స్ఫూర్తి ప్రదాత దీన్‌దయాళ్‌

ABN , First Publish Date - 2020-09-25T06:17:52+05:30 IST

ప్రపంచ దేశాల్లో మతరాజ్య వ్యవస్థలు,- పెట్టుబడిదారీ సిద్ధాంతం-, సోషలిజం, -కమ్యూనిజం వంటి సిద్ధాంతాల ప్రయోగాలన్నీ ఆచరణలో విఫలం కావడంతో అనేక...

స్ఫూర్తి ప్రదాత దీన్‌దయాళ్‌

ప్రపంచ దేశాల్లో మతరాజ్య వ్యవస్థలు,- పెట్టుబడిదారీ సిద్ధాంతం-, సోషలిజం, -కమ్యూనిజం వంటి సిద్ధాంతాల ప్రయోగాలన్నీ ఆచరణలో విఫలం కావడంతో అనేక వినాశకర పరిణామాలు జరిగాయి. మతరాజ్యాలు మారణ హోమానికి, పెట్టుబడిదారీ సిద్ధాంతం దోపిడీ వ్యవస్థకు దారి తీయగా, కమ్యూనిజం నిరంకుశత్వానికి, నిర్బంధాలకు దారితీసి వ్యక్తిస్వేచ్ఛను అణచివేసింది. దీనికి కారణం-, భౌతికవాద సిద్ధాంతాలన్నీ మనిషిని ఆర్థికజీవిగా మాత్రమే పరిగణించి అతడి భౌతిక అవసరాలను తీరిస్తే సరిపోతుందని భావించడమేనని దీనదయాళ్ విశ్లేషించారు.


పండిత్ దీనదయాళ్‌ ఉపాధ్యాయ అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్‌ 25న ఉత్తరప్రదేశ్‌లోని మధుర దగ్గరలోని చంద్రభాన్ అనే గ్రామంలో జన్మించారు. డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ 1951 అక్టోబరు 21న ఏర్పాటు చేసిన జనసంఘ్‌ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా దీనదయాళ్‌జీ ఎన్నికయ్యారు. పార్టీ స్థాపించిన మూడు మాసాలకే 1952లో జరిగిన జనరల్‌ ఎన్నికలలో పోటీ చేసిన నాలుగు జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటిగా జనసంఘ్‌ ఎన్నికల కమిషన్‌ గుర్తింపు పొందింది. తన ఉనికిని సాధారణ ఎన్నికలలో రుజువు చేసుకోగలిగింది. దీనికి డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ నాయకత్వంతో పాటు దీనదయాళ్‌జీ సమన్వయం కూడా తోడైంది. సాంస్కృతిక జీవన మూల్యాల సారాంశమే దీన్‌దయాళ్‌జీ ప్రతిపాదించిన ‘ఏకాత్మ మానవ వాదం’. ప్రతి వ్యక్తి సర్వాంగణ వికాసమే లక్ష్యంగా మన ఆర్థిక, సామాజిక, రాజకీయ విధివిధానాలు రూపొందినప్పుడు సర్వశ్రేష్ఠ భారత నిర్మాణం సాధ్యమని భారతీయ జనతాపార్టీ ప్రగాఢ విశ్వాసం. ‘ఏకాత్మ మానవ వాదా’న్ని సైద్ధాంతిక భూమికగా స్వీకరించి ఆ మార్గంలో పయనిస్తోంది బిజెపి. పండిట్ దీన్‌దయాళ్ ఒక ఋషి, జీవన సర్వస్వం అర్పించిన త్యాగశీలి, ఒక పరిశోధకుడు, ఒక సిద్ధాంతకర్త, ఒక దారిదీపం, ఒక రాజనీతిజ్ఞుడు, సంఘటనాదక్షుడు, మేధాసంపన్నుడు, సుఖదుఃఖాలను అధిగమించిన స్థితప్రజ్ఞుడు, నిరాడంబర జీవి. కోట్లాది మందికి ఆయన స్ఫూర్తిప్రదాత.


కాశ్మీర్‌లో సత్యాగ్రహం చేసిన డాక్టర్‌ ముఖర్జీ అనుమానాస్పదంగా మరణించారు. 1967లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత పార్టీ బాధ్యతలు భుజాన వేసుకొని విజయ పథంలో నడిపించారు దీన్‌దయాళ్. జనసంఘ్ ఆ తర్వాత కాలంలో బీజేపీగా రూపాంతరం చెందింది ఏకధాటిగా కాకుండా వినేవారు సులభంగా గ్రహించేలా ఉపన్యాసం చేస్తే ఎవరైనా సులువుగా అర్థం చేసుకుని ఆచరిస్తారు. నాయకుడు పరిగెత్తకుండా నెమ్మదిగా నడుస్తూ అందరినీ తనతో నడిపించాలి. నాయకుడి వెనకపాదం వద్ద అనుచరుడి ముందు పాదం ఉండే విధంగా ముందు నడవాలి. క్రమంగా వేగాన్ని పెంచుకుంటూ పోతే అందరూ నాయకుడి వెంటే నడుస్తారు. అందనంత వేగంగా నాయకుడు దూసుకుపోతే ఆయన వెనకాల ఎవ్వరూ రారు. నడుస్తూ నడిపించగలవాడే నాయకుడు. ఎదిగిన కొద్దీ ఎలా ఒదిగి ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడిన వ్యక్తి పండిత్ దీనదయాళ్‌ ఉపాధ్యాయ.

చందు సాంబశివ రావు 

అధికార ప్రతినిధి, ఏపీబీజేపీ

Updated Date - 2020-09-25T06:17:52+05:30 IST