జిల్లాలో ఎఫ్‌సీఐ అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-05-03T06:23:13+05:30 IST

జిల్లాలోని రైస్‌ మిల్లులో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలను మొదలుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు పది బృందాలుగా ఏర్పడి రైస్‌ మిల్లుల తనిఖీలు చేపడుతున్నారు. గతేడాది వానాకాలం, యాసంగిలో ఇచ్చిన ధాన్యం నిల్వలను సరిచూస్తున్నారు. కస్టమ్‌ మిల్లింగ్‌ చేసిన ధాన్యాన్ని మినహాయించి నిల్వలను పరిశీలించడంతో పాటు మిల్లుల ఆధారంగా నివేదికలను సిద్ధం చేస్తున్నారు.

జిల్లాలో ఎఫ్‌సీఐ అధికారుల తనిఖీలు

రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వల పరిశీలన

ఐదు రోజుల పాటు కొనసాగనున్న తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా పది బృందాలుగా ఏర్పడిన అధికారులు

అప్రమత్తమైన మిల్లు యజమానులు

నిజామాబాద్‌, మే 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని రైస్‌ మిల్లులో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలను మొదలుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు పది బృందాలుగా ఏర్పడి రైస్‌ మిల్లుల తనిఖీలు చేపడుతున్నారు. గతేడాది వానాకాలం, యాసంగిలో ఇచ్చిన ధాన్యం నిల్వలను సరిచూస్తున్నారు. కస్టమ్‌ మిల్లింగ్‌ చేసిన ధాన్యాన్ని మినహాయించి నిల్వలను పరిశీలించడంతో పాటు మిల్లుల ఆధారంగా నివేదికలను సిద్ధం చేస్తున్నారు. గతంలో చేపట్టిన తనిఖీల్లో సాలూరాలో నిల్వల్లో తేడా ఉండడంతో ఈ దఫా అన్ని మిల్లుల్లో తనిఖీలు చేపడుతున్నారు.

రెండు నెలల క్రితమే తనిఖీలు..

జిల్లాలో రెండు నెలల క్రితమే అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే రైస్‌మిల్లులో నిల్వ ఉన్న ధాన్యంలో తేడాలు రావడంతో ఈ దఫా జిల్లాలోని 260 మిల్లుల్లో తనిఖీలు చేపట్టనున్నారు.  రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ తనిఖీలను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని నిజామాబాద్‌ రూరల్‌, నవీపేట మండలం పరిధిలోని మిల్లులను సోమవారం ఈ బృందాలు తనిఖీలు చేశారు. ప్రతి బృందంలో ఎఫ్‌సీఐకి చెందిన ఒక అసిస్టెంట్‌ మేనేజర్‌, ఒక క్వాలిటీ కంట్రోలర్‌ అధికారితో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు. గత రెండు సీజన్‌లలో ఇచ్చిన ధాన్యం నిల్వల నివేదికలను తీసుకుని మిల్లుల వారీగా ఈ తనిఖీలు చేపట్టారు.

సామర్థ్యం ఆధారంగా కేటాయింపులు..

జిల్లాలో ప్రతీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లింగ్‌ కోసం మిల్లులకు కెపాసిటీ ఆధారంగా కేటాయింపులను చేస్తున్నారు. మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్‌ చేసి కస్టమ్‌ మిల్లింగ్‌ కింద క్వింటాకు ఎఫ్‌సీఐకి బియ్యాన్ని ఇవ్వాలి. గత రెండు సీజన్‌లలో కస్టమ్‌ మిల్లింగ్‌ ఇంకా పూర్తికాలేదు. ఇంకా ఎక్కువ సమయం అడగడంతో రెండు నెలల క్రితం కొన్ని మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేయగా సాలూరాలోని ఒక మిల్లులో 38 వేల క్వింటాళ్లకు పైగా తేడా వచ్చింది. ఆ మిల్లు యజమానికి నోటీసులు ఇవ్వడంతో పాటు చర్యలకు ఉపక్రమించారు. ఎఫ్‌సీఐకి నిబంధనల మేరకు బియ్యం సప్లయి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి సీజన్‌లో సన్న, దొడ్డు రకాలను కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసి మిల్లులకు పంపిస్తున్నారు. కొన్ని మిల్లుల్లో సన్న రకాలను ముందుగానే మిల్లింగ్‌ చేసి డిమాండ్‌ మేరకు బయటి మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్నారు. కస్టమ్‌ మిల్లింగ్‌ ప్రకారం ఇతర ధాన్యం కొనుగోలు చేసి నిర్ణీత సమయంలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు సంవత్సరంన్నర వరకు కూడా అందించడంలేదు. మిల్లింగ్‌లో ఆలస్యం కావడంతో పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఎఫ్‌సీఐ అధికారులు ఈ దఫా పది బృందాలుగా తనిఖీలు చేపడుతున్నారు.

ధాన్యం నిల్వల పరిశీలన..

ఎఫ్‌సీఐ బృందం అధికారులు మిల్లులకు వెళ్లిధాన్యం నిల్వలను మొదట పరిశీలిస్తున్నారు. ఆ మిల్లులకు గత యాసంగి, వానాకాలంలో ఎంత కేటాయించారో వివరాలను పరిశీలించి ఇంకా ఎంత ధాన్యం నిల్వ ఉండాలో లెక్క తీస్తున్నారు. ఇప్పటి వరకు మిల్లింగ్‌ అయిన ధాన్యానికి అనుగుణంగా కస్టమ్‌ మిల్లింగ్‌ కింద బియ్యం ఎఫ్‌సీఐకి పంపించారో పరిశీలిస్తున్నారు. తేడాలు ఉంటే నమోదు చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నారు. జిల్లాలో ఐదు రోజుల పాటు ఉండి అన్ని మిల్లులు తనిఖీ చేసి నివేదికలు అందించనున్నట్లు అధికార వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. తేడాలు ఉన్న మిల్లులపై చర్యలు చేపట్టడంతో పాటు బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశం ఉంది. ఎఫ్‌సీఐ అధికారుల తనిఖీలు ముందే నిర్ణయించడంతో మిల్లుల యజమానులు కూడా ముందస్తుగానే అన్ని సిద్ధం చేసుకున్నారు. గతంలో ఇచ్చిన నిల్వలకు అనుగుణంగానే ధాన్యం ఉండేవిధంగా చూసుకున్నట్లు సమాచారం. అయితే కొన్ని మిల్లుల్లోనే తేడాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమకు ఉన్న పరిచయాల ఆధారంగా ముందస్తుగా మిల్లుల యజమానులు ఏర్పాట్లు చేసుకోవడంతో కొంతమేర ఇబ్బందులు తప్పినట్లు తెలుస్తోంది. 

జిల్లాలో ఐదు రోజుల పాటు ఎఫ్‌సీఐ బృందాలు తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశం తెలిపారు. జిల్లాలోని రైస్‌ మిల్లుల్లో వారు తనిఖీలను కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. ఐదు రోజుల తర్వాత ఎన్ని మిల్లులపై ఎఫ్‌సీఐ అధికారులు చర్యలు చేపట్టనున్నారో తేలే అవకాశం ఉంది.

Read more