ఢీ అంటే ఢీ అంటున్న వారసులు.. వారి ఆశ ఫలించేనా?!

ABN , First Publish Date - 2020-09-23T17:31:33+05:30 IST

వాళ్లిద్దరూ మాజీ మంత్రుల కుమారులు. వారిలో ఒకరు టీడీపీ నుంచి బీజేపీలోకి, మరొకరు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరారు. రాజకీయ వారసులుగా ఎంట్రీ ఇచ్చినవారు..

ఢీ అంటే ఢీ అంటున్న వారసులు.. వారి ఆశ ఫలించేనా?!

వాళ్లిద్దరూ మాజీ మంత్రుల కుమారులు. వారిలో ఒకరు టీడీపీ నుంచి బీజేపీలోకి, మరొకరు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరారు. రాజకీయ వారసులుగా ఎంట్రీ ఇచ్చినవారు.. గతంలో తమ తండ్రుల మధ్య సాగిన పొలిటికల్ వార్‌ని కూడా వారసత్వంగా స్వీకరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. అందుకోసం నియోజకవర్గంలో పట్టు కోసం వారు కుస్తీకి దిగారు. దీంతో అక్కడ రాజకీయం కాస్తా వేడెక్కింది. ఇంతకీ ఆ రాజకీయ వారసులు ఎవరు? ఆ నియోజకవర్గంలో వారి బలాబలాలు ఎలా ఉన్నాయి? ఆసక్తికర విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


ఢీ అంటే ఢీ అంటున్న వారసులు..

కోల్ బెల్ట్ కొత్తగూడెం నియోజకవర్గంలో సత్తా చాటేందుకు ఇద్దరు రాజకీయ వారసులు ఢీ అంటే ఢీ అంటున్నారు. మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ... మాజీమంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు చిన్ని అలియాస్ కోనేరు సత్యనారాయణ. వీరిద్దరు ఇప్పుడు నువ్వా- నేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. నియోజకవర్గంలో పట్టుకోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. వీరి రాజకీయ నేపథ్యం పరిశీలిస్తే.. రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌లో సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి హోదా వరకు ఎదిగారు. కొత్తగూడెం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మహాకూటమి బలపర్చిన అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వనమా వయోభారం వల్ల తండ్రి బాధ్యతలన్నీ కుమారుడు రాఘవ చూసుకుంటున్నారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ అన్నీ తానై చూసుకుంటున్నారు. ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో సీటు సంపాదించేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.


అంతేస్థాయిలో కోనేరు చిన్ని దూకుడు..

కొత్తగూడెంలో పాగా వేసేందుకు ఇప్పటినుంచే ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న మరో వారసుడు కోనేరు చిన్ని. ఈ యువ లీడర్ తండ్రి కోనేరు నాగేశ్వరరావు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యనేతగా ఎదిగి ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణం తర్వాత కోనేరు చిన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవితోపాటు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు.


రాఘవ బలాలు-బలహీనతలు..

కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అధ్యక్ష అనాలని వనమా రాఘవ, కోనేరు చిన్ని తహతహలాడుతున్నారు. వీరిద్దరి బలాబలాలు చూస్తే.....రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారు. మాస్ లీడర్‌గా వనమా వెంకటేశ్వరరావుకు ఉన్న అనుచరగణం రాఘవకు కలిసొస్తుందని టాక్. భూ కబ్జా గొడవలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు, పోలీస్ పైరవీలు, మహిళలతో వివాదాలు రాఘవకు మైనస్‌ అయ్యే అవకాశముందట. గత ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించిన వనమా.. ఇప్పుడు అదే పార్టీలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందని సొంత పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు.


కోనే చిన్ని బలాలు-బలహీనతలు..

చిన్నిగా పిలువబడే కోనేరు సత్యనారాయణకు రాజకీయ అనుకూలతలు చూస్తే.. తన తండ్రి కోనేరు నాగేశ్వరరావు సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనకు ప్లస్ అయ్యే అంశంగా కనిపిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి నుంచి మరణించేవరకు ఆ పార్టీలోనే కోనేరు నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన తనయుడు చిన్ని కూడా టీడీపీలోనే ఉంటూ.. కొత్తగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులుగా, టీడీపీ జిల్లా యువత అధ్యక్షుడిగా పార్టీ పటిష్టతకు కృషి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఆయా మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఉనికి కోల్పోకుండా పార్టీ అభివృద్ధికి కృషిచేసి పలువురు కౌన్సిలర్లను గెలిపించారు. వామపక్ష పార్టీలతో పొత్తుల కారణంగా మహాకూటమిలో సీటు రాకపోయినా కమిట్‌మెంటుగా ఉన్నారనే పేరు ఉంది. ప్రజల్లో కోనేరు కుటుంబం పట్ల గౌరవం, అవినీతి మచ్చ లేకపోవడం, వివాదరహిత నాయకుడిగా కోనేరు చిన్నికి కలిసొచ్చే విషయం. నియోజకవర్గ ప్రజల్లో చిన్ని పట్ల ఉన్న సానుభూతి మరో సానుకూల అంశం. చిన్నిపై వ్యక్తిగతంగా ఆరోపణలు లేకపోవడం, మర్యాదస్తుడిగా, కూల్ పొలిటీషియన్‌గా పేరుండటం వంటి అంశాలు ఆయనకు కలిసొచ్చే అంశాలని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా చిన్ని కొనసాగుతున్నారు.


ఎవరి లెక్కలు వారివి...

టీఆర్‌ఎస్ అధిష్ఠానం దగ్గర మార్క్ లు కొట్టేసేందుకు రాఘవ విస్తృతంగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాఘవ అనుచరుల మితిమీరిన స్వామిభక్తి ఆయనకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. రాఘవ ఎమ్మెల్యే అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడం, అధికారులతో రివ్యూ మీటింగ్‌లు నిర్వహించడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చేయడం, పోలీస్ అధికారులతో లాబీయింగ్, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని రాఘవపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ముఖ్యనేత ఒకరు రాఘవ ప్రొఫైల్‌ను అధిష్టానం దగ్గరికి చేరవేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ టిక్కెట్ వస్తుందో రాదో తెలియదు కానీ.. రాఘవ మాత్రం తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఈజీగా గెలువొచ్చని లెక్కలు వేసుకుంటున్నారట. కొత్తగూడెం టీఆర్‌ఎస్ టిక్కెట్ రావాలంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేయాలని తన అనుచరులకు దిశా నిర్దేశం చేస్తున్నారట. మరోవైపు కోనేరు చిన్ని కొత్తగూడెం బీజేపీ టిక్కెట్ తనకే దక్కుతుందన్న బలమైన నమ్మకంతో ఉన్నారట. ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటిస్తూ వారితో మమేకమవుతున్నారు. అంతేకాదు రాఘవకు టీఆర్‌ఎస్ టిక్కెట్ ఖరారైతే.. తన గెలుపు మరింత సులువు అవుతుందన్న భావనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిస్టర్ క్లీన్‌గా ఉన్న తనకు రాఘవ పోటీలో ఉంటే.. తన కుటుంబ పలుకుబడి, మోదీ హవాతో గెలుపు ఖాయమని చిన్ని అంచనాలు వేస్తున్నారట. ఎన్నికల నాటికీ కోనేరు చిన్ని,  వనమా రాఘవ బరిలో ఉంటారా? రాఘవకు టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ ఆశీసులు దక్కుతాయా? కోనేరు చిన్ని పట్ల సానుభూతి వర్కవుట్ అవుతుందా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.

Updated Date - 2020-09-23T17:31:33+05:30 IST