కేన్సర్ రోగుల సంజీవని!

ABN , First Publish Date - 2020-09-10T05:30:00+05:30 IST

మూడేళ్ళపాటు కేన్సర్‌తో పోరాడి గెలిచిన ఆమె రోగుల కష్టాలను చాలా దగ్గరగా చూశారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపి, సరైన అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు...

కేన్సర్ రోగుల సంజీవని!

  • మూడేళ్ళపాటు కేన్సర్‌తో పోరాడి గెలిచిన ఆమె రోగుల కష్టాలను చాలా దగ్గరగా చూశారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపి, సరైన అవగాహన కల్పించడానికి  స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. రెండు లక్షల పైచిలుకు రోగులకు ఆ సంస్థ ‘సంజీవని’గా నిలిచింది. సెంట్రల్‌ రైల్వే్‌సలో ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ అడ్వయిజర్‌గా పని చేస్తున్న యాభై ఏడేళ్ళ రూబీ అహ్లూవాలియా స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఆమె మాటల్లోనే...


టాటా కేన్సర్‌ ఆస్పత్రిలో వైద్యుల రాక కోసం ఎదురు చూస్తూ చాలా మంది నేల మీదే కూర్చొని ఉండేవారు. వాళ్ళ కళ్ళలో ఏ మాత్రం ఆశ కనిపించేది కాదు. వాళ్ళ చూపులు నన్ను వెంటాడుతున్నట్టనిపించేది. ప్రతి రోజూ ఎందరో మనుషులు... ఎన్నెన్నో కథలు. అవన్నీ నా గుండెను కుదిపేస్తూ ఉండేవి.


‘‘పదకొండేళ్ళ క్రితం వరకూ నాది ఎలాంటి ఒడుదొడుకులూ లేని జీవితం. మా నాన్న పోలీస్‌ అధికారి. నా బాల్యమంతా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో గడిచింది. చదువుల్లో కూడా నేను టాప్‌. 1986లో సివిల్‌ సర్వీసె్‌సలో చేరాను. చాలా ప్రాంతాల్లో పని చేశాను. వివాహం, కుటుంబం... చక్కగా సాగిపోతున్న నా ప్రయాణంలో ఊహించని కుదుపు ఎదురైంది. రొమ్ముల్లో ఏదో ఇబ్బందిగా అనిపించి 2009లో వైద్య పరీక్షలు చేయించుకున్నాను. నాకు రొమ్ము కేన్సర్‌ అని వైద్యులు నిర్ధారించారు. అది కూడా మూడో దశలో ఉందని చెప్పారు. ఒక్కసారిగా నా ప్రపంచమంతా తల్లకిందులైనట్టనిపించింది. ఆ సమయంలో నా భర్త అనిల్‌, కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. ధైర్యం చెప్పారు. కానీ నన్ను భయం వెంటాడుతూనే ఉండేది.







వారి చూపులు వెంటాడేవి!

చికిత్స కోసం ముంబయ్‌లోని టాటా కేన్సర్‌ ఆస్పత్రిలో చేరాను. అక్కడ తోటి రోగులను చూస్తే నా పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందనిపించేది. వైద్యుల రాక కోసం ఎదురు చూస్తూ చాలా మంది నేల మీదే కూర్చొని ఉండేవారు. వాళ్ళ కళ్ళలో ఏ మాత్రం ఆశ కనిపించేది కాదు. వాళ్ళ చూపులు నన్ను వెంటాడుతున్నట్టనిపించేది. ప్రతి రోజూ ఎందరో మనుషులు... ఎన్నెన్నో కథలు. అవన్నీ నా గుండెను కుదిపేస్తూ ఉండేవి. కేన్సర్‌ బారి నుంచి నేను కోలుకోవడానికి మూడేళ్ళు పట్టింది. భద్రత ఉన్న ఉద్యోగం, కాస్తో కూస్తో ఆర్థిక స్తోమత ఉన్న నాలాంటి వాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే, రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాల వారు... ప్రధానంగా నిరక్షరాస్యులు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఎన్ని కష్టాలు పడాలో? అనే ఆలోచన నన్ను కుదిపేసింది. 


రోగులకు, వైద్యులకూ వారధిగా...

ముంబయ్‌లోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌ దేశంలోనే కేన్సర్‌ చికిత్సా కేంద్రాల్లో అతి పెద్దది. అక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ రోగులు వస్తూ ఉంటారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక్కొక్కరినీ కలిసేందుకు  వైద్యులు కేటాయించేది అయిదారు నిమిషాలే. ఉన్న కొద్ది సమయంలోనే రోగులు తమ ఇబ్బందులను వైద్యులకు చెప్పుకోవాలి. వారు చెప్పింది వైద్యులు పూర్తిగా అర్థం చేసుకోవాలి. నేను చికిత్స పొందుతున్న సమయంలో ఇది గమనించాను. నిజానికిది చాలా పెద్ద సమస్య. అందుకే వైద్యుడికీ, రోగికీ మధ్య ఒక వేదిక ఏర్పాటు చేయాలనిపించింది.


రోగి వివరాలన్నీ ముందే సేకరించి, వైద్యుడికి అందిస్తే... వైద్యుణ్ణి కలిసిన తరువాత రోగి ఎక్కువసేపు తన సమస్యను చెప్పనవసరం లేదు. వైద్యులు సులువుగా వారికి అవసరమైన సమాచారం ఇవ్వగలుగుతారు. ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ‘సంజీవని - లైఫ్‌ బియాండ్‌ కేన్సర్‌’ స్వచ్ఛంద సంస్థ. దీనికి టాటా కేన్సర్‌ ఆస్పత్రి వారి సహకారం తీసుకున్నాను. అణగారిన వర్గాలకు చెందిన కేన్సర్‌ రోగులకు సహకారం అందించడమే ప్రధానంగా మా మొదటి ప్రాజెక్ట్‌ ‘కెన్‌ సహయోగి’ని ప్రారంభించాం. దీనిలో భాగంగా, వైద్యుడిని కలవడానికి ముందే రోగి ఆరోగ్యం గురించిన వివరాలను సేకరిస్తాం. ఆస్పత్రిలో వారికి అవసరమైన సాయాన్ని అందిస్తాం. మానసికంగా అండగా నిలుస్తాం. నగరంలో వారు ఉండడానికి సహకారం అందజేస్తాం. ఒకవేళ వారి దగ్గర తగినంత డబ్బు లేకపోతే ప్రభుత్వం నుంచీ, కేన్సర్‌ రోగుల కోసం పని చేస్తున్న ట్రస్టుల నుంచీ నిధులు అందేలా చూస్తాం. 


వాలంటీర్లను తయారు చేస్తున్నాం

అయితే ఉద్యోగ, కుటుంబ బాధ్యతల కారణంగా నేను అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి రోగుల సంరక్షణ చూసుకోవడానికి  నైపుణ్యం కలిగిన బృందాన్ని తయారుచేసేందుకు టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ భాగస్వామ్యంతో నాలుగు నెలల ఆంకాలజీ కేర్‌ గివింగ్‌ కోర్స్‌’ను ప్రారంభించాను. ‘కెన్‌ సాథీ’ పేరిట దాన్ని నేనే రూపొందించాను. ఈ కోర్సులో 120 గంటల థియరీ, 240 గంటల ప్రాక్టికల్‌ ఉంటుంది. ఇప్పటికి ఆరు బ్యాచ్‌లు శిక్షణ పొందాయి. అలాగే కేన్సర్‌ రోగుల్లో ఇమ్యూనిటీపై అవగాహన పెంచడానికి ‘సటోరీ’ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ తరువాత  కేన్సర్‌ రోగులు వారి జీవితాలను పునర్నిర్మించుకొని, తిరిగి ఆరోగ్యం పొందడానికి దోహదపడే ‘కెన్‌ చేతన’, ‘కెన్‌ వార్త’ అనే మరో రెండు కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాం. సంజీవని కౌన్సెలింగ్‌ సెంటర్లు ఇప్పుడు దేశంలోని పది రాష్ట్రాల్లో పధ్నాలుగు నగరాల్లో పని చేస్తున్నాయి. దీని ద్వారా గత ఆరేళ్ళలో దాదాపు రెండులక్షల ఇరవై వేల మందికి ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సాయం అందించాం. కేన్సర్‌ నుంచి బయటపడి పునరావాసం పొందినవారు వీటిలో పని చేస్తున్నారు.


కరోనా కాలంలో హెల్ప్‌లైన్‌

ముంబయ్‌ నగరంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ఆరు నెలలుగా కేన్సర్‌ రోగుల చికిత్సకు అంతరాయం ఏర్పడింది. చాలామంది పరీక్షల కోసం ఆస్పత్రులకు వెళ్ళలేకపోతున్నారు. వారి ఆందోళనలను తగ్గించి, తగిన సూచనలు అందించడానికి హెల్స్‌ లైన్‌ ఏర్పాటు చేశాం. రోజుకు కనీసం ఏడువందల మందితో మాట్లాడుతున్నాం. అలాగే రోజూ ఒకేసారి రెండు వందల మందికి పైగా రోగుల కోసం ఆన్‌లైన్‌ సెషన్స్‌ నిర్వహిస్తున్నాం. కేన్సర్‌ను ఎదుర్కోవడానికి రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారు విజయం సాధించేలా చేయడం, వారు తిరిగి సాధారణ జీవితాన్ని ప్రారంభించేలా చూడడం... నేను కోరుకొనేది ఇదే! ఆ దిశగా ‘సంజీవని’ని మరింత విస్తరించాలన్నదే నా ఆకాంక్ష.’’            





స్వీయానుభవాలతో పుస్తకం

రూబీ అహ్లూవాలియా మంచి పెయింటర్‌ కూడా. తాను వేసిన చిత్రాలతో పాటు ఇతరులు వేసిన పెయింటింగ్స్‌ను ‘ఆర్ట్‌ ఫర్‌ కాజ్‌’ పేరిట విక్రయించి, వచ్చిన మొత్తాన్ని కేన్సర్‌ రోగుల పునరావాసానికి ఖర్చు చేస్తున్నారు. తన సేవలకు గుర్తింపుగా పలు పురస్కారాలు అందుకున్న రూబీ ‘ఫ్రాగ్రెన్స్‌ ఆఫ్‌ ఎ వైల్డ్‌ సోల్‌’ పేరిట స్వీయ అనుభవాలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ‘వరల్డ్‌ కేన్సర్‌ డే’ సందర్భంగా తన బుక్‌ను విడుదల చేశారు. కేన్సర్‌తో పోరాడుతున్న ధైర్యవంతులందరికీ ఆ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నట్టు ఆమె చెప్పారు.



Updated Date - 2020-09-10T05:30:00+05:30 IST