ఆ లక్ష్యం బరువు కాదు బాధ్యతే!

ABN , First Publish Date - 2021-04-21T05:30:00+05:30 IST

రికార్డు విజయాలు, పద్మశ్రీ, రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలు... ఘోరమైన వైఫల్యాలు, తీవ్రంగా దెబ్బతీసిన గాయాలు... ఎడతెగని నిస్పృహ... అంతులేని ఆశావాదం.. 2016 రియో ఒలింపిక్స్‌లో ఎంట్రీ లెవెల్‌ కూడా దాటని ఘోర వైఫల్యం... 2017లో, వరల్డ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో... ఇరవై రెండేళ్ళ తరువాత స్వర్ణ పతకం సాధించిన భారతీయురాలిగా ఘనత... ఇటీవల ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షి్‌పలో ప్రపంచ రికార్డును బద్దలుగొట్టి, కాంస్య పతకం సాధించిన మీరాబాయ్‌ క్రీడా జీవితమంతా ఇలాంటి ఎత్తుపల్లాలే...

ఆ లక్ష్యం బరువు కాదు బాధ్యతే!

రికార్డు విజయాలు, పద్మశ్రీ, రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలు... ఘోరమైన వైఫల్యాలు, తీవ్రంగా దెబ్బతీసిన గాయాలు... ఎడతెగని నిస్పృహ... అంతులేని ఆశావాదం.. 2016 రియో ఒలింపిక్స్‌లో ఎంట్రీ లెవెల్‌ కూడా దాటని ఘోర వైఫల్యం... 2017లో, వరల్డ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో... ఇరవై రెండేళ్ళ తరువాత స్వర్ణ పతకం సాధించిన భారతీయురాలిగా ఘనత... ఇటీవల ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షి్‌పలో ప్రపంచ రికార్డును బద్దలుగొట్టి, కాంస్య పతకం సాధించిన మీరాబాయ్‌ క్రీడా జీవితమంతా ఇలాంటి ఎత్తుపల్లాలే... ‘‘అయితే నా లక్ష్యం నుంచి నన్ను ఏదీ వేరు చెయ్యలేదు’’ అంటారు ఇరవయ్యారేళ్ళ ఈ మణిపురి అమ్మాయి.



‘‘మణిపూర్‌లోని ఇంఫాల్‌కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంగ్‌పోక్‌ కక్‌ఛింగ్‌ గ్రామం మాది. మా నాన్న ఇంఫాల్‌లో ప్రజాపనుల శాఖలో కింది స్థాయి ఉద్యోగి. మా అమ్మ మా గ్రామంలోనే చిన్న దుకాణం నడుపుతూ ఉండేది. మేం ఆరుగురు తోబుట్టువులం. నేనే ఆఖరుదాన్ని. దాంతో అందరూ నన్ను ముద్దుగా చూసేవారు. మా ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ఉండేది. మా పెద్దన్నయ్య అక్కడ కట్టెలు కొట్టి ఇంటికి తెచ్చేవాడు. అతనితో నేనూ వెళ్ళేదాన్ని. కొన్నాళ్ళకి అతనితో కలిసి కట్టెలు మోసుకొచ్చేదాన్ని. ఒక రోజు మా అన్నయ్య కట్టెల్ని మోపుగా కట్టాడు. దాన్ని మొయ్యడానికి ఇబ్బంది పడుతున్నాడు. నేను దాన్ని పైకి లేపి, తలమీద పెట్టుకున్నాను. ఇంటికి తీసుకొచ్చాను. ‘‘నువ్వు కుంజరాణిదేవిలా మంచి వెయిట్‌ లిఫ్టర్‌ అవుతావ్‌!’’ అన్నాడు పెద్దన్నయ్య. 




ఆమే నా స్ఫూర్తి...

కుంజారాణి దేవిది మా రాష్ట్రమే. వెయిట్‌లిఫ్టింగ్‌ మీద నాకు ఆసక్తి పెరగడానికి కారణం కూడా ఆమే! అంతంత బరువులు ఆమె ఎలా ఎత్తగలుగుతోందని నాకు ఆశ్చర్యం వేసేది. ఆమె మా రాష్ట్రంలోని అమ్మాయిలకి ఆరాధ్యదైవం. ప్రతి ఒక్కరూ ఆమెలా కావాలనుకొనేవారు. అందుకే వెయిట్‌లిఫ్టింగ్‌ నేర్చుకుంటానని మా అమ్మనీ, నాన్ననీ అడిగాను. మొదట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ నేను మొండిపట్టు పట్టడంతో ‘సరే’నన్నారు. స్థానికంగా నేను శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాను. శిక్షణలో ఉన్నప్పుడు మా కోచ్‌లు నాకు డైట్‌చార్ట్‌లు ఇచ్చేవారు. ఆహారంలో చికెన్‌, పాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పేవారు. ప్రతి రోజూ నా కోసం ఒక గ్లాసు పాలు ప్రత్యేకంగా కేటాయించే పరిస్థితిలో నా కుటుంబం లేదు. దాదాపు ఏడాది పాటు అంత ఆరోగ్యం కాని, పోషకాలు పెద్దగా లేని ఆహారం తీసుకుంటూనే బరువులు ఎత్తాను. అది నా సామర్థ్యం మీద ప్రభావం చూపించింది. మొదట్లో నా ప్రదర్శన చూసి నాకే చిరాకు పుట్టేది. ఒక రోజు కూర్చొని ఆలోచించాను. ‘వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణించాలన్నది నా కోరిక. దాని కోసం ఎలాంటి కష్టాన్నయినా ఎదుర్కోవాలి’ అని నిర్ణయించుకున్నాను. అందుబాటులో ఉన్న వనరుల్ని వినియోగించుకున్నాను. నా ప్రదర్శన మెల్లగా మెరుగుపడడం మొదలైంది. తొలిసారిగా పన్నెండేళ్ళ వయసులో మొదటి పతకం గెలుచుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలు దాటి, జాతీయ స్థాయికి చేరుకున్నాను. పటియాలాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎ్‌స - పటియాలా)లో చేరే అవకాశం వచ్చింది. నా జీవితాన్ని అది గొప్ప మలుపు తిప్పంది. అత్యుత్తమ స్థాయి శిక్షణ పొందే అవకాశం అందివచ్చింది. 2014లో స్కాంట్లాండ్‌లో జరిగిన ‘కామన్‌వెల్త్‌’ క్రీడల్లో, 48 కిలోల కేటగిరీలో రజత పతకం గెలిచాను. నాకు మొదటిసారి మంచి గుర్తింపు తెచ్చిన సందర్భం అది. 


అక్క పెళ్ళికి కూడా వెళ్ళలేదు...

మొదటి నుంచీ నాకు వైఫల్యాలూ, గాయాలూ ఎదురవుతూనే ఉన్నాయి. వాటిని తట్టుకోవడం, మళ్ళీ గెలుపుబాట పట్టడం సాధారణమైపోయింది. రియో ఒలింపిక్స్‌లో వైఫల్యం ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. ఆ ఒలింపిక్స్‌కు నేను ఎంపిక కానట్టయితే వెయిట్‌ లిఫ్టింగ్‌ నుంచి విరమించుకోవాలని నా తల్లితండ్రులు చెప్పారు. ఆర్థిక సమస్యలు కూడా దీనికి మరో కారణం. ఎంతో కష్టపడి క్వాలిఫై అయ్యాను. కానీ పేలవమైన ప్రదర్శనతో ముగించాను. ఆ తరువాత వరల్డ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌లో నేను రాణించడంతో వాళ్ళ నుంచి ఒత్తిడి తగ్గింది. అయితే, ఏదైనా సాధించాలనుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైనవి వదులుకోవాల్సి వస్తుంది. మణిపూర్‌లో నా కుటుంబంతో ఎక్కువకాలం గడపాలని ఉంటుంది. కానీ సమయం దొరకదు. పటియాలా ఎన్‌ఐఎ్‌సలో తొమ్మిదేళ్ళ నుంచీ ఉంటున్నా. ఒక రకంగా ఇదే నా ఇల్లైపోయింది. ఏడాదికోసారైనా ఇంటికి వెళ్తాను. నాలుగైదు రోజులుంటాను. వెంటనే తిరిగి ట్రైనింగ్‌కు వచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే, వెయిట్‌ లిఫ్టింగ్‌కు ప్రాక్టీస్‌ తప్పనిసరి. వారం రోజులు ప్రాక్టీస్‌ మానేస్తే.. మన శరీరాన్ని నియంత్రించుకోవడం మీదా, దారుఢ్యం మీదా ఆ ప్రభావం పడుతుంది. కుటుంబాన్ని మిస్‌ అవుతున్నందుకు బాధగా ఉన్నా నా దేశానికి గర్వకారణం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ‘నేను వదులుకుంటున్న వాటన్నిటికీ ఇది ప్రతిఫలం’ అని అనుకుంటాను. 2017లో మా అక్క పెళ్ళయింది. అప్పుడు నేను అమెరికాలో శిక్షణకు వెళ్ళడంతో ఆ పెళ్ళికి హాజరుకాలేకపోయాను. మా ఊరు వెళ్ళినప్పుడల్లా బంధువుల్నీ, స్నేహితుల్నీ కలిసి సరదాగా కాలక్షేపం చేస్తాను. 


వెన్ను నొప్పితో వెనక్కు వచ్చేశాను...

ఇక, గాయాల విషయానికొస్తే, 2018లో  వెన్నుకు గాయం కావడంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఆ ఏడాది జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల తరువాత ఆ ఇబ్బంది తరచూ వచ్చి పోతూ ఉండేది. దాని నుంచి కోలుకోడానికి కొన్ని నెలలు పట్టింది. గాయపడి ఆటకు దూరమైనందుకు నాలో నిస్పృహ ఆవరించింది. అది నాకు ఎంతో కష్టంగా గడిచిన కాలం. ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నా నన్ను నేను కూడదీసుకోవడానికి ఒక పోరాటం చేయాల్సి వచ్చింది. అథ్లెట్లకు గాయాలు బద్ధ శత్రువులు. ప్రతి అథ్లెట్‌ ఫిట్‌గా ఉండాలనీ, దేశం కోసం పతకాలు గెలవాలని కోరుకుంటారు తప్ప గాయపడాలనుకోరు కదా? నా కోచ్‌ విజయ్‌ నాకు ఎంతో ప్రేరణ ఇచ్చారు. ఆత్మస్థైర్యం నింపారు. ఆయన ఎప్పుడూ, తీసుకోవాల్సిన ఆహారం నుంచి ప్రాక్టీస్‌ వరకూ ప్రతి విషయంలో సలహాలూ, సూచనలూ ఇస్తారు. అందుకు ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. ఎన్‌ఐఎ్‌స ఫిజియోథెరపి్‌స్టల సాయంతో కోలుకున్నాక, 2019 ఫిబ్రవరిలో, థాయిలాండ్‌లో జరిగిన ఇజిఎటి కప్‌ ఇంటర్నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షి్‌ప్సలో స్వర్ణ పతకం గెలిచాను. ఇది ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ కూడా! అయితే కరోనా కారణంగా కిందటి ఏడాది లాక్‌డౌన్‌ విధించడం, మా ఇనిస్టిట్యూట్‌ మూతపడడంతో, ప్రాక్టీస్‌ మీద నీలినీడలు కమ్ముకున్నాయి. ఈలోగా, కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఎన్‌ఐఎ్‌స నుంచి నా సొంత ఊరుకు వెళ్ళాను. అక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు వెన్ను నొప్పి వస్తున్నట్టనిపించింది. అది సహజమే అనుకున్నాను. మా ఊరు నుంచి పటియాలా వచ్చాక, పధ్నాలుగు రోజులు క్వారంటైన్‌లో ఉన్నాను. అనంతరం రెండు నెలల శిక్షణ కోసం అమెరికా వెళ్ళాను. అక్కడ నొప్పి చాలా ఎక్కువైంది. శిక్షణ నుంచి అర్థంతరంగా వెనక్కి రావాల్సి వచ్చింది. దాని నుంచి తేరుకొని, మళ్లీ నా ప్రదర్శన మీదే దృష్టి పెట్టాను. ఏడాది విరామం తరువాత, ఈ మధ్య జరిగిన ఆసియా వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షి్‌పలో ‘క్లీన్‌ అండ్‌ జర్క్‌’ విభాగంలో సరికొత్త రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉంది. ఇప్పుడు నా దృష్టంతా రాబోయే ఒలింపిక్స్‌ పైనే ఉంది. దానికి సన్నద్ధం అవుతున్నాను. ఆ ఒలింపిక్స్‌లో మన దేశం తరఫున పతకం సాధించడమే నా ముందున్న లక్ష్యం. ఇది బరువు అనుకోవడం లేదు. దేశం పట్ల నా బాధ్యతను మోస్తున్నాననుకుంటున్నాను.’’





‘‘మొదట నాతో నేను పోటీ పడతాను. మిగిలిన వాళ్ళ సంగతి ఆ తరువాతే. ఎప్పుడూ సానుకూలంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి ఒక్క అడుగే వేస్తాను. రియో ఒలింపిక్స్‌ వైఫల్యం లాంటిది మరెప్పుడూ నాకు ఎదురుకాకూడదని కోరుకుంటాను. అయితే, ఒత్తిడిని ఎదుర్కోవడం, ప్రపంచంలోనే అగ్రస్థాయిలో ఉన్న అథ్లెట్లతో పోటీ పడడం, కొత్త టెక్నిక్స్‌... ఇలా రియోలో నేను ఎన్నో నేర్చుకున్నాను. ఒక రకంగా అది నా దృక్పథాన్ని ఎంతగానో మార్చింది.’’




‘‘తెల్లవారుజామునే లేవడం నాకు అలవాటు. ఇది కచ్చితంగా పాటిస్తాను. రోజూ పొద్దున్నే గంటసేపు యోగా చేస్తాను. మా ఇనిస్టిట్యూట్‌లో, మా గదుల బయట చిన్న మైదానం ఉంది. అక్కడ జాగింగ్‌, తేలికపాటి వర్కవుట్లు చేస్తాం. తరువాత కండరాలు పటిష్టంగా ఉండడానికి వ్యాయామం చేస్తాను. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తాను, అప్పుడు కాస్త విరామం దొరుకుతుంది. నా కుటుంబంతో, స్నేహితులతో మాట్లాడతాను. మధ్యాహ్న భోజనం తరువాత కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. సాయంత్రం మళ్లీ వ్యాయామం, సాధన ఉంటాయి. మాకు సోమవారం నుంచి శనివారం వరకూ శిక్షణ ఉంటుంది. శనివారం రాత్రి ఆలస్యంగా నిద్రపోతాం. సంగీతం వింటాం, నృత్యం చేస్తాం, లేదా సినిమాలు చూస్తాం. ఆదివారాలు సాధారణంగా బయటకు వెళ్తూ ఉంటాం.’’

Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST