కోర్టు ఏర్పాటుకు భవనాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్, ఎంపీడీవో, బార్‌అసోసియేషన్ సభ్యులు
ఆమనగల్లు, మే 18: ఆమనగల్లులో జూనియర్ సివిల్ జడ్జి, ఎంఎం కోర్టుల ఏర్పాటుకు జిల్లా కోర్టు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు కోర్టు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా జడ్జి సీహెచ్ భూపతి ఆదేశానుసారం బుధవారం తహసీల్దార్ పాండునాయక్, ఎంపీడీవో వెంకట్రాములు, కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణయ్య, న్యాయవాదులు కోర్టు ఏర్పాటుకు భవనాలను పరిశీలించారు. ఆమనగల్లు మండల పరిషత్ ఆవరణలోని పాత భవనం కోర్టుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. 2016లో ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలిశాయి. ఈ నాలుగు మండలాలకు జూనియర్ సివిల్ కోర్టు కోసం ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వాన్ని, న్యాయ శాఖను కోరారు. ఈ నాలుగు మండలాల్లో ఏటా 2500 నుంచి 3వేల వరకు సివిల్, క్రిమినల్ కేసులు కల్వకుర్తికి కోర్టుకు వెళ్తున్నాయి. ఆమనగల్లులో కోర్టు అవశ్యకతపై న్యాయవాదులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో లాయర్లు జగన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.