Abn logo
Sep 15 2020 @ 11:46AM

విశాఖ వైసీపీ నేతల్లో విజయసాయి కలవరం!

అధికార పార్టీలోని కీలక నేతల నుంచి జిల్లా నేతల వరకు ఒక్కటే తీరు. కరోనా వైరస్ నియంత్రణలో పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఆదర్శంగా మెలగాల్సిన వారే.. కొవిడ్ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో సోషల్ డిస్టెన్స్ మాట మరిచి.. గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. తమ పార్టీ నేతల వైఖరిపై స్వపక్ష కార్యకర్తలే మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? వారి తీరు సొంత పార్టీ క్యాడర్‌నే ఎందుకు కంగారు పెడుతోంది?


విశాఖలో కరోనా కేసులు రోజు రోజుకి అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు సకల చర్యలు తీసుకుంటున్నారు. అయితే కరోనా నియంత్రణకు సాధారణ ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటే.. బాధ్యత గల ప్రజాప్రతినిధులు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదట. తాము అధికార పార్టీలో ఉన్నామన్న ధీమానో, లేక మరేదో తెలియదు కానీ.. వీరంతా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలలో నేతల తీరుపై స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. కరోనా నియంత్రణలో ఆదర్శంగా ఉండాల్సిన నేతలే.. నిర్లక్ష్యంగా ఉండటం ఏమిటని మండిపడుతున్నారు. చిత్రం ఏమిటంటే.. వైసీపీలో చాలా మంది నేతలకు కరోనా వైరస్ బారిన పడినవారే. ఇందులో విజయసాయిరెడ్డి, విశాఖ నగర వైసీపీ అధ్యక్షడు వంశీ కృష్ణ శ్రీనివాస్ తో పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా కొన్నాళ్లు విశాఖపట్నంలో పార్టీ కార్యాలయాన్ని కూడా మూసివేశారు.


విజయసాయిని కలవాలంటేనే జంకుతున్నారు..

ఇటీవల విమ్స్ కొవిడ్ ఆసుపత్రిని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ సత్యనారాయణ, నగర పార్టీ అధ్యక్షడు వంశీ కృష్ణ శ్రీనివాస్ సందర్శించారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం పీపీఈ కిట్ ధరించి కరోనా రోగులను పరామర్శించారు. ఆయన విమ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ఒక రకమైన భయం పట్టుకుంది. విజయసాయిరెడ్డి దగ్గరకు వెళ్లడానికి వీరంతా వెనుకాడారు. ఈ విషయాన్ని బయటకు చెప్పలేక, ఆయన దగ్గరకు వెళ్లలేక వారు నానాయాతన పడ్డారు. ఆయన పీపీఈ కిట్ వేసుకుని కరోనా రోగుల వార్డులోకి సురక్షితంగానే వెళ్లారనీ, బయటకు వచ్చాక ఆయనకు దగ్గరకు వెళితే తమకు వైరస్ సోకదన్న గ్యారంటీ ఏమిటనీ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెవులు కొరుక్కున్నారు.


వారికి డబ్బుంది.. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి?

నిజానికి కొవిడ్ కారణంగా కష్టాలు పడినవారు, ఆ వైరస్ బారిన పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న స్వానుభవం కలిగిన నేతలు విశాఖ వైసీపీలో చాలామందే ఉన్నారు. తాము స్వయంగా ఎదుర్కొన్న కరోనా వైరస్ ప్రభావాన్ని.. తమ పార్టీలోని ఇతర నాయకులకు, కార్యకర్తలకు రాకూడదనే స్పృహ కూడా వారికి లేదనే విమర్శలు స్వపక్షీయుల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైసీపీ కార్యాలయంలో వైఎస్ వర్దంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయ కర్తలు పాల్గొన్నారు. కానీ ఎక్కడా సోషల్ డిస్టెన్స్ పాటించినట్లు కనిపించలేదు. ఇదే విషయాన్ని కూడా పార్టీ కార్యకర్తలు లోలోనే ప్రశ్నించుకుంటూ.. నేతల వైఖరిని నిరసిస్తున్నారు. మెండుగా డబ్బులు, అన్ని సౌకర్యాలు కలిగిన నేతలకు కరోనా వైరస్ సోకితే.. దాని నుంచి వారు ఎలాగైనా బయటపడగలరనీ, అదే తమకు వస్తే పరిస్థితి ఏమిటనీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట.


వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోరు..?

మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఏ చిన్న నిరసన కార్యక్రమం చేపట్టినా, ఆందోళనకు దిగినా.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. మరి గుంపులు గుంపులుగా తిరుగుతూ సోషల్ డిస్టెన్స్ పాటించని అధికార వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న దృష్ట్యా కరోనా నిబంధనలను అధికార, ప్రతిపక్షాల నాయకులు అనే తేడా లేకుండా అందరూ పాటించాల్సిన అవసరముందని వారు స్పష్టం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కరోనా నియంత్రణలో అధికార వైసీపీ నేతలు ఆదర్శంగా వ్యవహరిస్తారో... లేక ఎప్పటిలాగే కొవిడ్ నిబంధనల అతిక్రమణకే పాల్పడతారో... చూడాలి.

Advertisement
Advertisement
Advertisement