Abn logo
Sep 17 2020 @ 03:39AM

ఏది ‘ఇన్‌సైడ్‌’?.. అమరావతిపై ప్రచారంలో నిజమెంత?

2014కంటే 2012లోనే అధిక రిజిస్ట్రేషన్లు

2013లోనూ అదేస్థాయి క్రయవిక్రయాలు

అసలైన ‘ఇన్‌సైడ్‌’ వైఎస్‌ హయాంలోనే!

ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వెంట భూముల కొనుగోలు

భూసేకరణ పేరిట కోకాపేటలో కాసుల వర్షం


ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌... రాజధాని అమరావతి భూముల విషయంలో వైసీపీ సర్కారు పెద్దలు తెరపైకి తెచ్చిన మాట ఇది! గత ప్రభుత్వ హయాంలో ఫలానా ప్రాంతంలో రాజధాని వస్తోందని తెలుసుకున్న వారు, అక్కడ ముందుగానే భూములు కొని లబ్ధి పొందారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపైనే మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన, సిట్‌ దర్యాప్తు... ఇంకా అదనంగా వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసులు! నిజంగా... అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందా? రాజధాని ప్రకటనకు ముందు గ్రామాల్లో భారీ ఎత్తున భూముల లావాదేవీలు చోటుచేసుకున్నాయా? 


అమరావతిపై ప్రచారంలో నిజమెంత?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆంధ్రుల కలల రాజధానిగా తెరపైకి వచ్చిన ‘అమరావతి’ని అర్ధంతరంగా ఆపివేశారు. తొలుత... ఖర్చు ఎక్కువన్నారు. తర్వాత... ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. ఇప్పుడు... పరిపాలన వికేంద్రీకరణ అంటున్నారు. అమరావతి ప్రాజెక్టును అటకెక్కించాలన్న ఏకైక లక్ష్యంతో పలురకాల కారణాలు తెరపైకి తెస్తున్నారన్నది విపక్షాల విమర్శ! అందులో... ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట గిట్టని వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం కూడా మొదలైంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే... రాజధాని గ్రామాల్లో భూములు కొనడమే నేరం అన్నట్లుగా అమ్మిన వారి, కొన్న వారందరిపైనా ప్రభుత్వం కన్నేసి ఆరాలు తీస్తోంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగి ఉంటే... ఆ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా లావాదేవీలు జరిగి ఉండాలి. కానీ... రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రాజధాని ప్రకటన జరిగేదాకా అక్కడ అసాధారణ స్థాయిలో భూముల క్రయవిక్రయాలు జరగనే లేదు. 2012, 2013లతో పోలిస్తే 2014లో జరిగిన రిజిస్ట్రేషన్లు ఎక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే 2014కంటే 2012లోనే ఎక్కువ లావాదేవీలు జరిగాయి. 


ఎక్కడేం జరిగింది?

రాజధాని ప్రాంతంలోకి వచ్చిన గ్రామాలు అంతకుముందు వేర్వేరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఉండేవి. రాజధానిగా ప్రకటించిన రెండేళ్లకు తుళ్లూరులో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి ఆ గ్రామాలన్నింటినీ దాని పరిధి కిందకు తీసుకొచ్చారు. రాజధానిగా ప్రకటించక మునుపు నుంచీ అక్కడ భూలావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు... 2012లో అమరావతి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో 3340 ఎకరాల క్రయవిక్రయాలకు సంబంధించి 2622 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. 2013లో అదే అమరావతి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో 1922 ఎకరాల క్రయవిక్రయాలకు సంబంధించి 1518 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. 2014లోనూ 3601 ఎకరాలకు సంబంధించిన 3038డాక్యుమెంట్లు జరిగాయి. అంటే... దాదాపుగా 2012లో జరిగినన్ని ఎకరాల కొనుగోళ్లు, అమ్మకాలే 2014లోను జరిగాయి. ఇదే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన లావాదేవీలను మరింత లోతుగా పరిశీలించి చూద్దాం. 2014లో ఎన్నికల ఫలితాలు వచ్చిన మే 17 నుంచి సెప్టెంబరు 3న అసెంబ్లీలో విజయవాడ ప్రాంతంలో రాజధాని అని ప్రకటించే వరకు ఇక్కడ 896 ఎకరాల క్రయవిక్రయాలు జరిగాయి. 2013లో ఇదే నాలుగు నెలల్లో    573 ఎకరాలు రిజిస్టర్‌ అయ్యాయి. 2012లో ఇదేకాలంలో 1278ఎకరాల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. వెరసి... 2014లో గతానికి భిన్నంగా భారీగా భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరగలేదని ఈ అంకెలు స్పష్టం చేస్తున్నాయి. ఇక... తుళ్లూరు కోర్‌ క్యాపిటల్‌గా వస్తుందని అక్టోబరు 31వ తేదీన ప్రకటించారు. ఈ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే... 2012లో ఇక్కడ 639ఎకరాల క్రయ విక్రయాలు జరిగాయి.  2014లో 813 ఎకరాల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ర్టేషన్‌లు జరిగాయి. అంటే 2012తో పోలిస్తే 2014లో జరిగిన క్రయ విక్రయాలు 172 ఎకరాలు మాత్రమే అధికం. అది కూడా రాజధాని ప్రాంతం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటుందని ప్రకటించడం వల్ల ఏదైనా రేటు పెరుగుతుందని రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి కొనుగోలు చేయడం వల్ల పెరిగిందే. అలాకాక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఉండుంటే వేల ఎకరాలు చేతులు మారేవి.


వైసీపీ నేతలూ కొనుగోలు చేశారు

ఎక్కడైనా ఒక ప్రాజెక్టు వస్తుందంటే ఆ ప్రాంతంలో పెట్టుబడి పెట్టి ఎంతో కొంత భూమిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపే వారు ఎందరో ఉంటారు. మధ్య తరగతి నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాళ్ల వరకు... దీనిపై దృష్టిసారిస్తారు.  అదే క్రమంలో విజయవాడ చుట్టుపక్కల రాజధాని అని ప్రకటించాక... పలువురు ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. రాష్ట్ర విభజన జరిగితే... విజయవాడ-మంగళగిరి మధ్యే రాజధాని ఉంటుందనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ఇదే మాట చెబుతూ కొన్నేళ్లపాటు గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఫలానా చోట రాజధాని రావచ్చునంటూ అనేక ఊహాగానాలు, అంచనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా నూజివీడువైపు కూడా కొందరు భూములు కొన్నారు. ఇలా పలు చోట్ల భూములు కొన్న వారిలో ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులూ ఉన్నారు.  రాజధాని వస్తే కొంత విలువ పెరుగుతుందేమో అన్న ఉద్దేశంతో పావు ఎకరం నుంచి రెండు మూడెకరాల వరకు భూములు కొన్న సామాన్యులు ఎందరో ఉన్నారు. ఇంత చేసినా... అంతకుముందు రెండేళ్లతో పోల్చితే, 2014-15లో జరిగిన భూ క్రయ విక్రయాలు అసాధారణ రీతిలో లేకపోవడం ఇక్కడ గమనార్హం.


‘ఔటర్‌’లో అసలైన ‘ఇన్‌సైడ్‌’ 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనగానే గుర్తుకొచ్చేది... వైఎస్‌ హయాంలో హైదరాబాద్‌లో జరిగిన ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వ్యవహారమే. ఓఆర్‌ఆర్‌ ఎలా వెళ్తుందో (అలైన్‌మెంట్‌) ముందుగానే తెలిసిన నాటి ప్రభుత్వ పెద్దలు నాటి దారిలో ఎంచక్కా భూములు కొని భారీ లబ్ధి పొందారు. వైఎస్‌ బంధువులు సరిగ్గా రింగ్‌రోడ్డుకు పక్కనే ఉండేలా భూములు కొనుగోలుచేశారు. అప్పుడు ఇంకో విచిత్రం కూడా జరిగింది. ‘కోకాపేట’ పేరు అందరికీ తెలిసిందే. అక్కడ ప్రభుత్వం వేలం వేస్తే అప్పట్లోనే ఎకరం రూ.14కోట్లు పలికింది. సరిగ్గా ఆ వేలానికి కొన్ని నెలల ముందే అక్కడ అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. ‘మీ భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది’ అంటూ పలువురు రైతులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అప్పటి భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు చాలా తక్కువ పరిహారం వచ్చేది. ఆ ప్రకారం చూసుకుంటే ఎకరాకు రూ.20-25లక్షలకు మించిరావని, తమకు అమ్మేస్తే రూ.50లక్షలు ఇస్తామని రాజకీయ నేతలు రంగంలోకి దిగారు. దీంతో రైతులు తమ భూముల్ని అమ్మేసుకున్నారు. ఇలా రైతుల నుంచి భారీ స్థాయిలో నేతలు భూములను కొనేశారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటీసును రద్దు చేసింది. కొన్ని నెలలకే అక్కడ భూమిని ప్రభుత్వమే వేలం వేస్తే రూ.14కోట్లు పలికింది. ఇక... భూసేకరణ బూచి చూపించి రైతుల నుంచి నేతలు కొన్న భూముల ధరలూ భారీగా పెరిగాయి. ‘ఇన్‌సైడ్‌’ సమాచారం ఉంటే తప్ప ఇలాంటి వ్యవహారాలు జరగవు. ఈ తరహా ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ అమరావతిలో జరగనే లేదని అక్కడ జరిగిన లావాదేవీలు చూస్తేనే తెలుస్తుంది.


‘ఇన్‌సైడర్‌’ అంటే...

నిజానికి... ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ అనేది షేర్‌మార్కెట్‌కు సంబంధించిన మాట! ఒక కంపెనీకి సంబంధించిన ‘ఇన్‌సైడ్‌’ విషయాలు అందులో ఉన్న వారికి తెలుస్తాయి. దాని ఆధారంగా ముందుగానే షేర్లు కొనడం లేదా అమ్మడం ద్వారా భారీ లబ్ధి పొందడాన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని పిలుస్తారు. 

Advertisement
Advertisement
Advertisement