నవభారత్‌కు స్ఫూర్తిప్రదాత

ABN , First Publish Date - 2022-01-12T06:43:50+05:30 IST

ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్త, మార్గదర్శకుడు, మానవతావాది, తత్వవేత్త, సంఘసంస్కర్త, సమాజ సేవకుడు, దార్శనికుడు స్వామి వివేకానంద....

నవభారత్‌కు స్ఫూర్తిప్రదాత

ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్త, మార్గదర్శకుడు, మానవతావాది, తత్వవేత్త, సంఘసంస్కర్త, సమాజ సేవకుడు, దార్శనికుడు స్వామి వివేకానంద. యువతలో ఆత్మన్యూనతా భావాలు, నిరాశా నిస్పృహలను పారద్రోలి యువశక్తికి నిత్యం ప్రేరణ కలిగించే మహనీయుడుగా ఆయన ప్రపంచ దేశాల మన్ననలను పొందారు. చిన్నతనంలో నరేంద్రనాథ్‌ దత్‌గా పిలువబడి రామకృష్ణ పరమహంస శిష్యరికంలో వేదాంత, యోగ తత్త్వ శాస్త్రాలలో పారంగతుడై, సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానంద.


వివేకానందుడు గొప్ప తాత్వికుడు. ఆయన ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్త్వశాస్త్రంలోనే కాకుండా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో ‘జీవుడే దేవుడు’ అనేది అతని మంత్రంగా మారింది. ‘దరిద్ర నారాయణ దేవోభవ’, ‘మూర్ఖ దేవో భవ’ అని పేదవారిని, రోగులను నారాయణునితో పోల్చుతూ వారిని సేవించమని, మూర్ఖులకు అండగా నిలవమని, కుల, మత, వర్ణ, లింగ, జాతి, భాషా, ప్రాంతీయ భేదాలన్నింటినీ పటాపంచలు చేసి మనిషిని మనిషిగా చూడాలనే సంఘసంస్కర్త, సమాజ సేవకుడు వివేకానంద.


వివేకానందుడికి ఆకాశమంత ఎత్తున కీర్తిప్రతిష్ఠలను సంపాదించి పెట్టిన లక్షణమే చైతన్య నాయకత్వం. చచ్చుబడిపోయిన స్ఫూర్తితో జీవించడం మరణంతో సమానం. తన చేతుల్లో ఉండే సామర్థ్యాన్ని మనిషి వినియోగించుకోలేకపోవడం ఏకంగా అతడి నేరమే అవుతుంది. అవరోధాలను అవలీలగా అధిగమించగలిగే శక్తి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కానీ, అంతర్‌దృష్టి కోల్పోయినప్పుడు అతడు గుడ్డివాడై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. ఫలితంగా నిస్తేజం, నిర్వీర్యం, నిరాసక్తత అతని నరనరాల్లో చేరుతాయి. అతడు అప్పుడు తనకు మాత్రమే కాక మొత్తం సమాజానికి సమస్యగా మారతాడు. ఇదెంత మాత్రమూ క్షేమకరం కాదు. కాబట్టి, సమస్యతో సతమతమవుతున్న ప్రతి మనిషి మనసును, హృదయాన్ని ప్రతిచోటా, అవసరమైన ప్రతి సందర్భంలో ఇతరులు ఉన్నతాశయాలతో శుభ్రపరచాలి. విలువైన జీవితం పట్ల ఆశాభావ దృక్పథాన్ని కలుగచేయాలి. అలా చేయడం అందరి కర్తవ్యంగా రూపొందించాలి. ఇదే వివేకానందుడి తత్వం.


స్వామి వివేకానంద నాయకత్వాన్ని ఆదర్శంగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగాలలో యువతను ప్రోత్సహిస్తుంటారు. భారతీయ యువజనుల ప్రతిభా పాటవాలను వెలికితీయడానికి మోదీ ప్రభుత్వం నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ ఫెస్టివల్‌, టార్గెట్‌ ఒలంపిక్‌ పోడియం స్కీం(టాప్స్‌), నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ, నేషనల్‌ యూత్ ఫెస్టివల్‌, కల్చరల్‌ హెరిటేజ్‌ యూత్‌ లీడర్ షిప్ ప్రోగ్రాం, ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌, యువ- ప్రైమ్‌ మినిస్టర్‌ స్కీం ఫర్‌ మెంటరింగ్‌ యంగ్‌ ఆథర్స్‌ ఇలా అనేక కార్యక్రమాలు, పథకాలు అమలుపరుస్తోంది.


నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ లాంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు స్వామి వివేకానంద ప్రేరణగా నిలిచారు. ఎంతో మంది వీరుల ప్రాణ త్యాగం ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను జరుపుకుంటున్నాం. మరి ఈ తరుణంలో వివేకానందుడి నుంచి స్వీకరించిన స్ఫూర్తిని మనం ఏ మేరకు ఆచరణలో పెడుతున్నాం, మన జీవితాలకు ఎలాంటి విలువలను ఆపాదిస్తున్నాం అన్న అంశాలను క్షుణ్ణంగా విశ్లేషించుకోవలసిన సందర్భమిది.

శ్రీశైలం వీరమల్ల (ఉస్మానియా యూనివర్సిటీ)

(నేడు స్వామి వివేకానంద జయంతి)

Updated Date - 2022-01-12T06:43:50+05:30 IST