స్ఫూర్తి ప్రదాత

ABN , First Publish Date - 2021-06-22T06:10:37+05:30 IST

భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించి, దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన క్రీడాకారుడు మిల్కాసింగ్‌. పాకిస్థాన్‌ సైనికపాలకుడు...

స్ఫూర్తి ప్రదాత

భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించి, దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన క్రీడాకారుడు మిల్కాసింగ్‌. పాకిస్థాన్‌ సైనికపాలకుడు అయూబ్‌ఖాన్‌తో ‘ఫ్లయింగ్‌ సిఖ్‌’గా ప్రశంసలు అందుకున్న ఈయన ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల్లో నాలుగు బంగారు పతకాలు సాధించడం సులభంగా జరిగినదికాదు. కఠోర శ్రమ, నిండైన ఆత్మవిశ్వాసం, పరాజయాలకు ఎదురొడ్డి పోరాడే ధైర్యం కలగలిసిన రూపం మిల్కాసింగ్‌. 


సైన్యంలో చేరేందుకు, ఆనక అథ్లెట్‌గా నిరూపించుకోవడానికి మిల్కా పడిన కష్టం కఠిన శ్రమకన్నా ఎక్కువే. బూట్లు కూడా లేకుండా యమునా నది ఇసుక తిన్నెల్లో, రాళ్లు రప్పలతో కూడిన పర్వత శ్రేణుల్లో, భుజంపై బరువులతో, వేగంగాపోయే రైళ్లతో పోటీపడి పరిగెత్తేవాడు, ఆ క్రమంలో రక్తపు వాంతులు చేసుకొనేవాడు. అయినా అతడు భయపడలేదు, సాధన మానలేదు. కాబట్టే తన లక్ష్యమైన సైన్యంలో ప్రవేశంతోపాటు, అథ్లెటిక్స్‌లోనూ మొనగాడుగా నిలిచిపోయాడు. ఈ శ్రమ వెనుక మిల్కా చిన్ననాటి కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. అవిభాజ్య భారత్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో రాజపుత్ర వంశంలో మిల్కా ‌ జన్మించాడు. దేశ విభజన సందర్భంగా సంభవించిన ఘర్షణలలో కుటుంబీకులందరినీ కోల్పోయి భయానక పరిస్థితుల నడుమ ఢిల్లీ చేరాడు. శరణార్థిగా ఎన్నో కష్టాలుపడ్డాడు. పొట్టకూటికోసం దొంగతనాలు చేసి జైలుకెళ్లిన స్థితి. బాల్యం, యవ్వనంలో ఎదురైన కఠిన పరిస్థితులు మిల్కాసింగ్‌ను రాటుదేల్చాయి. సైన్యంలో చేరాలన్న లక్ష్యాన్ని నాలుగో ప్రయత్నంలో కానీ అందుకోలేకపోయినా, అది  అతడి జీవితంలో ఓ మేలి మలుపు. 1952లో సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ మెకానికల్‌ ఇంజనీర్స్‌ (ఈఎంఈ) కేంద్రంలో సిపాయిగా ఉద్యోగ నిర్వహణకు వచ్చిన మిల్కాసింగ్‌ అథ్లెటిక్‌ కెరీర్‌కు అడుగులు ఇక్కడే పడ్డాయి. సిపాయిగా కందకాలు తవ్వడం, రోడ్లు వేయడం, అంట్లు తోమడం వంటి పనులు చేయాల్సి వచ్చేది. వీటిని తప్పించుకొనేందుకు క్రీడలవైపు మళ్లాడు. అలా ఆరు మైళ్ల రేసులో సాధన ప్రారంభించాడు. సికింద్రాబాద్‌లోని అమ్ముగూడాలో నివసించిన మిల్కాసింగ్‌ ఆ ప్రాంతం నుంచి వెళ్లే స్టీమ్‌ రైళ్లతో పోటీపడి పరుగెత్తడం చూసి స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు. బ్రిగేడియర్‌ ఎస్పీ వోహ్రా ప్రోద్బలంతో, హవల్దార్‌ గురుదేవ్‌ సింగ్‌ శిక్షణలో మిల్కాసింగ్‌ తిరుగులేని అథ్లెట్‌గా రూపుదిద్దుకొని అనంతరకాలంలో రోమ్‌ విశ్వక్రీడలు సహా ఎన్నో అంతర్జాతీయ పోటీలలో ఘన విజయాలు సాధించాడు. 


1958లో ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన ఏడాదే సైన్యం అతడికి జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పించింది. నాలుగు దశాబ్దాల తర్వాత అర్జున అవార్డును ప్రకటించడంతో మిల్కా దానిని స్వీకరించేందుకు నిరాకరించాడు. 1964లో అథ్లెటిక్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మిల్కాసింగ్‌ తదనంతర కాలంలో పంజాబ్‌ క్రీడా శాఖ డైరెక్టర్‌గా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. అంతర్జాతీయ అథ్లెట్‌గా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఆడంబరాలకు దూరంగా చండీగఢ్‌లో సాధారణ జీవితాన్నే గడిపాడు. తన కెరీర్‌లో 80 రేసుల్లో పాల్గొని 77 రేసుల్లో విజయాలు సాధించిన మిల్కాసింగ్‌ ఆ పతకాలన్నింటినీ ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియానికి విరాళంగా ఇచ్చేశాడు. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను ‘రేస్‌ ఆఫ్‌ మై లైఫ్‌’లో అక్షరబద్ధం చేశాడు. మిల్కా జీవితం ఆధారంగా రూపొందిన ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ హిందీ చిత్రం ఘన విజయం సాధించింది. మరెవరైనా అయితే భారీ మొత్తంలో డబ్బు తీసుకొనేవారేమో కానీ మిల్కా కేవలం రూపాయి పారితోషికంగా స్వీకరించాడు. తనలాగే క్రీడల్లో ప్రతిభావంతురాలైన నిర్మల్‌కౌర్‌ను మిల్కా ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. భారత వాలీబాల్‌ జట్టు సారథి అయిన నిర్మల్‌, మిల్కా కులాలు వేరు. అందులోనూ ఆమె తండ్రి చౌధురి మెహర్‌ చంద్‌ సైనీ ప్రముఖుడు కావడంతో వీరిద్దరి వివాహానికి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరకు నాటి పంజాబ్‌ సీఎం ప్రతాప్‌సింగ్‌ కైరాన్‌ జోక్యంతో 1962లో మిల్కా, నిర్మల్‌ వివాహం జరిగింది. 


కరోనావైరస్‌ కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ దంపతులను కబళించి దేశ క్రీడారంగంలో పెను విషాదాన్ని మిగిల్చింది. నెల రోజుల్లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మిల్కాసింగ్‌ను స్ఫూర్తిగా తీసుకొని పతకాలు సాధించడమే ఆ దిగ్గజ అథ్లెట్‌కు అసలైన నివాళి.

Updated Date - 2021-06-22T06:10:37+05:30 IST