Abn logo
Dec 7 2020 @ 00:19AM

నా పాట మధురం

ప్లేబ్యాక్‌ సింగర్‌గా తొలి అవకాశం దక్కడమే అదృష్టం. ఆ తొలి అవకాశాన్ని ఎ.ఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో చేజిక్కించుకోవడం అరుదైన అదృష్టం. అలాంటి అరుదైన లక్‌ను సొంతం చేసుకుని నేపథ్యగాయనిగా గుర్తింపు పొందింది మన తెలుగమ్మాయి మధుర ధార. అభిరుచిగా మొదలుపెట్టిన సంగీత సాధనను కెరీర్‌గా మలుచుకున్న మధుర ఒలికించిన కబుర్లు... 


అది బోస్టన్‌లోని బెర్క్‌లీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌. సంగీతంలో ఐదు వారాల సమ్మర్‌ ప్రోగ్రాం కోసం అక్కడికి వెళ్లిన నాకు 2018లో సంగీత దర్శకులు ఎ.ఆర్‌ రెహమాన్‌తో తొలి పరిచయం యాదృచ్చికంగా జరిగింది. ఆయన సమక్షంలో పాటలు పాడిన వాళ్లలో నేనూ ఒక్కదాన్ని. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ సంఘటన పాత జ్ఞాపకంగా మరుగున పడిపోయింది. అయితే ఇండియా తిరిగొచ్చిన తర్వాత ఓ రోజు రెహమాన్‌ గారి స్టూడియో నుంచి పిలుపొచ్చింది. ఆయన సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా బిగిల్‌లో పాట కోసం నన్ను పిలిపించారని అర్థం అవడంతో ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. అంత గొప్ప మ్యుజీషియన్‌ నా స్వరాన్ని గుర్తుపెట్టుకుని, సినిమాలో పాడే అవకాశం ఇవ్వడంతో ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాను. రెహమాన్‌ గారు పెద్దగా మాట్లాడరు. స్టూడియోలో ఆహ్లాదకరమైన వాతావరణం అలుముకుని ఉండేది. తమిళం రాకపోయినా ఉచ్ఛారణ దోషాలు దొర్లకుండా ఎంతో సాధన చేసి, ఎటువంటి టెన్షన్‌ లేకుండా ‘ఉనకాగ’ పాట రికార్డింగు పూర్తి చేశాను. ఆ తర్వాత సినిమా ఆడియో లాంచ్‌ సమయంలో నన్ను అభినందిస్తూ రెహమాన్‌ ట్వీట్‌ పెట్టారు. బిగిల్‌ సినిమా తెలుగులో విజిల్‌ పేరుతో విడుదల అయింది. తెలుగు వెర్షన్‌ ‘నీతోనే అడుగు వేయనా’ అనే పాట కూడా నేనే పాడాను. 


మూడు సందర్భాల్లో....

బిగిల్‌లో పాటతో రెహమాన్‌తో నా ప్రయాణం పూర్తవలేదు. ఆ తర్వాత భువనేశ్వర్‌లో హాకీ వరల్డ్‌ కప్‌ సందర్భంగా తన మ్యూజికల్‌ షోలో కూడా నాకు అవకాశం ఇచ్చారాయన. ఆ పాట కోర్‌సలో నేను గొంతు కలిపాను. చివరిగా మూడవసారి రెహమాన్‌ గారితో జపాన్‌ కూడా వెళ్లాను. అక్కడ ఒక మ్యూజిక్‌ షోలో రెహమాన్‌ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. దాన్లో జోనితా గాంధీతో కలిసి పర్‌ఫార్మ్‌ చేశాను. సంగీత కుటుంబం

సంగీతం మా కుటుంబంలో ఓ భాగం. ఇంట్లో నిరంతం పాటలు మోగుతూనే ఉంటాయి. అమ్మ కర్ణాటక సంగీతం నేర్చుకుంది. అమ్మా, నాన్నా, బామ్మగారు... ఇలా కుటుంబంలో అందరికీ సంగీతం పట్ల ఆసక్తే! పాటలు వినడమే కాదు, పాడేవారు కూడా! వాళ్ల బాటలోనే నేనూ నడిచాను. అలా అమ్మ కల్యాణి తాళ్లూరి ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసు నుంచే హిందూస్థానీ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాను. సారధి చటర్జీ, మంజీత్‌ సింగ్‌ నా హిందూస్థానీ సంగీత గురువులు. అయితే ఓ పక్క చదువు, మరోపక్క సంగీతం ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడంలో నాకు అమ్మ తోడ్పడిందని చెప్పాలి. మేం ఉండేది గుర్గాంలో. హిందుస్థానీ క్లాసులు ఢిల్లీలో జరిగేవి. వారంలో మూడు రోజులు జరిగే ఆ క్లాసుల కోసం అమ్మ నన్ను గుర్గాం నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లేది. అప్పట్లో ‘అమ్మ చెప్పింది కాబట్టి నేర్చుకోవాలి’ అనే ఆలోచనతోనే నడుచుకునేదాన్ని. కానీ కాలక్రమేణా సంగీతం నా అభిరుచి కాదు, అదే నా గమ్యం అని అవగతమైంది. సంగీతాన్ని ఆస్వాదించడం, ఆనందించడం అనుభవమయ్యాక నా లక్ష్యం ఏంటో నాకు అర్థమైంది. అభిరుచే కెరీర్‌గా మారితే, కెరీర్‌ను కెరీర్‌గా కాకుండా, అభిరుచిలా ఆస్వాదిస్తాం. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. 


కొత్తదనం అభినందనీయం!

కాలక్రమేణా సంగీతంలో కొత్త పోకడలు వచ్చాయి. మున్ముందు మరెన్నో వస్తాయి కూడా. అయితే ఎలాంటి సంగీతమైనా, దేని ప్రత్యేకత దానిదే! అన్నిటినీ ప్రోత్సహించవలసిందే! ర్యాప్‌, పాప్‌... ఇలా ఎంతటి వినూత్నమైన, విభిన్నమైన సంగీత ధోరణులు పుట్టుకొచ్చినా శాస్త్రీయ సంగీతం స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదు. ర్యాప్‌ లేదా ఎలకా్ట్రనిక్‌ సంగీతాలు కాలక్రమేణా కొత్త రూపాలు సంతరించుకుంటూ ఉంటాయి. కానీ శాస్త్రీయ సంగీతం కలకాలం అలాగే నిలిచి ఉంటుంది. ఇప్పటికీ సంగీతం నేర్పించే విషయానికొస్తే పెద్దలు తమ పిల్లలకు కర్ణాటిక్‌ లేదా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్నే ఎంచుకుంటూ ఉంటారు. ఈ పాటలకు ఆదరణ అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే పాటల పట్ల అభిరుచులు, ఇష్టాలూ వ్యక్తులను బట్టి మారుతూ ఉంటాయి. అలాగే సంగీతంలో సృజనాత్మకతకూ, ప్రయోగాలకూ ఎంతో వీలు ఉంది. కాబట్టే భిన్నమైన పాటలు వెలుగులోకి వస్తున్నాయి. సంగీతంలో ఇలాంటి అభివృద్ధి అభినందనీయం. నా మటుకు నేను పాతకాలం సంగీతం వింటూ పెరిగాను. భానుమతి, సుశీల, లతామంగేష్కర్‌, మొహమ్మద్‌ రఫీ, హేమంత్‌ కుమార్‌, గీతాదత్‌, తలత్‌ మెహమూద్‌, ఘంటసాల... వీళ్లందరి పాటలంటే నాకు ప్రాణం. 


తెలుగులో పాడాలని...

ఉనకాగ పాట తమిళనాట నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో తమిళ సినిమాల్లో పాడే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఇప్పటివరకూ సుమారు పది తమిళ పాటలు పాడాను. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గణేషపురం తమిళ సినిమాలో పాడిన పాట తాజాగా విడుదల అయింది. బిజిల్‌ తెలుగు డబ్బింగ్‌ విజిల్‌లో కూడా నేనే పాడినా అంతగా గుర్తింపు దక్కించుకోలేకపోయాను. నిజానికి తెలుగు అమ్మాయిని కాబట్టి తెలుగులో కూడా పాటలు పాడాలని ఉంది. నా రోజంతా సంగీతంతోనే ముడిపడి ఉంటుంది. సాధన చేస్తాను. లేదా సంగీతం వింటూ గడుపుతాను. ప్రస్తుం కచేరీలు చేయడంతో పాటు వాక్స్‌కోచ్‌ అనే ఆన్‌లైన్‌ సంస్థ కు వోకల్‌ కోచ్‌గా పనిచేస్తున్నాను. వాక్స్‌కోచ్‌ ప్రొషెషనల్‌ వాయిస్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌. దీన్లో గాయలకులతో పాటు, వాయిస్‌ ఆర్టిస్టులు, ఇతరత్రా ఉద్యోగులకు వాళ్ల స్వరాలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువసేపు పాడడం, మాట్లాడడం వల్ల అలసటకు లోనయిన స్వరానికి ఎలా స్వాంతన అందించాలో, ఎలా మధురంగా మలుచుకోవాలో ఈ శిక్షణ ద్వారా నేర్పిస్తాను.  తెలుగమ్మాయిని

మాది రాజమండ్రి. అమ్మ తాళ్లూరి కల్యాణి లింగ్విస్ట్‌. నాన్న తాళ్లూరి సత్యజిత్‌ పెప్సికోలో ఉద్యోగం. దాంతో నాన్న వృత్తిరీత్యా నా చదువంతా గుర్గాంలోనే సాగింది. ఇంటర్‌ తర్వాత 2016లో చెన్నైలోని కళాక్షేత్రలో నాలుగేళ్ల కర్ణాటిక్‌ మ్యూజిక్‌ డిప్లొమా చేశాను. అన్నయ్య సంకర్షణ్‌ ప్రస్తుతం పిహెచ్‌డి చేస్తున్నాడు. మా తాతయ్య సి.ఆర్‌.జె పంతులు థియేటర్‌ ఆర్టిస్టు, ప్లే రైటర్‌ కూడా! థియేటర్‌ ఆర్టిస్టుగా రెండుసార్లు నంది అవార్డు గెలుచుకున్నారు. కన్యాశుల్కంలో గిరీశం పాత్రకు ఆయనకు ఆ అవార్డులు దక్కాయి. మూడేళ్ల క్రితమే ఆయన కాలం చేశారు.బహుముఖ గాయని!

‘‘ఇటీవలి కాలంలో మనకు దక్కిన సింగర్స్‌లో మధుర అత్యంత ఆసక్తికరమైన గాయని. సంప్రదాయం ఉట్టిపడే బహుముఖ గాయని ఆమె’’ 

- ఎ.ఆర్‌ రెహమాన్‌, సంగీత దర్శకులు

ప్రత్యేకం మరిన్ని...