Abn logo
Sep 25 2020 @ 10:45AM

దూకుడు పెంచిన కేటీఆర్.. ఆ తర్వాత పట్టాభిషేకమేనా?

Kaakateeya

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోకస్ పెట్టారా? రానున్న ఎన్నికల్లో వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహరచన చేస్తున్నారా? వివిధ సంఘాలతో కేసీఆర్ వరుస సమావేశాలు దేనికి సంకేతం? ఇతర పార్టీల్లోని బలమైన నాయకులకు టీఆర్ఎస్ గాలం వేస్తోందా? ఈ కథనంలో తెలుసుకుందాం..


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై గులాబీ యువరాజు కేటీఆర్ గురిపెట్టారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను 99 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుని మొదటసారి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే రానున్న గ్రేటర్ ఎన్నికల్లో వంద స్థానాలను గెలవాలని మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా పెట్టుకున్నారట.‌ ఇందుకోసం ఇప్పటికే ఆయన రంగంలోకి దిగారు. అధికారంలో ఉన్నంత మాత్రాన అలసత్వం వద్దని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారట. నిజానికి ఫిబ్రవరి 11 వరకు ప్రస్తుత పాలక వర్గానికి సమయం ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు బలపడకముందే గ్రేటర్ ఎన్నికలు ముగించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. అయితే మూడు నెలలు ముందుగా ఎన్నికలు నిర్వహిస్తేనే.. వాటిని ముందస్తు ఎన్నికలుగా పరిగణిస్తారు. దీంతో డిసెంబరు నాటికే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని అధికార టీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం.


టీఆర్ఎస్‌కు ఇబ్బందులు...

2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను కేటీఆర్ భుజాలపైనే పెట్టారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తండ్రి అప్పగించిన బాధ్యతను సవాల్‌గా తీసుకున్న కేటీఆర్.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం నుంచి అన్నీ తానై వ్యవహరించారు. మొత్తానికి 99 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. దీంతో ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు.. మునిసిపల్ శాఖను కూడా కేసీఆర్ బోనస్‌గా ఇచ్చారు. అప్పటి నుంచే రాష్ట్రంలో మునిసిపల్ శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. అయితే రానున్న గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో కేటీఆర్ ఇప్పటికే రంగంలోకి దిగి.. ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్నారు.


పార్టీ కార్యకర్తల్లో అదే చర్చ...

హైదరాబాద్‌లో వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. భారీగా కురిసిన వానల వల్ల నగరవాసులకు ఎదురైన ఇబ్బందులను తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేదాకా విశ్రమించడానికి వీల్లేదని.. అధికారులకు రెండు వారాలపాటు సెలవులు రద్దు చేశారు. వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మతులపై శ్రద్ధ పెట్టాలనీ, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలనీ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చేయాలని సూచించారు. ఇలాంటి చర్యల ద్వారా మంత్రి కేటీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు దూకుడు పెంచారని పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.


అభివృద్ధి పనులు చేస్తూనే.. మత పెద్దలతో...

కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతూనే.‌. హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్, ఫ్లై ఓవర్లు, రోడ్లు, ఫుట్ పాత్‌లు, పార్కులు, జిమ్‌ల ప్రారంభాలకు హాజరవుతూ.. బస్తీల్లో ఎన్నికల వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. ఇక గ్రేటర్‌లో ముస్లిం మైనారిటీ ఓట్లు అధికంగా ఉండటంతో గతవారం హోంమంత్రి మహమూద్ అలీతో సమావేశమై ముస్లిం ఓటు బ్యాంక్‌పై చర్చించారు. తాజాగా పాస్టర్లు, బిషప్స్‌తో సమావేశమైన కేటీఆర్.. క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. త్వరలో క్రిస్టియన్ భవన్, గ్రేవ్ యార్డ్ పనులు ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను బస్తీల్లో పరుగులు పెట్టిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ఇంఛార్జులను నియమిస్తున్నారు. ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను సైతం‌ ప్రకటించారు. ఇతర పార్టీల్లో బలమైన అభ్యర్థులకు గులాబీ కండువా కప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం.


ఆ తర్వాత పట్టాభిషేకమే..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతోపాటు దుబ్బాక ఉపఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం మంత్రి కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే.. అన్ని ఎన్నికల తర్వాత యువరాజుకు పట్టాభిషేకం జరిగే అవకాశముందని వారంటున్నారు. మరి కేటీఆర్.. ఈసారి జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటుతారో లేదో చూడాలి.

Advertisement
Advertisement