స్ఫూర్తినింపే మరో ఫొటోతో వచ్చేసిన ఆనంద్ మహీంద్రా

ABN , First Publish Date - 2022-03-01T22:32:01+05:30 IST

ఒక్కోసారి మన రోడ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి. అస్తవ్యస్తమైన ట్రాఫిక్ వ్యవస్థ మనల్ని తీవ్ర చికాకు పెడుతుంది

స్ఫూర్తినింపే మరో ఫొటోతో వచ్చేసిన ఆనంద్ మహీంద్రా

ముంబై: ఒక్కోసారి మన రోడ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి. అస్తవ్యస్తమైన ట్రాఫిక్ వ్యవస్థ మనల్ని తీవ్ర చికాకు పెడుతుంది. మన కోపం వెంటనే ప్రభుత్వాలపైకీ, తోటి వారిపైకీ వెళ్లిపోతుంది. ఇంతేనండీ.. ఒక్కడికీ ట్రాఫిక్ సెన్స్ ఉండదు. ఈ సమాజాన్ని బాగుచేయడం ఎవరి వల్లా కాదండీ.. దీనిని గాడిలో పెట్టాలంటే ఎవరో దిగిరావాలి.. అని పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు.


కానీ ఆ మార్పు మన నుంచే ప్రారంభం కావాలని మాత్రం ఎవరూ అనుకోరు. ఎంతసేపు ఎదుటి వాడు మారాలనే కోరుకుంటారు. హైదరాబాద్ సహా కొన్ని నగరాల్లోని అస్తవ్యస్త ట్రాఫిక్‌ను చూసినప్పుడు వారి బాధలో కొంత నిజం ఉందనిపిస్తుంది. అందరికీ అర్జెంటే. క్షణాల్లోనే అందరూ వెళ్లిపోవాలి. కానీ చేసే పనేం ఉండదు. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తం.


ఓ ఒక్కరో చేసిన పనికి గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లు. అదే అమెరికాలో అయితేనా ఎంత పద్ధతిగా ఉంటారండీ. దుబాయ్‌లో అయితే ఎంత క్రమశిక్షణగా ఉంటారో.. తెల్లగీత దాటనే దాటరు. సింగపూర్‌ వాసులైతే క్రమశిక్షణకు మారుపేరు అంటూ ఏవేవో దేశాల పేర్లు చెప్పేసి వారి గొప్పతనాన్ని పుంఖానుపుంఖాలుగా చెబుతారు. 


ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ ఫొటోను షేర్ చేశారు. బహుశా అది ట్రాఫిక్ సిగ్నల్ వద్దో, ఇంకేదో కూడలి వద్దో తీసిన ఫొటోలా ఉంది. వాహనాలన్నీ కొండవీటి చాంతాడంత పొడవున బారులుతీరి ఉన్నాయి. రోడ్డును రెండుగా విభజించే తెల్లగీత స్పష్టంగా కనిపిస్తోంది. భారీ వాహనాల నుంచి ద్విచక్ర వాహనాల వరకు అన్నీ ఉన్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే.. అన్ని వాహనాలతో ఒక వరుస కిక్కిరిసిపోయి ఉన్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా తెల్లగీతను దాటి ఇటువైపునకు రాలేదు. అంతేనా.. కనీసం కాలు కూడా తెల్లగీత దాటకపోవడం నిజంగా ఆశ్చర్యమే. 


ఈ ఫొటో చూసి ఇది వేరే ఏ దేశానిదో అనుకుంటే అంతకుమించిన పొరపాటు మరోటి ఉండదు. అచ్చంగా మన దేశంలోని మిజోరంలో తీసిన ఫొటో ఇది. అక్కడి ప్రజల క్రమశిక్షణకు, ట్రాఫిక్ సెన్స్‌కు ఈ ఫొటో చక్కని ఉదాహరణ. ఇది చూసి అందరూ ముచ్చటపడుతున్నారు. వారికి అంతటి సహనం ఎలా వచ్చింటూ ట్విట్టర్‌లో కామెంటే కామెంట్లు. అందరిలోనూ ఇలాంటి సెన్సే ఉంటూ ట్రాఫిక్ జామ్‌లు ఎందుకు జరుగుతాయి.. ప్రమాదాలకు ఆస్కారం ఎక్కడుంటుంది? అంటూ తోచిన కామెంట్ చేస్తున్నారు.


మిజోరంలో కఠినమైన ట్రాఫిక్ జరిమానాలు, శిక్షలు లేవు. అక్కడి ప్రభుత్వాలు, పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనలపై పెద్దగా అవగాహన కార్యక్రమాలు చేపట్టవు. కానీ ప్రజలు మాత్రం ఎవరికివారే క్రమశిక్షణగా మసలుకుంటూ మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ఫొటోను చూశాక అయినా మారుదామా? లేదంటే, మిజోరం ప్రజల క్రమశిక్షణను ప్రశంసించి మన సంగతిని మర్చిపోదామా!!

 

Updated Date - 2022-03-01T22:32:01+05:30 IST