వీధి బాలలకు జీవిత పాఠాలు

ABN , First Publish Date - 2020-09-28T05:42:41+05:30 IST

ఢిల్లీ నగరం. రద్దీగా ఉండే ఓ ప్రాంతం. సిగ్నల్స్‌ దగ్గర చిన్నారులు బిచ్చమెత్తుకొంటున్నారు. కాస్త సమయం దొరికితే పక్కకు వెళ్లి పాత టైర్లతో ఆడుకొంటున్నారు. ఆ దృశ్యం చూసి ఆమె చలించిపోయింది. తిండికి కరువై... చదువుకు దూరమై... ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం ఇలా మొగ్గలోనే వాడిపోతే ఎలా? ఈ ఆలోచనతోనే వీధి బాలల కోసం ‘లక్ష్యం’ పేరుతో ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి... వారికి ప్రాథమిక విద్యే కాదు... జీవిత పాఠాలనూ నేర్పిస్తున్న రాశీ ఆనంద్‌ ప్రయాణం ఇది...

వీధి బాలలకు జీవిత పాఠాలు

ఢిల్లీ నగరం. రద్దీగా ఉండే ఓ ప్రాంతం. సిగ్నల్స్‌ దగ్గర చిన్నారులు బిచ్చమెత్తుకొంటున్నారు. కాస్త సమయం దొరికితే పక్కకు వెళ్లి పాత టైర్లతో ఆడుకొంటున్నారు. ఆ దృశ్యం చూసి ఆమె చలించిపోయింది. తిండికి కరువై... చదువుకు దూరమై... ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం ఇలా మొగ్గలోనే వాడిపోతే ఎలా? ఈ ఆలోచనతోనే వీధి బాలల కోసం ‘లక్ష్యం’ పేరుతో ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి... వారికి ప్రాథమిక విద్యే కాదు... జీవిత పాఠాలనూ నేర్పిస్తున్న రాశీ ఆనంద్‌ ప్రయాణం ఇది... 



విద్య, విజ్ఞానం... రేపటి తరానికి బంగారు భవిష్యత్తును అందించాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ప్రాథమిక విద్యను అందిస్తూనే... నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వాలి. మానవ విలువలు నేర్పించాలి. అప్పుడే వారు జీవితంలో స్థిరపడగలుగుతారు. మనమైతే సరే... మరి వీధిబాలల పరిస్థితి ఏమిటి? ఇలాంటి చదువు ఎవరు చెబుతారు? ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు రాశీ ఆనంద్‌. ఇందులో ఎన్నో వ్యయప్రయాసలు, ఇబ్బందులు ఉంటాయి. వద్దని వెనక్కి లాగినవారూ ఉన్నారు. కానీ అవేవీ పట్టించుకోకుండా ఆమె అడుగు ముందుకు వేశారు. 2012లో స్వచ్ఛంద సేవా సంస్థ ‘లక్ష్యం’ను నెలకొల్పారు. దాని ద్వారా దేశంలోని వీధి బాలలు, బస్తీలు, అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పిస్తున్నారు. 


పథం మార్చిన దృశ్యం... 

ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వెళ్లిన రాశి జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన ఢిల్లీలో జరిగింది. అదే ఆమెను ‘లక్ష్యం’ వైపు నడిపించింది. ‘‘కాలేజీకి వెళుతున్నప్పుడు ఢిల్లీ రహదారులపై సిగ్నల్స్‌ వద్ద చిన్నారులు అడుక్కొంటూ కనిపించారు. సిగ్నల్‌ ఇవ్వగానే పక్కకు వెళ్లి పాడైపోయిన టైర్లతో కొందరు... చెత్తకుప్పల్లో కొందరు ఆడుకొంటున్నారు. అది చూసి షాకయ్యాను. ఆటపాటలతో హాయిగా, ఆనందంగా సాగిపోవాల్సిన బాల్యం రోడ్లపై బతుకు పోరాటం చేయడం నన్ను కలవరపరిచింది. బాధాకరం ఏమిటంటే... ఆ పిల్లలు ఆడుకోవడానికి కనీసం ఓ పాత బొమ్మ కూడా లేకపోవడం! మన ఇళ్లల్లో పిల్లలకు పాతపడిపోయిన బొమ్మలు తీసేసి కొత్తవి కొంటుంటాం. మరి వీరు? ఏదైనా చేయాలనిపించింది. వెంటనే నాకు తెలిసిన వారందరి ఇళ్లలో పక్కన పడేసిన బొమ్మలు సేకరించి, వీధిబాలలకు ఇచ్చాను. కానీ ఇది కాదు పరిష్కారం. ఆ పిల్లలు వాళ్ల కాళ్లపై వాళ్లే నిలబడాలి. దానికి ఎవరో ఒకరు పూనుకోవాలి. ఆ ఒకరు నేనే ఎందుకు కాకూడదని ‘లక్ష్యం’ ప్రారంభించాను’’ అంటూ చెప్పుకొచ్చారు రాశి. 


అడుగడుగునా సవాళ్లే... 

చదువు తరువాత కొంతకాలం ఢిల్లీలోని ఓ స్కూల్లో పార్ట్‌టైమ్‌ టీచర్‌గా పని చేశారు రాశి. మొదట ఆ స్కూల్లో క్యాంపెయిన్‌ నిర్వహించారు. ఆ తరువాత బస్తీలకూ వెళ్లారు. కానీ ఆమె చెప్పేదెవరూ వినలేదు. ‘‘నా ఆలోచన అందరికీ చెప్పాను. బస్తీవాసులెవరూ నన్ను పట్టించుకోలేదు. నేను చెప్పింది అధికారులు చెవికి ఎక్కించుకోలేదు. ఒకసారి ఢిల్లీలోని ఓ మురికివాడలో తల్లులను అభ్యర్థించాను... మీ పిల్లలను పంపిస్తే ఉచితంగా చదువు చెప్పి, ప్రయోజకులను చేస్తాన’ని. దానికి వారు ‘మా పిల్లలు బిచ్చమెత్తో, కప్పులు కడిగో కాస్తో కూస్తో సంపాదిస్తున్నారు. మీరు వాళ్లకు పాఠాలు చెప్పడం మొదలుపెడితే ఆ వచ్చేది పోతుంది. అయినా సరే మీ దగ్గరికి పంపించాలంటే గంటకు 100 రూపాయలు మా కుటుంబానికి ఇవ్వాలి’ అంటూ కండిషన్‌ పెట్టారు’’ అంటారు రాశి. ఒక సదుద్దేశంతో మొదలెట్టిన ఆమె ‘లక్ష్యా’నికి ఎన్నో సవాళ్లు. ‘‘అడ్డంకులు అధిగమించి కొంతమంది తల్లులను ఒప్పించగలిగాను. నిదానంగా మరికొన్ని బస్తీలకు సేవలు విస్తరించా. కాగితాలు ఏరుకొనే పిల్లల తల్లితండ్రులను కలిశాను. వాళ్లనూ ఒప్పించాను’’ అంటూ రాశి తన అనుభవాలు పంచుకున్నారు.


తల్లులకూ శిక్షణ... 

చిన్నారులే కాకుండా... వారి తల్లితండ్రులకు కూడా రాశి చేతి వృత్తుల్లో తర్ఫీదునిస్తున్నారు. తద్వారా వారు తమ పిల్లలను పనికి పంపించాల్సిన అవసరం ఉండదనేది ఆమె ఆలోచన. దాని కోసం ‘లక్ష్యం’ వారికి పని కూడా కల్పిస్తోంది. దానికి వేతనం చెల్లిస్తోంది.  




కరోనా సమయంలోనూ... 

జనజీవితాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా వైరస్‌, లాక్‌డౌన్ల ప్రభావం ‘లక్ష్యం’ లాంటి ఎన్‌జీఓలపైనా పడింది. ఆర్థికంగా కోలుకోని దెబ్బ తీసింది. అయినా రాశీ ఆనంద్‌, ఆమె బృందం వెనకడుగు వేయలేదు. ‘‘స్పాన్సర్‌షి్‌పకు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రాలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాం. మా లక్ష్యమల్లా ఒక్కటే... లాక్‌డౌన్‌ సమయంలో నిధుల కొరతతో మా సంస్థ మూతపడకూడదని! దాని కోసమే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. సంస్థలుగా సాయం అందలేదు కానీ... వ్యక్తిగతంగా ఎవరికి వారు తోచిన సాయం అందించారు’’ అంటూ ముగించారు రాశీ ఆనంద్‌.


17 రాష్ట్రాల్లో సేవలు... 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ నుంచి పనిచేస్తున్న ‘లక్ష్యం’... ప్రస్తుతం 17 రాష్ట్రాల్లోని మురికివాడల్లో సేవలు అందిస్తోంది. ‘‘పిల్లలు రాగానే ముందు వారికి ప్రాథమిక విద్య నేర్పిస్తాం. తరువాత వయసుకు తగిన తరగతిలోకి ప్రమోట్‌ చేస్తాం. ఆసక్తి ఉన్న పిల్లలకు వృత్తివిద్యలో శిక్షణ కూడా ఇస్తాం. దీనివల్ల చదువు అయిపోగానే వారికి ఉపాధి అవకాశాలు వస్తాయి. పైచదువులు చదవాలనుకొనే విద్యార్థులను ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నాం. తరగతి ఏదైనా నైపుణ్య శిక్షణ కచ్చితంగా ఉంటుంది’’ అంటారు రాశి. విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, మంచి నడవడి, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటివి కూడా బోధిస్తున్నారు. 


Updated Date - 2020-09-28T05:42:41+05:30 IST