Abn logo
Sep 21 2020 @ 00:00AM

ఆ భయం ఇప్పుడు తగ్గింది..

Kaakateeya

కొవిడ్‌పై యుద్ధంలో ముందువరుసలో ఉన్న యోధుల్లో ఆమె ఒకరు. ఈ పోరాటంలో తనకు కరోనా సోకినా ఆమె భయపడలేదు. ధైర్యంగా నిలబడ్డారు. తనకు తానే చికిత్స చేసుకున్నారు. ఇతర రోగుల చికిత్స కోసం సిబ్బందిని సమన్వయపరిచారు. కరోనా నెగెటివ్‌ రాగానే మళ్ళీ రంగంలోకి దిగి సేవలను కొనసాగిస్తున్న నిజామాబాద్‌ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌ తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.‘‘కొవిడ్‌ నోడల్‌ అధికారిగా నిజామాబాద్‌ జనరల్‌ ఆస్పత్రిలో కరోనా సోకిన ఎందరో రోగులకు చికిత్స చేస్తున్న నాకు ఆ వైరస్‌ సోకిందని తెలియగానే భయం వేసింది. స్వతహాగా వైద్యురాలినైనా కొంచెం ఆందోళన చెందాను. నాకు అయిదేళ్ళ పాప ఉంది. ఆమెను కూడా దగ్గరకు రానివ్వకుండా హోం ఐసోలేషన్‌లో ఉండడం బాధగా అనిపించింది. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు, సహ వైద్యులూ అండగా నిలబ్డడారు. మానసికమైన స్థైర్యాన్ని అందించారు. రకరకాల వైర్‌సలు సోకిన వారికి నేను చికిత్స చేశాను. కొవిడ్‌ను కూడా అలాగే భావించాను. హోం ఐసోలేషన్‌ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. నాకు నేనే చికిత్స చేసుకున్నాను. అప్పుడు కూడా నోడల్‌ అధికారిగా నా బాధ్యతలు విడిచిపెట్టలేదు. ఇంటి దగ్గర నుంచే సిబ్బందితో సమన్వయం చేస్తూ వచ్చాను. తరువాత పరీక్షలలో నెగెటివ్‌ వచ్చింది. ఆ తరువాత మళ్ళీ విధులకు హజరవుతున్నాను. 


మహమ్మారిగా చూడొద్దు...

కరోనా వైరస్‌ ప్రపంచంలో కల్లోలం సృష్టిస్తోంది. ఇది కొత్త వైరస్‌.  స్వైన్‌ఫ్లూ, హెచ్‌ఐవీ లాంటివి మొదట వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. పాజిటివ్‌ వచ్చినవారు చాలా ఆందోళన చెందుతున్నారు. దీన్ని వైర్‌సగా కాకుండా మహమ్మారిలా చూస్తున్నారు. దాని వల్లే సమస్యలు వస్తున్నాయి. కొవిడ్‌ సోకిన వారిలో రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైరస్‌ సోకితే బతకమేమో అని భయపడుతున్నారు. అలాంటి వారికి మా ఆస్పత్రిలోనే మానసిక వైద్యుల ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నాం. తగిన చికిత్స పొందితే వైరస్‌ లక్షణాలు తగ్గుతాయి. సాధారణ స్థితికి చేరుకుంటారు. కాబట్టి భయపడనక్కరలేదు. కరోనా నుంచి ధైర్యమే రక్ష! మా ఆస్పత్రిలో జూన్‌ నుంచీ కరోనా రోగులకు సేవలు అందిస్తున్నాం. మొదట కేవలం శాంపిల్స్‌ తీసి పంపించేవాళ్ళం. ఆ తరువాత కరోనా వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు ప్రారంభించాం.సిబ్బంది సేవలు మరువలేం

కరోనాతో జరుగుతున్న ఈ యుద్ధంలో వైద్యులూ, సిబ్బందీ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో పలువురు కరోనా బారిన పడుతున్నారు. వైరస్‌ ప్రభావం తగ్గగానే రెట్టింపు ఉత్సాహంతో విధులకు హాజరవుతున్నారు. వైద్య సిబ్బందిలో మొదట్లో భయం కనిపించేది. ఇప్పుడు తగ్గింది. వైద్యులు, నర్సింగ్‌ స్టాఫ్‌, పారామెడికల్‌ స్టాఫ్‌, పారిశుధ్య సిబ్బంది మూడు షిప్టుల్లో  సేవలు చేస్తున్నారు. కుటుంబాలకూ, పిల్లలకూ దూరంగా వారు చేస్తున్న సేవలను మరువలేం. ఎక్కువమంది సిబ్బంది కరోనా విధుల్లోనే ఉన్నా సాధారణ సేవలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.


అప్రమత్తతే ప్రధానం

కరోనా విషయంలో అప్రమత్తతే ప్రధానం. కొందరిలో లక్షణాలు తీవ్రంగా ఉన్నా ఆస్పత్రులకు రావడం లేదు. ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గి, ఇతర సమస్యలు తలెత్తాక వస్తున్నారు. దీనివల్ల ఇబ్బందులు పెరుగుతాయి. షుగర్‌, బీపీ లెవెల్స్‌ పెరగడం, మూత్ర పిండాలు, గుండె జబ్బు, ఇతర సమస్యలు ఉన్నవారికి వైద్యం అందించడం వైద్యులకు కత్తి మీద సామే! మరికొందరికి లక్షణాలు తక్కువగా ఉన్నా ఆందోళనతో ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రికి రాగానే ఆందోళనతో తమకు తెల్సిన వారి ద్వారా ఫోన్లు చేయిస్తున్నారు. చికిత్స ప్రారంభమైన రెండు రోజుల తర్వాత వారిలో ఆందోళన తగ్గుతోంది. కరోనా వచ్చిన వారు హోం క్వారంటైన్‌లో ఉన్నా నిత్యం ఆక్సిజన్‌ లెవల్స్‌ చూసుకోవాలి. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉంటే వెంటనే ఆస్పత్రిలో చేరాలి. ఇలా ఎక్కువమంది చేయకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. కరోనా తీవ్రమైన తర్వాత వస్తే కొన్నిసార్లు మేము కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. మా ఆస్పత్రికి వచ్చే కేసులు మొదట్లో తక్కువగా ఉన్నా ఆ తరువాత పెరిగాయి. దాదాపు వెయ్యి మంది వరకూ చికిత్స పొంది వెళ్ళారు. ఇప్పుడు 220 మంది వరకూ ఉన్నారు. వైద్య కళాశాలకు రికవరీ రేటు కూడా మా దగ్గర ఎక్కువగా ఉంది. ఇతర వ్యాధులు ఉన్న వారిని మినహాయిస్తే ఎక్కువ మంది త్వరగా కోలుకుంటున్నారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న మా ఆస్పత్రిలో 770 పడకలున్నాయి. కొవిడ్‌ సేవల కోసం ప్రత్యేక భవనంలో 270 పడకలు ఏర్పాటు చేశాం. కరోనా నిర్ధారణ అయ్యి ఆస్పత్రిలో చేరిన వారికి మొదట ప్రథమ చికిత్స అందిస్తున్నాం. వార్డులోకి షిప్ట్‌ చేసిన తరువాత ఆక్సిజన్‌ పెట్టడంతోపాటు అవసరమైన మందులు ఇస్తున్నాం. ఆసుపత్రిలో అత్యవసర సేవల కోసం వెంటిలేటర్లతో పాటు అన్ని బెడ్స్‌కూ ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచాం.


వారి మాటలు ఉత్సాహం పెంచుతున్నాయి...

ఇప్పుడు కరోనా చికిత్సలో నా అనుభవం కూడా ఉపయోగపడుతోంది. రోగులను ఆందోళన చెందవద్దని చెబుతున్నా. భయంతో ఉన్నవారికి నా అనుభవాలు వివరిస్తున్నా. దీన్ని ఒక వైర్‌సగా మాత్రమే చూడాలని సూచిస్తూ, వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నా. కొందరిలో మాత్రం భయం పోవడం లేదు. వారిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నాం. అలాంటివారిలో క్రమంగా ఆందోళన తగ్గుతోంది. నయం అయినవారు సంతోషంగా వెళ్తున్నారు. వారు చిరునవ్వుతో కృతజ్ఞతలు చెబుతున్నప్పుడు మరింత మందికి సేవలు చెయ్యాలనే ఉత్సాహం మాలో పెరుగుతోంది. కుటుంబ సభ్యుల భయాల మధ్య విధులు నిర్వహిస్తున్న మేము కోలుకున్న వారిని చూసి వాటన్నిటినీ మరచిపోతున్నాం. మరిన్ని సేవలు అందించడానికి మరింత శక్తి వస్తోంది. ఎంతో ఇష్టపడి నేను వైద్య వృత్తిలోకి వచ్చాను. కీలకమైన ఈ సమయంలో నిర్విరామంగా రోగులు కోలుకోవడానికి దోహదం చేస్తున్నానన్న సంతోషం ఉంది. ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చానని ఎన్నడూ అనుకోలేదు. నాకు కరోనా సోకిందని తెలిసినప్పుడు మాత్రం మా అమ్మ బాధపడింది. అయితే నా బాధ్యతలను ఆమె అర్థం చేసుకుంది. రోజూ వందల మందికి చికిత్స అందించగలగడం, ఎందరి ప్రాణాలనో కాపాడగలగడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది.


ఆదర్శం

ప్రజలకు చెప్పేది ఒక్కటే. ఈ కరోనా కాలం చాలా క్లిష్టమైన సమయం. వాక్సిన్‌ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. కరోనా పాజిటివ్‌ వచ్చినా ఆందోళన చెందవద్దు. సమయానికి మందులు వాడుతూ చికిత్స పొందితే తగ్గుతుంది. కరోనా సోకినవారికి చుట్టు పక్కల ఉండే వారు నైతికంగా తోడ్పాటు అందించాలి. అప్పుడే వారు త్వరగా కోలుకుంటారు.

- పి. సంపత్‌రావు

ఫొటోలు: ఎల్‌. రతన్‌కుమార్‌ రెడ్డి

Advertisement
Advertisement
Advertisement