Abn logo
Jul 26 2021 @ 20:39PM

వార్డు మెంబర్‌గా గెలవలేని Sajjala.. హోంమంత్రిని పట్టించుకోరా.. ఇకనైనా పద్ధతి మార్చుకోండి లేకపోతే..!?

ఓట్లు వేసినందుకు ఆవర్గాన్ని పెద్ద  సీట్లో కూర్చోబెట్టామని సర్కార్ గొప్పగా చెప్పుకుంటోందా? కుర్చీ వేసిన  పేరే తప్ప పెత్తనమంతా పెద్దోళ్ల కనుసన్నల్లోనే జరుగుతోందా? పదవి ఉందికదా అని పెదాల నుంచి ఏమైనా మాటొస్తే అధికారాలు కట్‌ చేసేందుకు కత్తెర పట్టుకుని కూర్చున్నారా? రోజులు గడుస్తున్నకొద్దీ అవమానాలు పెరిగిపోతుంటడంతో అసలు నిజం తెలుసుకుని ఆత్మాభిమాన ఉద్యమానికి ఓ వర్గం ఉద్యమానికి సిద్ధమవుతోందా? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


పద్ధతి మార్చుకోకుంటే..!

అధికార వైఎస్సార్‌ పార్టీలో అంతా పెద్దసారు వర్గం పెత్తనమే సాగుతోందని ఓ వర్గం రగిలిపోవాల్సివస్తోందట. రాజ్యంగబద్ద పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా పక్కకు తోసేస్తూ ఉచిత సలహాలతో సజ్జల రామకృష్ణరెడ్డి మా రాజ్యం మా ఇష్టం అన్నట్లు రెచ్చిపోతున్నారని దళితవర్గాలు ఆవేదన పడాల్సివస్తోందట. గుంటూరు జిల్లాలో ఏకైక మంత్రి, మహిళామంత్రి, దళితమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత కీలకశాఖ అయిన హోంశాఖను చూస్తున్న మేకతోటి సుచరితను సైడ్‌ చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. షాడో హోంమంత్రిగా పనిచేస్తున్నారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. పద్దతి మార్చుకోకుంటే యుద్దం ప్రకటించాల్సివస్తుందని ఇప్పటికే అంతర్గతంగా ఓ నిర్ణయానికి వచ్చాయట.

గుర్రుగా మాల మహానాడు!

కార్యాలయాల్లో కూర్చుని తెరవెనుక సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి తనకుతానుగా హోంమంత్రిగా ఫీలయ్యేవారిని, ఇప్పుడు ఏకంగా పబ్లిక్‌ మీటింగ్స్‌, ప్రారంభోత్సవాల్లోనూ నేనే హోంమంత్రిని అన్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారని మాలమహానాడు మండిపడుతోంది. తాజాగా గుంటూరు పర్యటనకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ముందు హోంమంత్రి సుచరితకు అవమానాలు జరిగినట్లు దళిత సంఘాల్లోని మాల సామాజికవర్గం గుర్రుగా ఉంటోంది. కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలువలేని సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డదారిలో హోంమంత్రి అధికారాలను ఎంజాయ్‌ చేయడమేంటని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేయడంతో జిల్లాలో సలహాదారుతీరుపై దళిత సంఘాల్లో చర్చ మొదలైందట. సజ్జల రామకృష్ణారెడ్డి తీరుతో అసలైన హోంమంత్రి సుచరిత స్వయంగా ఓ సీఐని అవసరమున్నచోట పోస్టింగ్‌ వేయించుకోలేని స్థితిలోకి పోవాల్సివస్తోందని మాల సామాజికవర్గం ఆవేదన వ్యక్తం చేస్తోందట.

పెత్తనమంతా వాళ్లదే..!

గుంటూరు పర్యటనలో హోంమంత్రిని పక్కనబెట్టిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు అంతా సజ్జల రామకృష్ణారెడ్డికి జీహుజూర్‌ అనడం కేబినెట్‌ మంత్రిని అవమానించడమేనని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మి దళిత సంఘాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేస్తే పదవులు ఇచ్చామని చెప్పుకుంటోందని పెత్తనమంతా వారి చేతుల్లోనే పెట్టుకుంటోందని మాల సంఘాలు విమర్శిస్తున్నాయట.

కనీసం ఫొటో పెట్టరా..?

ఎమ్మెల్సీ లేళ్లఅప్పిరెడ్డి సన్మాన కార్యక్రమంలో కనీసం హోంమంత్రి పొటో కూడా పెట్టుకోలేదని ఇది తమ సామాజికవర్గాన్ని, పదవిని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. హోంమంత్రి సుచరితకు ఇంతకుముందు జరిగిన అవమానాలను సరిదిద్దుకోవాలని, మున్ముందు ఇలాంటివి జరక్కుండా చూడాలని మాలమహానాడు తీవ్రంగా హెచ్చరిస్తోంది. దళితులపై జరుగుతున్న దాడులపై ఖండనలు, అత్యాచారాలపై పరామర్శల కోసం  కూడా పార్టీ అనుమతి కోసం వేచిచూడాల్సిరావడం వైసీపీ హయంలోని తమ దుస్థితిని తెలియజేస్తోందని ఎస్సీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇలాగే చేస్తే పార్టీకి నష్టమే!

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దళిత ప్రజాప్రతినిధులపై జరుగుతున్న చిన్నచూపు రాజకీయాలను సరిదిద్దుకోకపోతే మున్ముందు ఉద్యమం తప్పదని మాలమహానాడు ఇప్పటికే అంతర్గతంగా హెచ్చరికలు పంపుతోందట. తరుచూ జరుగుతున్న అవమానాలను తట్టుకోలేక హోంమంత్రి సుచరిత తాజాగా గుంటూరు పర్యటనకువచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి పర్యటను దూరంగా ఉందనే చర్చ జిల్లాలో జరుగుతోందట. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుని మంత్రికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని లేకుంటే పార్టీకి నష్టం వస్తుందని అనుకుంటున్నారట.