ఆర్థిక వనరులను కేటాయించాలి. వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. మరిన్ని వైద్య కళాశాలలను నెలకొల్పాలి. అలాగే మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు అయ్యే ఖర్చును కూడా తగ్గించాలి. దీని వల్ల ప్రజలు మెరుగైన వైద్యం సులభంగా, చౌకగా అందుకోగలుగుతారు. ఇదే సమయంలో వైద్య రంగానికి కావాల్సిన మౌలిక వసతుల గురించి కూడా విశ్లేషించుకోవాలి. మేకిన్ ఇండియా స్ఫూర్తిని వైద్య రంగంలో అమలు చేయాలి. కరోనా బాధితులకు సేవలందించడానికి డాక్టర్ల వద్ద సరైన వ్యక్తిగత రక్షణ, పరికరాలు, మాస్క్‌లు లేకపోవడంతో అభద్రతకు గురవుతున్నారు. తగినన్ని బెడ్‌లు అందుబాటులో లేకపోవడంతో, వైద్య పరికరాల కొరతతోను, నాసిరకపు రక్షణ పరికరాలతోనే వారు బిక్కు బిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నారు.


ఈ విపత్కర తరుణం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నది. ఈ సమయంలో సాంకేతికతను ఉపయోగించుకొని వైద్య పరికరాల తయారీ, నైపుణ్యత, ఉత్పాదకత మీద శ్రద్ధ వహించాలి. దురదృష్టవశాత్తు మన దేశం తక్కువ సాంకేతిక అవసరాలతో కూడిన వ్యక్తిగత రక్షణ వైద్య ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వైద్య పరికరాలు 2017 నుంచి ప్రతి సంవత్సరం పెరుగుతూ రెండంకెల వృద్ధిని సూచిస్తూ 13శాతానికి చేరింది. 2019 సంవత్సరానికి మొ త్తంగా వైద్య పరికరాల దిగుమతి మరింత పెరిగి 24శాతానికి చేరుకొని రూ.38,837.28 కోట్లకు చేరింది. వైద్య ఆరోగ్య ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలి. హిందుస్థాన్ లేటెక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎల్‌ఎల్‌) ఏకీకృత ఆధిపత్యం ప్రస్తుత వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసిందో గ్రహించాలి. ఇది భావి తరాలకు ఒక గుణపాఠంగా పేర్కొనవచ్చు. రూ. 75వేల ఖర్చుతో కూడిన కంటి ఆపరేషన్‌ను కేవలం రూ.750కే చేయగలుగుతున్న అరవింద్ కంటి ఆసుపత్రిని ఒక ఉదాహరణగా తీసుకోవాలి. అరవింద్‌ హాస్పిటల్‌ ఆరో ల్యాబ్స్‌ పేరిట కేవలం రూ.80లతో లెన్స్‌ను తయారు చేస్తుంది. ఇది ప్రపంచ మార్కెట్‌ ధరలో 10 శాతమే.


ప్రస్తుతం ఈ లెన్్స్‌లను విదేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. అటువంటి పారిశ్రామిక వేత్తలను మరింతగా ప్రోత్సహించి సహాయ సహకారాలు కల్పించాలి. పరిశోధనలకు ఆర్థిక తోడ్పాటునిస్తే వైద్య పరికరాలు తక్కువ ధరకు అందరికీ అందుబాటులోకి వస్తాయి. భారతదేశంలో పెద్ద పెద్ద సంస్కరణలు ఎక్కువ సార్లు సంక్షోభంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగాయి. 1970 సంవత్సరంలో వచ్చిన హరిత విప్లవం, శ్వేత విప్లవం, 1991లో వచ్చిన ఆర్థిక సరళీకరణ సందర్భాలు దీనికి ఉదాహరణలు. ప్రస్తుత కరోనా సంక్షోభంకూడా సత్వరమే తీసుకోవాల్సిన నిర్ణయాత్మక, వ్యవస్థాపక మార్పులను మరొకసారి గుర్తుచేస్తుంది. పాలకులు సరైన కార్యాచరణను అవలంబించి సంస్కరణలకు పూనుకుంటేనే ఈ కొవిడ్‌ -19తో ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవచ్చు. ఓవర్సీస్ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రకారం భారతదేశం కొవిడ్‌ -19 వల్ల కఠినమైన నియమ నిబంధనలను పౌరులపై విధించింది. కానీ దీన్ని ఎదుర్కొవడానికి ఖర్చు చేయాల్సినంత చేయలేదనే చెప్పాలి. పలు సంపన్న దేశాలు వాటి జీడీపీలో 10 శాతాన్ని ఖర్చు పెడుతుండగా, మన దేశం కేవలం 0.8 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నది. పశ్చిమ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తక్షణమే స్పందించాయి. వారు క్రెడిట్‌ ఏజెన్సీల మీద ఆధారపడకుండా ఆర్థిక ఉద్దీపనలకు అవకాశాలు అన్వేషిస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులను గమనిస్తున్నప్పటికీ మన ప్రభుత్వం సరైన చర్యల పట్ల ఆసక్తి చూపించడం లేదు. పెద్ద వ్యాపార వేత్తలకు పన్నులలో రాయితీలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు చిన్న, మధ్య తరగతి వ్యాపార వేత్తలకు పెద్దగా ప్రోత్సాహం కల్పించడం లేదు. కానీ చిన్న వ్యాపార వేత్తలే చాలా మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభంలో అయినా సంస్కరణలపై దృష్టి సారించాలి. లేకుంటే ద్రవ్యోల్బణం బాగా పెరిగి నిరుద్యోగ సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఈ కొన్ని వారాల సంక్షోభంలో అమెరికాలో 60 లక్షల మంది నిరుద్యోగులు అయినట్లు తెలుస్తుంది. భారతదేశంలో ఈ పరిస్థితి మరింత విషమించవచ్చు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ‘ఇండియన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌ బిల్లు, 2020’ని పార్లమెంట్‌లో ప్రతిపాదించాను. ఈ బిల్లు ద్వారా 90 రోజుల వరకు 70 శాతం రోజువారీ వేతనాన్ని నిరుద్యోగికి చెల్లించేందుకు వీలు కలుగుతుంది. అదేవిధంగా మైనర్‌ పిల్లల సంరక్షణ చూసుకుంటున్న వితంతు మహిళలకు అయితే ఈ కాలపరిమితి 120 రోజుల వరకు వర్తిస్తుంది. అదేవిధంగా ఉద్యోగి, వారి తక్షణ కుటుంబ సభ్యులకు రూ. లక్ష ఆరోగ్య బీమా సదుపాయం, 50 శాతం ప్రాథమిక వైద్య ఖర్చులను 120 రోజుల వరకు ఇస్తారు. ఉన్న వసతులకు ఇవి అదనంగా వర్తిస్తాయి. స్థితిగతులతో సంబంధం లేకుండా ఉద్యోగులు అందరికీ ఈ అన్ని సదుపాయాలు కల్పించబడతాయి. ఈ విధానాన్ని ఇప్పటికే చాలా సంపన్న దేశాలు అవలంబిస్తున్నాయి. ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకొని ఆరోగ్య రక్షణ కోసం పోరాడుతున్న సిబ్బందికి సహకారం అందించవల్సిన అవసరాన్ని గుర్తించాలి. వైద్య వ్యవస్థ మరింత బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయని ఆశిస్తున్నాను. మన వంతు కర్తవ్యంగా లాక్‌డౌన్‌ను నిక్కచ్చిగా పాటించి కరోనాను తరిమికొడదాం.

లావు శ్రీకృష్ణదేవరాయలు

ఎం.పి., నరసరావుపేట

Advertisement
Advertisement
Advertisement