Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఈ గొర్రెల కాపరి... పరుగుల రాణి

twitter-iconwatsapp-iconfb-icon
ఈ గొర్రెల కాపరి... పరుగుల రాణి

వయసు నలభై ఆరు... పరుగులో పదుల పతకాలు. మేకలు కాస్తూ... కుటుంబ భారం మోస్తూ... క్రీడల్లో రాణిస్తోందో గిరిజన మహిళ. కష్టాలకు ఎదురీదుతూ... అవమానాలు... అవహేళనలు భరిస్తూ... జాతీయ స్థాయిలో అదరగొడుతోంది. పేదరికంలో మగ్గుతున్నా... అప్పు చేసి మరీ పోటీ పడుతున్న ఏలూరు మల్లేశ్వరి క్రీడా స్ఫూర్తి ఇది... 


‘‘బాగా చదువుకోవాలని, ఆటల్లో రాణించాలనే ఆకాంక్ష నాకు చిన్పప్పటి నుంచి బాగా ఉండేది. కానీ మా పేదరికం అందుకు అడ్డుగా నిలిచింది. నెల్లూరు జిల్లా కావలి మండలం అడవిరాజుపాళెం మాది. మేం ఆరుగురు సంతానం. నాన్న చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించారు. దీంతో అమ్మ కూలీ చేసి మమ్మల్ని పోషించింది. నాకు చదువుకోవాలని ఉన్నా ఇల్లు గడవడానికి అమ్మతో కలిసి పనులకు వెళ్లేవాళ్లం. 


వేధింపులు భరించలేక... 

నాకు పదమూడేళ్ల వయసులోనే పెళ్లి చేశారు. నా భర్త మాల్యాద్రి, నేనూ రోజూ కూలీ పనులకు వెళ్లేవాళ్లం. మాకు ఇద్దరు ఆడపిల్లలు... మంజుల, మమత. కొన్నేళ్లు మా వైవాహిక జీవితం బాగానే సాగింది. అయితే క్రమంగా ఆయనలో మార్పు వచ్చింది. నన్ను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. రాను రాను వేధింపులు ఎక్కువై, తట్టుకోలేక భర్త నుంచి విడిపోయాను. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లాను. 


రెండు చోట్ల పనులు...  

అమ్మ దగ్గర ఉంటూ ఉదయంపూట పొలంలో పనిచేసేదాన్ని. సాయంత్రం ఇటుకల బట్టీలో ట్రాక్టర్లకు లోడ్‌ చేసేదాన్ని. మండుటెండైనా... వానైనా పని చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. నా కష్టం నేను పడుతూనే పెద్దమ్మాయిని నర్సు కోర్సు చేయించాను. చిన్నమ్మాయి తొమ్మిదో తరగతి వరకు చదివి ఆపేసింది. ఇద్దరికీ ఉన్నంతలో మంచి సంబంధాలే చూసి పెళ్లి చేశాను. 


చూసేందుకు వెళ్లి... 

ఐదేళ్ల కిందటి మాట ఇది. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వెటరన్‌ క్రీడా పోటీలు జరుగుతుంటే చూసేందుకు వెళ్లాను. స్టేడియంలోకి అడుగుపెట్టగానే నాకూ ఆసక్తి కలిగింది. వెంటనే అక్కడున్న క్రీడాకారిణి కోటేశ్వరమ్మ, ఉపాధ్యాయుడు భాస్కరరావుల వద్దకు వెళ్లి... రన్నింగ్‌ రేస్‌లో పాల్గొనాలంటే ఏంచేయాలని అడిగాను. ‘ఏమీ అవసరం లేదు... కావాలనుకుంటే ఇప్పుడే పాల్గొనవచ్చు’ అన్నారు. అది వినగానే లోపల కాస్త భయమనిపించింది. కానీ వారిద్దరి ప్రోత్సాహంతో పోటీపడ్డాను. నమ్మలేని నిజం ఏమిటంటే... అందులో రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం గెలుచుకున్నా. నా ఆనందానికి హద్దే లేదు. ఆ స్ఫూర్తితో భోపాల్‌, లఖ్‌నవూ, తిరువనంతపురం, మంగళూరు తదితర జాతీయ స్థాయి పోటీల్లో పోటీపడ్డాను. పాల్గొన్న ప్రతిసారీ పతకాలు వస్తూనే ఉన్నాయి. అలా ఇప్పటి వరకు 9 జాతీయ, 10 రాష్ట్ర స్థాయి పతకాలు సాధించాను. 100 మీటర్లు, 200 మీటర్లు రన్నింగ్‌తో పాటు 500 మీటర్ల స్పీడ్‌ వాక్‌లో కూడా నేను పాల్గొంటున్నాను. 


అప్పులు చేయక తప్పదు... 

దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగే ఈవెంట్లకు వెళ్లాలంటే కనీసం ఆరేడు వేల రూపాయలు అవసరమవుతాయి. కానీ అంత డబ్బు నా దగ్గర లేకపోవడంతో పది రూపాయల వడ్డీకి అప్పులు చేసి మరీ పోటీలకి వెళుతున్నాను. రేయింబవళ్లు కూలీ పనులు చేసి ఆ అప్పులు తీర్చేస్తుంటా. తీసుకున్న అప్పు గడువు లోగా చెల్లించకపోతే మాటలు పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ముందుగా కొంత డబ్బు దాచుకుంటా. ‘అప్పులు చేసి సాధించే ఆ పతకాల వల్ల నీకు వచ్చేదేమిట’ని చాలా మంది అంటుంటారు. కానీ ఇది నా చిన్నప్పటి కల. ఆ పతకాలు చూసుకున్నప్పుడు నా కష్టం మరిచిపోతాను. 


మగరాయుడిలా తయారైందనేవారు... 

మా గిరిజన కుటుంబాల్లో పెద్దగా చదువుకున్నవారు ఉండరు. కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారే అధికం. ఆటల కోసం నేను ట్రాక్‌ సూట్‌, షూ వేసుకుంటే చాలు... ‘అబ్బో! ఈమె బరితెగింపు ఏమిటమ్మో..! ఎవ్వారం మామాలుగా లేదే... మగరాయుడిలా తయారైందే’... అంటూ చులకన చేసేవారు. ‘మీరు అలా తయారు కావద్దం’టూ వారి పిల్లలకు చెప్పేవారు. పెద్దమ్మాయికి పెళ్లి సమయంలో బంగారు నగ ఒకటి చేయిద్దామని అప్పు కోసం ఒకరి వద్దకు వెళ్లా. అప్పు ఇవ్వకపోగా... ‘నీ పతకాలు కరగదీసి... హారాలు చేయించి దిగేయ్‌’ అంటూ అవహేళన చేశారు. ఆ బాధతో కొన్ని రోజులు అన్నం ముట్టలేదు. ఇంకొందరైతే... ‘ఎందుకా పతకాలు? నెత్తినేసి కొట్టుకొంటావా? సర్టిఫికెట్లు పొయ్యి రాజేసుకోను పనికొస్తాయ’ని అవహేళన చేసేవారు. ఇవేవీ పట్టించుకోవద్దన్న మా అమ్మ మాటలు నాలో ఆత్మస్థైర్యం నింపాయి. ఈ గొర్రెల కాపరి... పరుగుల రాణి

నా లక్ష్యం అదే... 

పొదుపు గ్రూపుల ద్వారా వచ్చిన ఇరవై వేల రూపాయల రుణంతో తొమ్మిది మేకలు కొనుగోలు చేశా. బుడంగుంట ఎస్టీ కాలనీలో స్థలం కొని, పూరిల్లు ఏర్పాటు చేసుకున్నా. సాయంత్రం వేళల్లో ఇటుకల పనులకి వెళుతుంటా. మేకలు మేపడటానికి వెళ్లినప్పుడు... పొలం గట్లు, బీడు కయ్యిల్లోనే ప్రాక్టీసు చేస్తుంటా. ఆ రాళ్లు, రప్పలు, ముళ్లు గుచ్చుకుంటూ ఉంటాయి. అందుకే నాకు స్టేడియంలో పరుగులు తీయడం కష్టమనిపించదు. ఒక్కసారైనా విదేశాలకు వెళ్లి భారత్‌ తరుఫున పోటీపడాలని ఉంది. అదే నా ఏకైక లక్ష్యం. నాలాగా ప్రతిభ ఉన్నా ఆర్థిక వనరులు లేక ఎంతోమంది వెనకబడిపోతున్నారు. అలాంటివారిని ప్రోత్సహిస్తే మనమూ ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించగలము. 


అవే నాకు ప్రోత్సాహం... 

ఎవరెన్ని అన్నా... ఒక్కసారి ట్రాక్‌లోకి దిగి పరుగు అందుకొంటే అన్నీ మరిచిపోతాను. అక్కడ పెద్దలు, బాగా చదువుకున్నవారు, దేశవిదేశాలు తిరిగొచ్చినోళ్లు నన్ను మెచ్చుకొంటుంటే ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంటుంది. గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేసే సంస్థలకు నా వంతు సహకారం అందిస్తుంటాను. ఆ క్రమంలో కొందరు విదేశీయులు మా ఇంటికి వచ్చారు. నా పతకాలు చూసి ఎంతో అభినందించారు. కెమెరా బహుమతిగా ఇచ్చారు. మా ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులు పూలమాలలు, శాలువాలతో సన్మానిస్తుంటే ఆనంద భాష్పాలు ఆగలేదు. నన్ను చూసి మా ప్రాంతంలో కొందరు తమ పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించడం ఎంతో సంతృప్తినిస్తుంది.’’
- కంచర్ల మహేశ్‌బాబు, నెల్లూరు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.