ఆడవాళ్లదెప్పుడూ ఒంటరి పోరాటమే

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం ఇతివృత్తంగా సంధించిన బాణం ‘రాళ్లలో నీరు’. హెన్రిక్‌ ఇబ్సన్‌ ‘డాల్స్‌ హౌస్‌’ నాటకం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు ప్రొఫెసర్‌ ఇంద్రగంటి కిరణ్మయి. ఇందుకు గాను ఇటలీ చిత్రోత్సవం ‘మిలాన్‌గోల్డ్‌ అవార్డ్స్‌’లో సిల్వర్‌ అవార్డ్‌ దక్కించుకున్నారామె...

ఆడవాళ్లదెప్పుడూ ఒంటరి పోరాటమే

స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం ఇతివృత్తంగా సంధించిన బాణం ‘రాళ్లలో నీరు’. హెన్రిక్‌ ఇబ్సన్‌ ‘డాల్స్‌ హౌస్‌’ నాటకం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు ప్రొఫెసర్‌ ఇంద్రగంటి కిరణ్మయి. ఇందుకు గాను ఇటలీ చిత్రోత్సవం ‘మిలాన్‌గోల్డ్‌ అవార్డ్స్‌’లో సిల్వర్‌ అవార్డ్‌ దక్కించుకున్నారామె. సామాజిక అంశాలనే కథాంశాలుగా ఎంచుకొంటూ... ఫిలిమ్‌ మేకర్‌గా ప్రత్యేకతను చాటుతున్న కిరణ్మయి... ఆ విశేషాలను ‘నవ్య’తో పంచుకున్నారు...


‘డాల్స్‌ హౌస్‌’... ఈ నాటకం వచ్చి వందేళ్లు దాటింది. అయినా, ఆ కథ సమకాలీనతకు అద్దం పడుతుంది. గొప్ప సందేశం ఉంటుది. మానవత్వానికి, మనిషి జీవితానికి సంబంధించిన కథ అది. అదే నన్ను బలంగా ఆకర్షించింది. ఈ నాటకం ఆధారంగా తెలుగులో కొన్ని రచనలు వచ్చినా, మూల కథలో నేను వెతుక్కున్న కొత్తదనాన్ని ఎలిమెంట్‌గా తీసుకొని ‘రాళ్లలో నీరు’ పేరుతో సినిమాగా మలిచాను. ఇదే నా తొలి చలనచిత్రం. సినిమా ఆద్యంతం సున్నితమైన భావోద్వేగాలతో, ఒకవిధమైన భావుకతతో సాగుతుంది. మహిళలకు ఉదాత్తతను ఆపాదించడం వంటివేవీ ఈ సినిమాలో అస్సలు కనిపించవు. 


తానేంటో తనకు తెలియదు... 

మూల కథలోని ప్రధాన పాత్ర నోరా... ఈ సినిమాలో నీలగా పరిచయమవుతుంది. అందులో అమ్మాయికి తానేంటో తనకు తెలియకపోవడమే ఈ కథకు బలం. అలాంటి స్థితిలో ‘అసలు నేనెవరు... నా అస్తిత్వం ఏమిటి’’ వంటి ప్రశ్నలు వ్యక్తీకరించడంలో ఆమె ఒక అడుగు ముందుకేస్తుంది. ‘భర్తకు తెలియకుండా భార్య అప్పు చేయడంతో, వాళ్ల జీవితంలో చోటుచేసుకున్న మార్పులు’ ఇతివృత్తంగా సినిమా నడుస్తుంది. మన నేపథ్యానికి సరిపోయేలా పరోక్షంగా ‘కాల్‌మనీ’ కేసు ఉదంతాన్ని తీసుకున్నాం. మా సినిమా ఇప్పటి వరకు అమెరికా, నెదర్లాండ్స్‌, గ్రీస్‌ దేశాల చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఇటలీకి చెందిన ‘మిలాన్‌గోల్డ్‌ అవార్డు’ల పోటీలో ‘సిల్వర్‌ అవార్డ్‌’ అందుకుంది. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో వచ్చే ఆదరణను బట్టి తరువాత ఓటీటీలో విడుదల చేద్దామనుకుంటున్నాం.  


ఒక పెద్ద యజ్ఞం... 

మాదొక చిన్న టీమ్‌. సినిమా అంతా కాకినాడలో తీశాం. షూటింగ్‌లో లైట్లు ఎక్కువ వాడలేదు. చాలా సన్నివేశాలకు డే లైట్‌నే ఆశ్రయించాం. దాంతో కొన్ని షాట్స్‌ తీయడం కోసం కాలంతో పరిగెత్తాల్సి వచ్చింది. ట్రాక్‌ అండ్‌ ట్రాలీ షాట్స్‌ తీయడమంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రం అంతా ఐదు ప్రధాన పాత్రలతో నడుస్తుంది. అందులో సీనియర్‌ నటుడు షఫీతో పని చేయడం మంచి అనుభవం. థియేటర్‌ ఆర్టిస్ట్‌ అల్తాఫ్‌, బిందు, మంజూష... ఎవరికి వాళ్లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూశాను. చాలా సినిమాల గురించి రాశాను. అయితే, సినిమా తీయడం ఒక పెద్ద యజ్ఞం అని అర్థమైంది. నా చిత్రం చిన్నదే. కానీ ఆ ప్రయాణం మాత్రం చాలా విలువైంది. మొదట్లో ప్రొడ్యూస్‌ చేసేందుకు ముందుకొచ్చిన ఒకరు ‘అదిగో.. ఇదిగో’ అంటూ అడుగు ముందుకేయ లేదు. దాంతో కాలయాపన చేయడం ఇష్టంలేక బంధుమిత్రుల నుంచి ఫండ్‌ రైజ్‌ చేసి, సినిమా తీశాం. అలా ‘రాళ్లలో నీరు’ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వంతో పాటూ నిర్మాతగానూ మారాను. 


అలాంటివి పట్టించుకోను... 

సినిమా చేస్తున్న సమయంలో ‘ఈమెకు ఏం వచ్చు...’ అంటూ సన్నిహితులే అవహేళనగా మాట్లాడారు. సహజంగానే మహిళలకు తమను తాము ఫ్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. సినిమా పరిశ్రమలో అయితే అది మరీ ఎక్కువ. మహిళల పనితనాన్ని పరీక్షించాలనే కోరిక మగవాళ్లకే కాదు, సాటి ఆడవాళ్లకూ ఉంటుంది. ఈ క్రమంలో నిరుత్సాహపరిచేవారు చాలామంది తారసపడతారు. అయితే, అలాంటి వాళ్లను పట్టించుకోకూడదు. అవే ఆలోచిస్తూ కూర్చుంటే మనలోని సృజనకు తగిన రూపం ఇవ్వలేం. కనుక అనుక్షణం జాగ్రత్తగా ఉంటూ, ఉపాయంగా, యుక్తితో ఆడవాళ్లు వ్యవహరించాల్సిందే. ఇది అన్నీరంగాలకూ వర్తిస్తుంది. సినిమా రంగంలో విజయం ఒక్కసారి వరిస్తే చాలు... ఆడైనా, మగైనా అవకాశాలు వరస కడతాయి. కానీ మనమేమిటో నిరూపించుకోవడానికి ఆ ఒక్క అవకాశం లభించడం చాలా కష్టం. నిజానికి ఆడవాళ్లదెప్పుడూ ఒంటరి పోరాటమే. 


ఆ బాధ్యత మాకేనా...  

ఫిమేల్‌ ఫిలిమ్‌ మేకర్లు అనగానే కొన్ని షరతులు ముందుకొస్తాయి. వాళ్లు తీసే సినిమాలు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని అంచనాలు వేస్తుంటారు. అయితే, గాల్లో ఒకేసారి పదిహేను సుమోలు గాలిలో ఎగరడం లాంటి సన్నివేశాలు మగవాళ్లు తీయాలి. ఆడవాళ్లు తీసే సినిమాలు మాత్రం వాటన్నింటికీ భిన్నంగా ఉండాలనడం సబబేనా.! సామాజిక బాధ్యత కేవలం ఆడవాళ్లకేనా? క్రియేటివ్‌ రంగాల్లో ఉన్నవాళ్లు అందుకు భిన్నంగా ఆలోచించగలగాలి. అంతేకానీ, మహిళలు మాత్రమే మంచి సినిమాలు తీయాలనడం సబబు కాదు. 


బ్రిటన్‌లో పీహెచ్‌డీ... 

చిన్నప్పటి నుంచి సినిమాలంటే అమితాసక్తి. టొరొంటోలో ఫిలిమ్‌ మేకింగ్‌పై మూడేళ్లు కోర్సు చేశాను. ఆ తర్వాత బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీలో ‘తొలినాళ్లలో భారతీయ సినిమా-పాటలు’ అంశంమీద పీహెచ్‌డీ పూర్తిచేశాను. నా థీసెస్‌ను ఆక్స్‌ఫర్డ్‌ ్డయూనివర్సిటీ ప్రెస్‌ ‘‘హర్‌ మెజిస్ట్రిక్‌ వాయిస్‌’’ పేరుతో పుస్తకంగానూ ప్రచురించింది. ప్రస్తుతం మణిపాల్‌ యూనివర్సిటీకి అనుబంధమైన, ‘సృష్టి ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ ఇనిస్టిట్యూట్‌’లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా. అందులో పీహెచ్‌డీ విద్యార్థులకు గైడ్‌గానూ ఉన్నాను. 


ఎవరి పంథా వారిది... 

ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ మా తమ్ముడు. వాస్తవానికి తమ్ముడి కన్నా ముందే నేను డాక్యుమెంటరీలు తీయడం మొదలుపెట్టాను. మేమెప్పుడూ స్నేహంగా ఉంటాం. కానీ భిన్నంగా ఆలోచిస్తాం. అయితే, నేనెన్నడూ తనమీద ఆధారపడను. నేనొక మంచి వాతావరణంలో పెరిగాను. మా అమ్మ ఇంద్రగంటి జానకీబాల, నాన్న శ్రీకాంత్‌శర్మ ప్రముఖ సాహితీవేత్తలు. వారిద్దరి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే తెలుగు, ఇంగ్లీషు సాహిత్యం చదవడం అలవాటైంది. శాస్త్రీయ సంగీతంలోనూ శిక్షణ పొందాను. కర్ణాటిక్‌, హిందూస్థానీ, వెస్ట్రన్‌ సంగీతాన్ని ఇష్టపడతాను. పాటలూ పాడతాను.






పేరు తెచ్చిన డాక్యుమెంటరీలు...

టొరొంటో నుంచి తిరిగొచ్చాక డాక్యుమెంటరీలు చాలా తీశాను. అందులో ప్రముఖ కవి ఇస్మాయిల్‌ మీద రూపొందించిన ‘ఇస్మాయిల్‌’ డాక్యుమెంటరీ నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత వలస పక్షులపై తీసిన ‘సీజన్‌ ఆఫ్‌ లవ్‌’ ప్యారిస్‌ ఫెస్ట్‌లో ప్రదర్శితమైంది. ఇవిగాక మహిళల కోసం పనిచేస్తున్న సంస్థలకు కొన్ని డాక్యుమెంటరీలు తీశాను. ఒక సాహిత్య ప్రేమికురాలిగా వాస్తవిక గాథలు ఇతివృత్తంగా కొన్ని సినిమాలు చేయాలనుంది. రెండు మూడు స్ర్కిప్టులు సిద్ధంగా ఉన్నాయి.




సిరివెన్నెల మెచ్చిన టైటిల్‌...

‘రాళ్లలో నీరు’ టైటిల్‌ చూసి సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చాలా బావుందన్నారు. సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, శ్రీనివాస్‌ అవసరాల సైతం మెచ్చుకున్నారు. కొందరు మనుషులు పైకి రాళ్లలాగా కఠినంగా కనిపించినా, వాళ్ల లోపల సున్నితత్వం, ప్రేమ, అనురాగాలనే నీరు ప్రవహిస్తుం టుంది. మా కథలోని పాత్రలూ అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఆ టైటిల్‌ పెట్టాం. 


- కారుసాల వెంకటేశ్‌




Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST