Abn logo
Aug 11 2020 @ 03:57AM

అంతా అయ్యాక.. హడావుడి!

ఆంధ్రజ్యోతి, విజయవాడ: కొవిడ్‌కేర్‌ సెంటర్ల తనిఖీల్లో చూస్తుంటే చేతులు కాలాకా ఆకులు పట్టుకు న్నట్టుంది. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులకు అనుబం ధంగా నిర్వహిస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్ల(హోటళ్లు)లో అధికారులు తనిఖీల పేరుతో హడావిడి చేశారు. ఆదివారం స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందిన  నేపథ్యంలో సోమవారం నగర వ్యాప్తంగా 20కిపైగా కొవిడ్‌కేర్‌ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. అగ్నిమాపక అనుమతులు ఉన్నాయా.. నిర్దేశిత అనుమతి మేరకే బెడ్లను ఏర్పాటు చేశారా.. వంటి అంశాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తర్వాత హడావిడి చేయడం కాకుండా హోటళ్లలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమ తులిచ్చే ముందే ఇలాంటి తనిఖీలు జరిగితే 10 మంది ప్రాణాలు దక్కేవన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు అధికారుల హడావుడితో ఆసుపత్రి యాజమాన్యాలు చాలా హోటళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు.


హోటళ్లలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను ఆగమేఘాలపై డిశ్చార్జి చేసి ఇళ్లకు వెళ్లిపోవాలని కోరారు. దీంతో పలువురు బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  జిల్లాలో మొత్తం 24 ప్రైవేటు ఆసుప్రతులకు కరోనా సేవలకు ప్రభుత్వం అనుమ తులు ఇచ్చింది. వీటిలో 822 బెడ్లను ఏర్పాటు చేసుకు నేందుకు అవకాశం కల్పించింది. తమ ఆసుపత్రుల్లో  ఎక్కువ మంది కొవిడ్‌ బాధితులను ఉంచి వైద్య సేవలు అందించలేమని, అనుబంధంగా హోటల్స్‌ను అద్దెకు తీసుకుని కొవిడ్‌కేర్‌ సెంటర్‌ పేరుతో నిర్వహించు కుంటామని కోరడంతో ఆ మేరకు జిల్లా యంత్రాంగం అనుమతులిచ్చింది. అనుమతులు ఇచ్చే సమయంలోనే అన్ని శాఖలూ సమన్వయంతో వ్యవహరించి హోటళ్లను తనిఖీ చేసి ఉంటే బాగుండేది. ఘోర విషాదం చోటుచేసుకున్న తర్వాత ఇప్పుడు హడావుడి చేయడం మొదలుపెట్టారు. అనుమతులు మంజూరు చేసే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు కూడా దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారా..

ప్రజల్లో నెలకొన్న కరోనా భయాన్ని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటు న్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. చాలామంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాకున్నా తమకు కరోనా వస్తుందేమోనన్న భయంతో కూడా ఆసుపత్రులకు పరు గులు తీస్తున్నారు. ఆసుపత్రిలో చేర్చుకోవాలంటూ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. దీన్ని ప్రయివేటు ఆస్పత్రు లకు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఆదివారం జరిగిన దుర్ఘటనలో మరణించిన ఒక వ్యక్తి జ్వరంగా ఉండటంతో  ఆగస్టు 5న కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నారు. ఆ ఫలితం రాకముందే ఆగస్టు 6న హడావుడిగా విజయవాడ వచ్చి ఆసుపత్రిలో చేరిపోయారు. కరోనాకు సంబంధించిన లక్షణాలున్నా ఆరోగ్యవంతులు ఇంటి వద్దే హోం ఐసోలే షన్‌లో ఉండి కోలుకున్న ఉదంతాలు కోకొల్లలు. కానీ ఎవ్వరూ రిస్క్‌ తీసుకోవడం ఎందుకులే అని కొందరు ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఆసుపత్రుల్లోనే చికిత్స తీసుకునేందుకు ప్రయివేటు వైద్యశాలలకు వెళుతున్నారు.ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రయివేటు ఆసుపత్రుల దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. 

Advertisement
Advertisement
Advertisement