గురు తేఘ్ స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-04-23T06:16:43+05:30 IST

గురువారం నాడు చీకటిపడిన తరువాత భారతప్రధాని నరేంద్రమోదీ ఒక ప్రత్యేకమైన, ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు తేఘ్ బహదూర్ సింగ్ 401వ జయంతి సభ అది. జరిగిన స్థలం ఢిల్లీలోని ఎర్రకోట. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు తేఘ్ బహదూర్ శిరచ్ఛేదానికి ఆదేశించిన చోటు అదే...

గురు తేఘ్ స్ఫూర్తి

గురువారం నాడు చీకటిపడిన తరువాత భారతప్రధాని నరేంద్రమోదీ ఒక ప్రత్యేకమైన, ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు తేఘ్ బహదూర్ సింగ్ 401వ జయంతి సభ అది. జరిగిన స్థలం ఢిల్లీలోని ఎర్రకోట. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు తేఘ్ బహదూర్ శిరచ్ఛేదానికి ఆదేశించిన చోటు అదే. ఆగస్టు 15నాడు జాతిని ఉద్దేశించి సందేశం ఇవ్వడానికి తప్ప సాధారణంగా ప్రధానులు ఎర్రకోటను వేదికగా చేసుకోరు. పైగా, పొద్దుపోయిన తరువాత అక్కడ అధికార కార్యక్రమాలు జరగవు కూడా. కానీ, గురు తేఘ్ బహదూర్‌ను స్మరించుకోవడానికి ప్రత్యేక స్థలకాలాలను ప్రధాని ఎంచుకున్నారు. 1621, ఏప్రిల్ 21నాడు జన్మించిన తేఘ్ బహదూర్‌కు 400వ జయంతిని సంరంభంగా జరపగలిగితే బాగుండేది కానీ, బహుశా గత ఏడాది కరోనా కల్లోలం అడ్డుపడి ఉంటుంది. ఒక ఏడాది ఆలస్యంగా అయినా, సిక్కు గురుపరంపరలో ఒక ముఖ్యుడిని భారత ప్రధాని ఆధ్వర్యంలో స్మరించుకోవడం విశేషం.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఏదైనా చేశారంటే, దాని వెనుక ఏదో ప్రత్యేకమైన దృష్టి ఉంటుందని అనుకుంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా యథాలాపంగా జరిగింది కాదేమో అన్న సందేహం కలగడం సహజం. రైతు చట్టాలను విరమించుకుంటున్నట్టు చేసిన ప్రకటనకు ప్రధాని గురునానక్ జయంతిని సందర్భంగా ఎంచుకున్నారు. పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అట్లా చేశారని అంతా అనుకున్నారు, చివరకు అది పెద్దగా రాజకీయ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పట్లో ఏ ఎన్నికలూ లేకపోయినా, సిక్కు మతస్థులను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉండడం విశేషం. సిక్కు గురువు ఒక సందర్భాన్ని మాత్రమే కల్పించారని, దేశంలో ఇప్పుడు కమ్ముకుని ఉన్న వాతావరణంలో భాగంగానే ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొనడాన్ని చూడాలని పరిశీలకులు అంటున్నారు. మొఘలులను, ఔరంగజేబును మరొకసారి బోనులో నిలబెట్టడమే మోదీ, ఆయన వెనుక ఉన్న వ్యూహకర్తల ఉద్దేశ్యమని వారి అభిప్రాయం.


తేఘ్ బహదూర్ జీవితం, మరణమూ కూడా ఉన్నతమైనవి. ఇస్లాంలోకి మతపరివర్తన చెందాలని మొఘల్ చక్రవర్తి చిత్రహింసలకు గురిచేసి, చివరకు వధింపజేశాడని అనేక కథనాలు చెబుతున్నాయి. అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటన్నదానిపై రకరకాల వాదనలున్నాయి కానీ, తేఘ్ బలిదానం మాత్రం సత్యం. ఎర్రకోటకు సమీపంలోని చాందినీచౌక్‌లో ఆయన తలతెగిపడిన చోట ఇప్పుడు గురుద్వారా శిస్ గంజ్ సాహిబ్. తేఘ్ బహదూర్ వ్యక్తిత్వంలో ఇంకా అనేక విశిష్ట అంశాలున్నాయి కానీ, మతస్వేచ్ఛకు ఆయన ప్రతీకగా మారారు. మత విశ్వాసాన్ని మరొకరిపై బలవంతంగా రుద్దరాదని, అట్లాగే ఏదైనా ధర్మంలో విశ్వాసమున్నవారు బలవంతం మీద మార్చుకోరాదని ఆయన నమ్మారు, ప్రచారం చేశారు. తాను ఎవరినీ మతమార్పిడి కోసం ప్రోత్సహించలేదు. హింసను ఆచరించలేదు. దేవుడు సర్వాంతర్యామి అని, ప్రతి జీవిత సన్నివేశాన్ని శాంతితో సంపన్నం చేసుకోవాలని ఆయన బోధించారు.


మనం చరిత్రపుస్తకాల్లో ఔరంగజేబుకు ప్రాధాన్యం ఇచ్చి, తేఘ్ బహదూర్‌ను విస్మరించామని కొందరు బాధపడుతుంటారు. శ్రీశ్రీ చెప్పినట్టు, నరహంతలు ధరాధిపతులై చరిత్రలో ప్రసిద్ధి కెక్కారు. వారి చుట్టూ ఎన్నో చారిత్రక పరిణామాలు ఉండడం వల్ల, వారి పేర్లు అనివార్యంగా తరచు తారసపడతాయి. తేఘ్ బహదూర్ వంటివారిని విస్మరించడం మాత్రం సరి కాదు. మతస్వేచ్ఛ కోసం నిలబడడం అన్నది ఇప్పటికీ ఎంతో ప్రాసంగికత ఉన్న విలువ. మొఘల్ పాలనను, ఔరంగజేబును నిందించడానికి కాకుండా, తేఘ్ బహదూర్ నిలబడిన విలువలకు పునరంకితం కావడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. ఔరంగజేబును ఒక అభియోగం మీద నిందిస్తున్నప్పుడు, తాము కూడా అటువంటి వైఖరులను ఆశ్రయించకుండా, ప్రోత్సహించకుండా పాలకులు వ్యవహరించాలి. మతోన్మాదం భారత ప్రగతిని నిరోధించలేదని ప్రధానమంత్రి భావించడం హర్షణీయం. ఏ మతోన్మాదానికీ ప్రజల పురోగతిని ఎల్లకాలం అడ్డుకునే శక్తి లేదు. మత విద్వేషం, సాటిపౌరులపై పెరుగుతున్న శత్రుభావం తేఘ్ బహదూర్ వంటివారు భారతదేశంలో స్థాపించిన విలువలను అణగార్చివేస్తున్నాయి. ఇస్లామ్ నుంచి ప్రభావాలను స్వీకరించి రూపొందిన సిక్కుధర్మం, తనపై ఎటునుంచి దాడులు జరిగినా, తనలో మతోన్మాదం పెంపొందకుండా నిగ్రహించుకున్నది. 


తేఘ్ బహదూర్ జయంతి మీద ఉన్న పట్టింపు భారత ప్రధానికి జలియన్ వాలాబాగ్ ఊచకోత శతవార్షిక సందర్భానికి ఎందుకు లేకపోయింది అన్న ప్రశ్న రావడం సహజం. ఆ సమయంలో ఆయన జమ్మూకశ్మీర్ లోని కథువాలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అప్పుడు పంజాబ్ లో  కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పాలన సాగుతోంది. రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన స్మారక కార్యక్రమాలకు కేంద్రం సహాయం అందించకపోగా, పోటీగా తానూ ఒక కార్యక్రమాన్ని జలియన్ వాలాబాగ్ లో నిర్వహించింది. పోనీ, దానికైనా ప్రధాని వచ్చారా అంటే అదీ లేదు. ఉపరాష్ట్రపతి మాత్రమే అందులో పాల్గొన్నారు. రాహుల్ గాంధీని రాష్ట్రప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించినందుకుగాను, అమరీందర్ సింగ్ గాంధీకుటుంబ సేవలో తరిస్తున్నాడని మోదీ విమర్శించారు కూడా. రాజకీయ రగడే తప్ప, ఆ సందర్భంలో ఉత్తేజపడవలసింది ప్రధానికి కనిపించకపోవడం ఆశ్చర్యకరం. దేశాన్ని సర్వనాశనం చేసిన బ్రిటిష్ సామ్రాజ్యవాదం కానీ, వర్తమానంలోనూ దేశాన్ని కుంగదీస్తున్న ఇతర ఆధిపత్యాలు కానీ శత్రువులు కాకుండాపోయి, అంతరించిపోయిన మొఘల్ పాలన మీదనే కత్తులు దూయడం ఎందుకో అర్థం కాదు.

Updated Date - 2022-04-23T06:16:43+05:30 IST